బ్రహ్మ సూత్రాలు
ఉపనిషత్తులు శ్రవణ ప్రధానమైతే బ్రహ్మ సూత్రాలు మనన ప్రధానమని చెప్పాము. మనన మంటే విచారణ. ఉపనిషద్వాక్యాల మీదనే మననం చేశాడు బాదరాయణుడనే ఆచార్యుడు. దాని ఫలితమే ఈ బ్రహ్మ సూత్రాలనే గ్రంధం. 555 సూత్రాలున్నయిందులో. అవి నాలుగు ధ్యాయాలుగా విభజించాడు. అందులో మొదటిది సమన్వయం. రెండవది అవిరోధం. మూడవది సాధన. నాలుగవది ఫలం.
సమన్వయం
బ్రహ్మమే ప్రపంచ సృష్టికి మూల కారణం. మరేది కాదని సమన్వయించి చూపాడు కాబట్టి సమన్వయాధ్యాయ మని పేరు వచ్చింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాసా అనే సూత్రంతో ఆరంభ మవుతుంది. బ్రహ్మతత్త్వాన్ని గురించి అన్వేషణ చేయాలి. ఎందుకు. అదే పరమ పురుషార్ధం. దాన్ని తెలుసుకొంటే చాలు. సమస్తమూ తెలిసి పోతుంది. ఎలాగ. సృష్టిని బట్టే సృష్టికర్తను గ్రహించాలి ఎప్పుడేగాని. ప్రపంచ సృష్టికి బ్రహ్మమే కర్త. అదేమిటి ప్రకృతే కారణమన్నాడు కపిలుడు. పరమణావులే కారణమన్నాడు కణాదుడు. అంతకుముందు లేదీ ప్రపంచం. తరువాత వచ్చింది కాబట్టి అభావమే కారణమన్నారు బౌద్ధులు. అసలేదీ గాదు. దానిపాటికది సహజంగానే తయారయి ఉందన్నారు స్వభావవాదులు. ఇవన్నీ కొట్టేశారు బాదరాయణులు. ప్రకృతి అంటే అచేతనం గదా. దానికి సృష్టి చేయాలనే సంకల్ప మెక్కడిది. మరి పరమాణువులు పోగయిగదా సృష్టి జరగవలసింది. వాటిని పోగు చేసిన వాడెవడు. స్వభావ మంటారా. దానిపాటికది జరగాలంటే అది ఇప్పుడు కూడా జరగాలి గదా. ఏదీ ఏ ఒక్క అచేతన పదార్ధమూ చేతనం సహాయం లేకుండా కదలిపోవటం లేదు గదా. ఇక అభావమే కారణమంటారా. అభావమంటే లేనిది గదా. లేనిదానిలో నుంచి ఉన్నది ఎలా వస్తుంది. పైగా ఆ వచ్చిన ప్రపంచాన్ని ఉందని చూస్తున్నాము గదా. కార్య ప్రపంచమున్నప్పుడు దాని కారణం లేనిదెలా అవుతుందని నాలుగింటినీ త్రోసిపుచ్చారు. అంతేగాదు. చేతనమైన పరమాత్మే దీనికి కారణమన్నప్పుడెలాంటి కారణమది. నిమిత్తమా? ఉపాదానమా? నిమిత్తమంటే చేతనం. ఉపాదానమంటే అచేతనం. కార్యమయిన కుండకు చేతనుడైన కుమ్మరీ కారణమే. అచేతనమైన మట్టీ కారణమే. రెండూ ఉండాలి. కానీ ఇక్కడ రెండూ వేరుగా లేవు. కార్యరూపమైన ప్రపంచానికి నిమిత్తోపాదానాలు రెండూ పరమాత్మే. కనుకనే ప్రపంచానికెంత అతీతమో అంత దగ్గరగా ప్రపంచంలో ప్రతి అణువూ మృత్తికలాగా వ్యాపించి ఉన్నాడు. ఇదీ బాదరాయణులు చేసిన సమన్వయం.
అవిరోధం
అయితే ఇది కపిలాది అచేతన కారణవాదులు గాని, ఈశ్వర కారణవాదులైన ద్వైతులు గాని ఒప్పుకోలేదు. కేవలం చేతనమే కారణమైతే అందులో నుంచి దానికి విలక్షణమైన జడ ప్రపంచమెలా వచ్చిందని వారి వాదం. దానికి బాదరాయణుల సమాధానమేమంటే, రాలేదు వాస్తవంలో ప్రపంచం. ఇది ఆరంభం కాదు Creation. లేదా పరిణామమూ Evolution కాదు. అలాగైతే పరమాత్మ దెబ్బతింటాడు. నిరాకారమూ సర్వవ్యాపకం గదా పరమాత్మ అంటే. అలాంటప్పుడు రెండవ పదార్ధమెలా రాగలదు. రెండవది వాస్తవమే అయితే పరమాత్మ సర్వవ్యాపకమెలా కాగలడు. కనుక ఆరంభ పరిణామాలు చెప్పగూడదు. మరి ఎలా వచ్చిందీ ప్రపంచం. ఇది కేవలం వివర్తం. అంటే సృష్టి జరిగినట్టు చేసినట్టు భాసిస్తున్నదేగాని వాస్తవంగా జరగలేదు. మరి ఈ భాసిస్తున్నదెవరు. ఫ్రపంచం కాదు. పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు సచ్చిద్రూపంగా. అది స్వరూపావస్ధ. నామరూపాత్మకంగా అది విభూతి Manifestation వస్తువొక్కటే. రెండవది వస్తువు గాదు. దాని విస్తారం. సువర్ణమొక్కటే. కంటెలు, కమ్మలు, కాసుల దండలు, ఒడ్డాణాలు దాని విభూతి లేదా విస్తారం. దీనికే సంస్ధానమని పేరు పెట్టారు భగవత్పాదులు. సువర్ణ సంస్ధానమాభరణాలయినట్టే సత్సంస్ధానమే Constitution ఈ ప్రపంచం. మరి ద్వైతులు కూడా ఈశ్వరకారణవాదులే గదా. వారిని కాదనటం దేనికని ప్రశ్న. వారు ఈశ్వరుణ్ణి నిమిత్తంగానే ఒప్పుకొంటారు గాని ఉపాదానంగా ఒప్పుకోరు. అలాంటప్పుడా ఈశ్వరుడింత నిర్దాక్షిణ్యంగా సృష్టి ఎందుకు చేసాడని ప్రశ్న వస్తుంది. అంతేగాక కర్తృత్వం చెప్పినప్పుడు భోక్తృత్వం కూడా ఈశ్వరుడికే చెప్పవలిసి వస్తుంది. అప్పుడిక జీవుడికి లేవు బంధ మోక్షాలు. ఈశ్వరుడి మెడకే చుట్టుకుంటాయి. ఉపాదానం కూడా ఈశ్వరుడే అయితే ఈ ప్రమాదం లేదు. ఎందుకంటే జీవజగత్తులను కూడా ఈశ్వర చైతన్యమే వ్యాపిస్తుంది. వ్యాపిస్తే జీవజగత్తులు వాస్తవం కాక ఆభాస అవుతాయి. అప్పుడిక బంధ మోక్షాలు జీవుడికి చెప్పినా అవీ ఆభాసే. వాస్తవం కావు. కనుక కార్యకారణాల కెలాటి విరోధమూ లేదు. రెండూ ఒకే ఒక స్వరూపమవుతాయి. అయితే అవిరోధమే.
సాధనాధ్యాయం
అవిరోధమయింది. ఇక సాధన. జీవజగదీశ్వరులు ముగ్గురూ చైతన్యరూపంగా ఏకమేనని తీర్మానించారు. అయితే ఇక సాధన ఏమిటి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అని ప్రశ్న. జీవుడే చేయాలన్నారు. వీడు ఈశ్వరుడే నన్నారు గదా. నిజమే - వస్తుతః ఈశ్వరుడే - కాని అలా భావించటం లేదీ జీవుడు. మరేమని భావిస్తున్నాడు. నేను అంటే శరీరమూ, మనస్సూ ప్రాణమే. ఇంతకన్నా వేరుగా లేనని భావిస్తున్నాడు. ఈశ్వరుడయి కూడా కానని బావించట మెలా జరిగింది. అనాది కాలం నుంచి వస్తున్న అవిద్య లేదా అజ్ఞానం వల్లనని జవాబిస్తారు అద్వైతులు. అజ్ఞానమంటే జ్ఞానం లేకపోవటం కాదు. అంతో ఇంతో జ్ఞానముంది మనకిప్పుడు. అయితే అది పరిపూర్ణంగా లేదు. సర్వవ్యాపకంగా ఉన్నాను నేనని భావిస్తే అది పూర్ణజ్ఞానం. అలా కాక ఒక శరీరం మేరకే ఉన్నానని భ్రమపడితే అది విశేషజ్ఞానం. ఈ విశేషజ్ఞానమే అజ్ఞానం. అంటే సర్వవ్యాపకమైన జ్ఞానం లేక పోవటం. అది లేకపొతే నేమి. ఇది ఉంది గదా అంటే - దీనివల్ల ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపత్రయమనుభవించ వలసి వస్తున్నది. ఇదే సంసార బంధం మానవుడికి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేనా పరమాత్మనే అనే పరిపూర్ణ జ్ఞానమందు కోవాలి. అది ఎలాగా. క్రొత్తగా అందుకోనక్కరలేదు.. వాస్తవంగా ఈ జీవుడీశ్వరుడే గనుక కేవల మా సత్యాన్ని గుర్తిస్తే చాలు. దీనికే ప్రత్యభిజ్ఞ Recognition అని పేరు. శాస్త్రం దీనినే తత్త్వమసి వాక్యం ద్వారా మనకు బొధిస్తుంది. నీవా సచ్చిద్రూపుడవనే ఈ వాక్యాని కర్ధం. కేవలం నేను సన్మాత్రుడనే చిన్మాత్రుడనే నని అర్ధం చేసుకొంటే సద్విశేషమైన ప్రపంచమూ, చిద్విశేషమైన భావ ప్రపంచమూ ఏమయిపోతాయి. అవి ఈ సచ్చిద్దృష్టితో చూస్తుంటాడు కాబట్టి అందులో కరిగిపోతాయి. ఎలా పోతాయని ప్రశ్న లేదు. వాస్తవమైతే పోదుగాని ఆభాస అయితే తప్పకుండా పోతుంది. ఒక స్వప్నం మెలుకువ వచ్చే సరికెలా పోతుందో అలాగే నన్నారు. అయితే వాస్తవమేదో దాని బలంతో గాని ఇది పోదు. రజ్జువును చూడకుండా సర్పమెలా పోతుంది. అలాగే తన సదాకార చిదాకార స్వరూపాన్ని గుర్తు చేసుకొని ఆ దృష్టితో జీవుడీ ప్రపంచాన్ని చూచినప్పుడే ఇది తేలిపోతుంది. ఈ భావనే వేదాంతంలో సాధన. ఈ భావనలో ప్రపంచం అంతా, జీవించినంత కాలం ఆభాసగా తేలిపోయి ఒక నీడలాగా కనిపిస్తుంది. జీవితానంతరం శరీరమేలేకుండా పోతుంది కాబట్టి ఆభాసగా కనిపించేది కూడా తన శక్తిగా మారి అనుభవానికి రాగలదు.
ఫలాధ్యాయం
సాధన అయిన తరువాత చివరగా చెప్పవలసింది ఫలం. ఫలమనేది మోక్షమే. మోక్షమంటే విడుదల. శరీరమూ ప్రపంచమూ ఇవి రెండే గదా బంధం మనకు. వీటివల్లనే గదా సమస్య. ఇవి రెండూ ఆభాస అని తేల్చుకొన్న తరువాత ఇక తాను కర్త కాడీ జీవుడు. కర్త కాకుంటే భోక్తా కాడు. కేవలం సాక్షిగా మిగిలిపోతాడు. కర్మఫలమైన సుఖదుఃఖాదులేవీ లేవీ లేవు కాబట్టి నిత్యమూ సుఖమే. తన చైతన్య స్వరూపమే తనకెప్పుడూ ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తుంది. అంతా ఆత్మే అనాత్మ లేదు. ఈ ఏకాత్మ భావమే మోక్షం. ఏది చూచినా ఏది చేసినా ఏది ఆలోచించినా తానే తనలో, అద్దంలో ముఖంలాగా, తనకు తానే ఉన్నాననే ప్రజ్ఞతో ఉంటాడు. సుఖదుఃఖాలూ జనన మరణాలు కూడా తన స్వరూపమే. అప్పుడిక మరణమనే భయం కూడా ఎగిరిపోతుంది. మరణమంటే మరణించేవాడు మరణమూ వేరుగా ఉన్నప్పుడే గదా. అంతా నిరాకారమైన ఆత్మే అయినప్పుడిక మరణమెక్కడిది. అయితే మరణమెవరికి. శరీరానికి, తనకు గాదు. చైతన్యంగా మరణించడు. దాని ఆభాసగా మరణిస్తాడు. ఇది ఒక గొప్ప అనుభూతి. సముద్రం జలంగా మరణించదు. తరంగ బుద్బుదాదులుగా మారుతుంది మరణిస్తుంది. తన మరణాన్ని తానే చూస్తుంది. అలా చూడగలిగితే మరణం కాదది. మోక్షం. క్రొత్తగా వచ్చేది గాదీ ఫలం. వస్తుసిద్ధంగా ముక్తులమే మనం. బుద్ధిసిద్ధంగా కాకుండా పోయాము. మరలా వస్తువును గుర్తిస్తే అది వస్తుబుద్ధి కాబట్టి ఎప్పుడూ ముక్తులమే ననే ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. ఆ జ్ఞానాగ్నిలోఈ జ్ఞేయ ప్రపంచమంతా సమిధల లాగా కాలి బూడిద అయిపోతుంది. కాబట్టి అసలు సంసార బంధమనే ప్రశ్నే లేదు. దీనికే ప్రవిలాపన Through merger మని పేరు పెట్టారు. ఇదే జీవిత పరమార్ధమైన మోక్ష ఫలం.
ఓం తత్సత్