ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
ఉపనిషత్తులు - బ్రహ్మ సూత్రాలు - భగవద్గీత
మానవ జీవితానికి పట్టుకొన్న ఒకే ఒక సమస్య విషాదం. దాన్ని పోగొట్టుకొనే మార్గమేమిటా అని చాలా దూర మాలోచించారు మన పెద్దలు. వారే మహర్షులు. వారు ధ్యానంలో కూచుని దర్శించిన సత్యమే ఉపనిషత్తుల రూపంగా వెలువడింది. ఈశావాస్యం మొదలు బృహదారణ్యకం వరకూ పది ఉపనిషత్తుల సారమూ అదే. అది ఉన్నదున్నట్లు ఆకళించు కోలేక వాదోపవాదాలు బయలుదేరితే వాటిని సమన్వయించి చూపాడు మరలా బాదరాయణుడనే ఆచార్యుడు. ఆయన రచించినవే బ్రహ్మ సూత్రాలు. ఉపనిషత్తుల మీద సాగించిన విచారణ కాబట్టి దీనికి వేదాంత మీమాంస అని కూడా పేరు. ఈ రెండింటి మూలంగా మానవుడు గ్రహించిన సిద్ధాంతాన్ని తన దినచర్యలో దృష్టాంతం చేసుకోవాలంటే అది చూపటానికి వచ్చింది భగవద్గీత. ఇప్పుడీ మూడింటికీ కలిపి ప్రస్ఠానత్రయమని పేరు పెట్టారు మన ప్రాచీనులు. ప్రస్థానమంటే విషాదమనే సమస్యను తొలగించుకొనే మార్గం. విషాదం సమస్య అయితే మోక్షమనేది దానికి పరిష్కారం. పరిష్కార మార్గం ఒకటే అయినా అది అంచెలవారీగా ప్రయాణంచేసి అందుకోవాలి సాధకుడు. అవి మూడు భూమికలు. ఒకటి శ్రవణం. ఉన్నదంతా ఒకే ఒక ఈశ్వర చైతన్యం. అదే మన స్వరూపం. అంతకు మించి ప్రపంచమనేది వేరుగా లేదు - అని వేదంతుల సిద్ధాంతం. అది ముందు ఉపనిషత్తుల ద్వారా మనం శ్రవణం చేసి గ్రహించాలి. మరి చరాచర ప్రపంచ మొకటి మన చుట్టూ ప్రతిక్షణమూ చూస్తున్నాము గదా. దీనివల్లనే గదా మనకీ బాధలన్నీ. అలాంటప్పుడిదంతా పరమాత్మే నని ఎలా అర్ధం చేసుకోవాలనే సందేహ మేర్పడితే దాన్ని బ్రహ్మ సూత్రాల ద్వారా మననం చేసి పోగొట్టుకోవాలి మనం. అప్పుడు సంశయం పోయి అంతా ఈశ్వరుడేననే నిశ్చయ ఙ్ఞాన ముదయిస్తుంది. అయితే అది మానసికమే గాని ఆ అద్వైత భావం జీవితంలో అనుభవానికి వస్తుందా అని సందేహం. దానికి జవాబిస్తుంది మూడవది భగవద్గీత. ఆ జవాబే నిదిధ్యాస. నిదిధ్యాస అంటే ఏది చూసినా పరమాత్మేననే దృష్టి వదలకుండా చూడటం. ఇలా శ్రవణ మనన నిదిధ్యాసలనే మూడు దశలలో ప్రయాణం చేస్తే చాలు. చివరకు విషాదమనే సమస్య తప్పకుండా పరిష్కారమయి మోక్షమనే మహాఫలం సిద్ధించి తీరుతుంది. కనుకనే మూడింటికీ కలిపి ప్రస్థాన త్రయమనే పేరు సార్థకంగా పెట్టారు శాస్త్రఙ్ఞులు. కనుక జీవిత గమ్యమైన పురుషార్థమందుకోవాలంటే ప్రతి భారతీయిడికీ ఈ ప్రస్థానత్రయమనేది చదివి అర్థం చేసుకోవలసిన బాధ్యత ఉంది. ఒక్క భారతీయులకే గాదు. ఆ మాటకు వస్తే ప్రపంచ మానవులందరికీ ఇది కర్తవ్యమే. సందేహం లేదు. ఎందుకంటే అందరికీ ఉన్న సమస్యే సంసార బంధమనేది. అందులో నుంచి బయట పడాలంటే ఇక ఏ లౌకిక విద్యలూ కళలూ పట్టుకొన్నా సుఖం లేదు. ఏదో కొంత ఙ్ఞానమందిస్తాయే గాని పరిపూర్ణమైన ఙ్ఞానాన్ని అనందాన్నీ ప్రసాదించలేవవి. సావిద్యా యా విముక్తయే అన్నారు. ఏది జన్మతారకమో అదే విద్య అంటే. అది ఈ ప్రస్థాన త్రయం ద్వారా మనకు లభించే బ్రహ్మ విద్యే గాని మరేదీ గాదు. అంచేత అలాంటి బ్రహ్మవిద్య మానవుడికవి ఎలా బోధిస్తున్నాయో సంగ్రహంగా తెలుసుకుందా మిప్పుడు.