#

About Us

శ్రీ గురుభ్యో నమః


బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు పూజ్యులు, ప్రాతః స్మరణీయులు. వీరు శ్రీమతి సీతమ్మ, శ్రీ సుందరరావు దంపతులకు 1927వ సంవత్సరం జూన్ 15 వ తేదీ, ప్రభవ జ్యేష్ట శుద్ధ పూర్ణిమ బుధవారము ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించిరి. వీరి విద్యాభ్యాసము ఓంగోలు, గుంటూరు, వాల్తేరులలో జరిగింది. 1948 లో ఆంధ్ర విశ్వ విద్యాలయము నందు M.A నందు పట్టభద్రులైనారు.అనంతపురం నుండి శ్రీకాకుళము వరకు ఎన్నో ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య-అద్వైత వేదాంతోపన్యాసనలు కొనసాగిస్తూ 1982 లో కడపలో పదవీ విరమణ గావించిరి.


తర్వాత కాలము నుండి గురువు గారు హైదరాబాదులో నివసిస్తూ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అనేక గ్రంధాలును శంకర భాష్యంతో ప్రవచనాలు చేస్తూ తమ శిష్యులకు అద్వైత విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. 2001 వ సంవత్సరమున గురువు గారు హైదరాబాదు నుండి విజయవాడకు తమ నివాసమును మార్చుకున్నారు. తర్వాత కాలము నుండి గురువు గారు విజయవాడ లో మరల ప్రస్థానత్రయం శంకర భాష్యంతోను, మానసోల్లాసము, వేదాంత పంచదశి, త్రిపురా రహస్యము, వేదాంత ప్రకరణ వంటి అనేక గ్రంధాలు మరియు శ్రీ లలితా సహస్రనామములు, శ్రీ విష్ణు సహస్రనామములు ను అద్వైత పరంగా సమన్వయం చేస్తూ తమ శిష్యులకు ప్రవచనముల ద్వార, గ్రంధ రచనల ద్వార అందించిన జీనన్ముక్తులు. గురువు గారు అక్టోబర్ 2015 వ సంవత్సరము వరకు 60 సంవత్సరములు అద్వైత విజ్ఞానాన్ని అందిస్తూ 19 డిసెంబర్ 2015 వ సంవత్సరమున విదేహముక్తులైనారు.ఇంత జ్ఞానాన్ని లోకానికి అందించిన గురువర్యులు మహనీయులు, పూజ్యనీయులే.


గురువు గారు అద్వైత విచారణే జీవిత లక్ష్యంగా ప్రచారానికి దూరంగా జీవిస్తూ సాధన చేస్తూ సిద్దులై వారు సాదించిన అద్వైత విజ్ఞానాన్ని లోకానికి అందించాలని నిరంతరము కృషి చేసిన మహాజ్ఞాని.వారి ప్రవచనాలు శ్రవణము చేసే అద్వైత సాధకులు ఎవరికైన ప్రస్తానత్రయంను శ్రవణం చేసిన వారికి గురువు గారి కృషి అర్ధమవుతుంది.


గురువు గారి ప్రవచనాలను website, youtube ద్వార అందించటం గురువు గారిని ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో కాదు. గురువు గారు ప్రచారం కావాలని ఏ నాడు ప్రయత్నించ లేదు. ఈ ప్రయత్నం గురువు గారు జీవిత కాలం చేసిన కృషిని లోకానికి అందించాలని మాత్రమే.

img