ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
5. ముండకోపనిషత్తు
ఇందులో ఉపపత్తి ఏమంటే ఎందులో నుంచి ఒకటి జన్మిస్తుందో అది అందులోనే చివరకు లయమవుతుంది. అసలది జన్మించటం - దాని జన్మస్థానం ఫలానా అని మనకు చూపటానికే. కార్యాన్ని బట్టి కారణాన్ని అందుకోవాలి మానవుడు. అందుకే సృష్టి వాస్తవంగా జరగకపోయినా జరిగినట్టు వర్ణిస్తుంది శాస్త్రం. ఈశ్వరుడు జీవుడిగా వచ్చి శరీరంలో ప్రవేశించక పోయినా నిజంగా ప్రవేశించినట్టే వర్ణిస్తుంది. ఈ సృష్టి ప్రవేశాలు రెండూ వాస్తవం కావు. శాస్త్రం చేసిన కల్పన. కారణమేమంటే ఇవి వాస్తవంగా చూస్తున్నంత వరకూ మోక్షం లేదు మానవుడికి. అలా చూడవద్దని కేవల మాత్మ తాలూకు ఆభాసే. అదే జీవ జగద్రూపంగా భాసిస్తున్నది. వీటి నాధారం చేసుకొని పయనిస్తే ఇవే మనలను ఆ మూలతత్వం దగ్గర చేరుస్తాయని చెప్పటమే శాస్త్ర హృదయం. ఈ భావమిప్పుడు బయటపెడుతున్నది ముండకోపనిషత్తు. జడపదార్థాల దగ్గరి నుంచి చేతన పదార్థాల వరకూ సమస్తమూ ఆ పరమాత్మ నుంచి అగ్నిహోత్రం నుంచి నిప్పు రవ్వలలాగా చెదిరిపడ్డవే. కనుకనే ఇవి ఆద్యంతాలలో పరమాత్మ స్వరూపమే. మధ్యలో వేరుగా కనపడుతున్నా అదే వీటి స్వరూపం. బ్రహ్మ పశ్చా ద్బ్రహ్మ పురస్తాత్. అంచేత మానవుడు తన ముందూ బ్రహ్మమే తన వెనకా బ్రహ్మమే - పైనా క్రిందా చుట్టూ ఉన్నదంతా బ్రహ్మ చైతన్యమేనని చూడాలి. అదే గొప్ప సాధన. దాని కోసం ప్రణవోధనుశ్శరోహ్యాత్మా - ఓంకారమే ధనుస్సు - మనస్సే అందులో ఎక్కుపెట్టిన బాణం - బ్రహ్మమే దానికి లక్ష్యమని భావించి దాన్నే భేదించి పట్టుకోవాలి మనస్సుతో నిరంతరం. అదే మోక్షదాయకం.