భగవద్గీత
ఉపనిషత్తులూ బ్రహ్మ సూత్రాలు రెండూ చెప్పుకొన్నాము. ఒకటి శ్రవణ ప్రధానమైతే ఇంకొకటి మనన ప్రధానమని కూడా పేర్కొన్నాము. ఆ రెండింటి సారమేదో గ్రహించాము. పోతే ఆ శ్రవణమైన మననమైన జ్ఞానాన్ని దినచర్యలో స్వానుభవానికి దెచ్చుకొనే మార్గమేదో అది ఆలోచించాలి. అలా తెచ్చుకోటానికే నిదిధ్యాస అని పేరు. దాన్ని మనకు బోధించటానికే వచ్చింది భగవద్గీత లోకంలోకి. ఇది 18 అధ్యాయాల గ్రంధం. అందులో మొదటిది సమస్యను చెబుతుంది. అదే విషాద యోగం. చివరిది దానికి పరిష్కారం తెలుపుతుంది. అది మోక్ష సన్యాసం. పోతే మధ్యలో ఉన్న పదహారు రకరకాలుగా ఆ మార్గాన్ని చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాయి. క్రమంగా తెలుసుకొందాము.
1. విషాదయోగం
కురుక్షేత్రమేదో గాదు. సంసారం. రథం మన శరీరమే. ఇందులో కూచున్న జీవుడే అర్జునుడు. నరుడని కూడా అర్జునుడికి పేరు. పోతే సారథి కృష్ణుడు, మన బుద్ధి. జీవితమే సంగ్రామం. ఇందులో అనుకూల ప్రతికూల పరిస్ధితులే పాండవ కౌరవ సేనలు. మనబోటి జీవులే చేయాలీ యుద్ధం. చేస్తే జయమో అపజయమో చెప్పలేము. పరిస్థితులనుకూలమైతే విజయం. ప్రతికూలమైతే పరాజయమే. చాలావరకు మన మాశించిన దెప్పుడూ జరగదు. అనుకూలించదు. కనుక పరాజయమే మూడు వంతులు. అందుకే తరుచు విషాదమే ఎదురవుతుంది మానవుడికి. ఏమి కారణం. పరిస్థితులను కూలించకనా. కావచ్చు. ఎందుకను కూలించటం లేదు. అహంకార మమకారాలే దీనికంతటికీ కారణం. ఈ శరీరం మేరకే నేనని అభిమానించటం అహంకారమైతే, మిగతా దంతా నాకన్యమని చూడటం మమకారం. శరీరం వరకు ఆగిపోతే మిగతా దన్యం గాక ఏమవుతుంది. అందులో కూడా తనకు కావలసిందైతేనే మరలా మమ అని చూస్తాడు. లేకుంటే న మమ - నా కక్కర లేదని త్రోసిపుచ్చుతాడు. ఇవే రాగద్వేషాలనే ద్వంద్వాలు. వాటి వల్ల సుఖదుఃఖాలు. ఇదే సంసార బంధం. అన్నిటికీ మూలమీ అహంకారమే. అంటే దేహాత్మాభిమానం. అది మమకారానికి దారి తీస్తే - అనుకూల ప్రతికూలాలను సృష్టిస్తే - దాని వల్ల సుఖదుఃఖాది ద్వంద్వా లేర్పడుతున్నాయి. అర్జునిడి కెదురైన సమస్య ఇదే. ఇదే విషాదం. ఒక అర్జునుడికే గాదు. మనందరికీ జీవితంలో నిత్యమూ ఎదురయ్యే సమస్యే ఇది. ఈ విష వలయంలో చిక్కి సతమతమవుతుంటాడు నరుడు. వాడెంత కోటీశ్వరుడైనాఎంత నిష్ఠదరిద్రుడైనా - ఎలాటి మేధావంతుడైనా - ఏమాత్రం తెలివిలేని మూఢుడైనా తప్పదీ విషాదయోగం.
2. సాంఖ్యయోగం
మరి ఏమిటి దీనికి పరిష్కారం. చికిత్స చేసే ముందు వ్యాధి ఏమిటో అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. వ్యాధి విషాదం. అది దేహాత్మాభిమాన రూపమైన అహంకారంవల్ల వచ్చిందని తెలిసిపోయింది. పోతే దీని నెలా పరిష్కరించుకోవాలి. సాంఖ్యమే పరిష్కారం. సాంఖ్యమంటే వేరు చేసి చూడటం. ఆత్మ అనాత్మ రెండూ కలసి కలగాపులగమయి ఉన్నాయి. శరీరానికి వేరుగా ఉంది మన ఆత్మ. అది శుద్ధ చైతన్యం. ఇది జడమీ శరీరం. సంబంధం లేదు. అయినా ఈ దేహమే నా స్వరూపమని భ్రమ పడుతున్నాము. అందుకే ఇది జన్మిస్తే నేను జన్మించానని- ఇది మరణిస్తే నేనే మరణిస్తున్నానని దీని లక్షణాలు నామీద ఆరోపించుకొన్నాను. నిజంలో నేననే జ్ఞానమెప్పుడూ మారదు. మరణించదు. చైతన్య రూపంగా అందరు నిత్యులే. దేహమే అనిత్యం. దేహి కాదు. బాల్యయౌవనాది దశలన్నీ దేహానికే గాని దేహికి అంటవు. దేహి చేతనంగా సర్వత్రా ఉన్నాడు. దాని నెవరూ నశింపజేయలేరు. నశించేవి శరీరాలే. వాటికే జనన మరణాలు. త్రిగుణాత్మకమవి. గుణసంపర్కం వల్లనే దేహి అయిన ఆత్మ జనన మరణాల పాలయి బాధ పడుతున్నాడు. అవిద్యా కామ కర్మల వల్లనే ఈ దేహ సంబంధం మానవుడికి. అవిద్య వల్ల కారణ శరీరం. కామం వల్ల సూక్ష్మ శరీరం. కర్మ వల్ల స్ధూల శరీరం - మూడూ శరీరాలతో సంపర్క మేర్పడింది. మిగతా రెండింటికీ అవిద్యే మూలం. అందుకే కారణ శరీరమన్నారు దాన్ని. తాను కాని దాన్ని తానని భ్రమపడటమే అవిద్య. అది మన చైతన్యాన్ని ఆవరించి శరీరం మేరకు తగ్గించింది. దానివల్ల మిగతాదంతా ప్రపంచంగా కనిపించి అది పొందాలనే కామ మేర్పడింది. ఇదే సూక్ష్మశరీరం. కామాని కనుగుణంగా తనకు కావలిసిందంతా పోగు చేసుకొనే కర్మ ఏర్పడింది. ఇదే స్ధూల శరీరం. అది ఫలిస్తే సంతోషం. ఫలించకుంటే విషాదం. కాబట్టి బుద్ధి యుక్తో జహాతీహ. ఆత్మ అంటే ఏమిటో దాని జ్ఞానమార్జించాలి. అప్పుడు విహాయ కామాన్ - కామాన్ని జయించగలడు మానవుడు. నిర్మమో నిరహంకారః - కామం పోవాలంటే అహం మమలు లేకుండా పోవాలి. సుఖదుఃఖేసమే- సుఖదుఃఖాది ద్వంద్వాలు సమంగా భాసిస్తాయి సాధకుడికి. ఈ స్ధితికే బ్రాహ్మీ స్ధితి అని పేరు. ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠం. నదుల వెంట బడి పోదు సముద్రం. అది కదలకుండా ఒకచోట స్థిరంగా ఉంటే నదులన్నీ వచ్చి అందులో చేరిపోతాయి. అలాగే నిష్కామంగా నీవుంటే నీ దగ్గరకే వస్తాయన్నీ. ఇదీ సాంఖ్యం చెప్పే మాట.
3. కర్మయోగం
ఏ కామమూ లేకుండా ఊరక కూచుంటే దినచర్య ఎలా జరగాలి. దినచర్య అంటే కర్మే గదా. కామం లేకుండా కర్మ ఎలా చేయగలం. నహికశ్చిత్ క్షణమపి - ఒక్క క్షణం కూడా ఊరక కూచోలేడెవడూ నిద్రలో తప్ప. అప్పుడు కామం లేదు కర్మ లేదు. కాని దాని వాసన లుంటాయి. అవి మరలా జాగ్రత్తులో బయటపడతాయి. ఇక ఎప్పుడీ కర్మ బంధం నుంచి విముక్తి? కర్మ అంటే చేయటమూ, నిష్కర్మ అంటే మానటమూ కాదు. ఏ పని చేసినా - అది మానసికమే గాదు - వాచికమే గాదు - కాయకమే గాదు - యజ్ఞార్ధమని చేస్తూ పోవాలి. యజ్ఞమంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర చైతన్యమే నాచేత ఈ పని చేయిస్తున్నదని భావించాలి. అప్పుడే నేననే అహంకారం పోతుంది. ముక్తసంగుడయి చేయాలి కూడా. అంటే ఫలితం నాకు అనుకూలించాలనే కామం కూడా పనికిరాదు. అదీ ఆ ఈశ్వరుడికే అప్పజెప్పాలి. అప్పుడు మమకారం కూడా తొలగిపోతుంది. అహం మమలు రెండూ పోతే కామం లేదు. కర్మ లేదు. అవి ఉన్నా జీవుడివి కావు. జీవుడీశ్వరుడి కర్పించాడు కాబట్టి ఈశ్వరుడివే. జీవకర్మ ఈశ్వరుడి కర్మే, జీవుడి కామం ఈశ్వర కామమే. ఇదీ కర్మయోగ సూత్రం.
4. జ్ఞాన యోగం
ఇలా ఈశ్వర భావన చేస్తూ దాని వెలుగులోనే జీవయాత్ర సాగిస్తూ పోతే కర్మ జ్ఞానంగా మారుతుంది. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ రెండూ ఏకమవుతాయి. రెంటికీ భేదం లేదు. ఒకటి దృష్టి మరొకటి దాని ప్రసరణ. సముద్ర జలమూ దాని చలనమూ ఒకటి గాదా. అలాగే ఇదీ. అప్పుడు కర్త అయినా కర్త కాడు మానవుడు. జ్ఞానమనే అగ్ని కామకర్మలు రెంటిని కాల్చి వేస్తుంది. అప్పుడు ఒక కర్మ చేస్తున్నా చేయనివాడే. అయితే ఈ నిబ్బరం మన కలవడాలంటే ఎక్కువ పనులు పెట్టుకోరాదు. శరీరం నిలవటానికి కెంతో అంతే పెట్టుకోవాలి. లేకుంటే పనుల భారం మనలను కుంగదీస్తుంది. ఈశ్వర జ్ఞాన మలవడదు. అంతా ఈశ్వరుడనే జ్ఞానం మనసులో గట్టి పడితే వాడు గత సంగుడే ముక్తుడే. అలాటి వాడే పని చేసినా సమగ్రం ప్రవిలీయతే. ఆ కర్మ ఫలంతో సహా సమసి పోతుంది. వాణ్ణి బంధించదు. వాడి జీవితమే ఒక మహా యజ్ఞం. జ్ఞాన యజ్ఞమది. భౌతికం గాదు. అందులో ప్రతి ఒక్క ఆలోచనా క్రియా బ్రహ్మ స్వరూపమే. జ్ఞానే పరిసమాప్యతే - ప్రతిదీ సమష్టి చైతన్యంగానే దర్శనమిస్తూ పోతుంది. ఇలాంటి జ్ఞాన మలవడాలంటే మాటలు గాదు. గురూపదేశ ముండాలి మొదట. గురువులంటే జ్ఞానులూ తత్వదర్శనులూ. వారిని శ్రధ్దా భక్తులతో సేవిస్తే జ్ఞానోపదేశం చేస్తారు. తన్మూలంగా సమస్త భూతాలలో ఆత్మనే దర్శిస్తూ పోయే సామర్ధ్య మేర్పడుతుంది. అవిద్యా కామాది కాలుష్య మెంత ఉన్నా అది జ్ఞానంలొ ప్రక్షాళన మయిపోతుంది. కాని ఇలాంటి జ్ఞానయోగం కర్మ యోగం వల్లనే కలుగుతుంది. దానికి కొంత కాలం పడుతుంది. అది మన శ్రద్ధను బట్టి తత్పరత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఒక శిక్షణ. దానివల్ల సంపాదించే ఉద్యోగం లాంటిది జ్ఞానం. జ్ఞానమే లభించిందో పరాం శాంతిం పరమమైన శాంతి చేకూరుతుంది. దానికిక ఆలస్యం లేదు. అయితే అజ్ఞుడికి అశ్రధ్దాళువుకూ, సంశయ స్వభావుడికీ అబ్బేది కాదా భాగ్యం. కర్మయోగంతోనూ జ్ఞనాభ్యాసంతోనూ వాటిని పోగొట్టుకొన్న వాడికే జీవితంలో శాంతి సౌఖ్యం.
5. కర్మ సన్న్యాస యోగం
ఇక్కడ ఒక సందేహం. కర్మలు సన్న్యసించటమా లేక ఆచరించటమా - దేనివల్ల లభిస్తుంది శాంతి అని చాలామంది మల్లగుల్లాలు పడుతుంటారు. దానికి జవాబేమంటే జ్ఞానం లేకుండా తొందరపడి సన్న్యసించినా ప్రయోజనం లేదు. జ్ఞానముంటే సన్యసించ నక్కరా లేదు. అసలు జ్ఞానముదయించాలంటే కర్మ కావాలి మనకు. అయితే అది గుడ్డిగా అనుష్ఠించటం కాదు. ఈశ్వరార్పణ బుధ్ధితో ఆచరించటం. దాన్నే గీత కర్మయోగమని పేర్కొంటున్నది. కర్మయోగ బలం లేకుండా సన్న్యాసం సాధ్యం కాదు. సన్న్యాస మంటే మరలా ఏదో గాదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మ స్వరూపమే ఈ మనోవాక్కాయాలతో చేసే పనులన్నీ, కనుక దాని మీదనే కర్మలన్నింటినీ ఆరోపించాలి. తన మీద గాదు. వ్యష్టి బుద్ధి సమష్టి బుద్ధిగా మారాలి. ఇదే సన్న్యాసమనే మాట కర్ధం. నైవకింత్కరోమీతి. అప్పుడే పని చేస్తున్నా - అది శాస్త్రీయమే గాదు లౌకకమే గాదు. నేనుగా ఏమీ చేయటం లేదు. ప్రకృతి గుణాలే దాని గుణాలతో సాంగత్యం పెట్టుకుంటున్నదని సాక్షిగా చూడటం అలవడుతుంది. మనస్సుతోనే వదులకోవా లేదైనా. శరీరంతో కాదు. అసలు ఏ జీవికీ కర్మలని కర్తృత్వమని సృష్టించ లేదీశ్వరుడు. స్వభావస్తు ప్రవర్తతే. త్రిగుణాత్మకమైన మాయాశక్తే వాటిని తెచ్చి పెట్టింది. సహజం కాదిది. ఆగంతుకం. కనుక సహజమైన మన ఆత్మ స్వరూపం మనమర్ధం చేసుకొంటే చాలు. ఏ గొడవా లేదు. రాగద్వేషాలు సుఖదుఃఖాలూ - ద్వంద్వాలన్నీ ఎగిరిపోతాయి. బ్రతికుండగానే సృష్టి రహస్యం భేదింగలడు మానవుడు. అదేదో గాదు. ఎప్పుడూ సామ్యావస్ధలో Equi poise మనస్సు నిలిచి ఉండటమే ఏకైకమైన సాధనం. ఒక సద్బ్రాహ్మణుడి దగ్గరి నుంచీ కసాయివాడి వరకూ అందరిలో ఉన్నదొకే ఒక బ్రహ్మతత్త్వం గదా అనేది సమదృష్టికి పరాకాష్ఠ.
6. ఆత్మ సంయమ యోగం
అయితే ఇలాంటి సర్వాత్మ భావం మానవుడికి సిద్ధించాలంటే దానికెంతో సాధన కావాలి. మానవుడు తన్ను తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మ జ్ఞానం కలిగే వరకూ మనస్సును వశంలో ఉంచుకోవాలి. వీడు తన - వీడు పరాయి అనే భేద దృష్టి పనికిరాదు. సమదృష్టి నలవరుచుకోవాలి. అలవరుచుకోవాలంటే యమ నియమాదులు కొంత కాల మవలంబించాలి. యుక్తాహార విహారాదులు పాటించాలి. శరీరం స్వాధీనమైతే మనస్సూ క్రమంగా స్వాధీనమవుతుంది. మనస్సు అన్నింటికన్నా ప్రధానమైన సాధనం. దాన్ని తొందరపడకుందా నెమ్మదిగా ఆత్మ చైతన్యంగా మార్చుకోవాలి. అది ఆత్మగా మారి నిశ్చలమైతే చాలు. అదే సర్వవ్యాపకమైన బ్రహ్మం. అప్పుడన్ని పదార్ధాలలో తన ఆత్మే. ఆత్మలోనే సమస్త పదార్ధాలూ దర్శనమిస్తాయి. అయితే మనసనేది చంచలం కదా. అది మనకు స్వాధీనమయ్యే దెప్పుడు. ఆత్మగా మారేదెప్పుడది. బేజారు పడరాదు. అభ్యాస మొకటి - వైరాగ్య మొకటి. ఇవి రెండే సాధనాలు దాన్ని వశపరుచుకోటానికి. మరి యావజ్జీవమూ అలాటి ప్రయత్నం చేస్తూ పొతే అది జీవించి ఉండగా ఫలిత మిస్తుందో లేదో. ఇవ్వకపోతే ఏమిటి మన గతి అని కూడా బెంబేలు పడరాదు. సర్వాత్మ భావం సిద్ధించే వరకూ అభ్యాసం సాగుతూ పోవాలి. ఈ జన్మలో అది ఫలించక పోతే మరొక జన్మలో. ఆ జన్మలో కాకుంటే మరో జన్మలో తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే చేసింది వృధా పోదు. జన్మలనేవి అభ్యాసం కోసమే ఉన్నాయి. ప్రతి జన్మలో కొంత కొంత ప్రయత్నిస్తూ పోతే ఆ సంస్కారం తరువాత జన్మకు కలిసి వస్తుంది. అది ఏ జన్మకో ఒక జన్మకు పరిపాకానికి వచ్చి సర్వాత్మ దర్శనం తప్పకుండా లభిస్తుంది. భగవానుడిచ్చే హామీ ఇది. ఇదీ ఆత్మ సంయమం మనకు చెప్పే మాట.
7. జ్ఞాన విజ్ఞాన యోగం
పరమాత్మ, ఈశ్వరుడు, బ్రహ్మమని వర్ణించటమే గాని వాటి స్వరూపమేమిటో పూర్తిగా చెప్ప లేదింత వరకూ. ఇప్పుడా స్వరూపాన్ని బయట పెడుతున్నదీ అధ్యాయం. స్వరూపం విభూతీ రెండున్నాయి పరమాత్మకు. అందులో స్వరూపం నిర్గుణం. విభూతి సగుణం. గుణాలంటే సత్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలు. ఈ ప్రకృతి ఆయన శక్తే - సగుణంగా బయటపెడితే ఆయన ఈశ్వరుడు. అప్పుడీ చరాచర ప్రపంచమంతా ఆయన విభూతి లేదా విస్తారం. అలా గాక నిర్గుణంగానే నిలిచిపోతే అది కేవలం చైతన్యస్వరూపం. అదే బ్రహ్మం. పరమాత్మ. ఇప్పుడీ రెండూ కలిపి పట్టుకొంటేనే పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం. ఇందులో పృధివి మొదలు ఆకాశం వరకూ కనిపించే జగత్తొక విభూతి అయితే, మనో బుద్ధ్యహంకారాలుగా కనిపించే జీవుడి ఉపాధి ఒక విభాతి అయితే - దీన్ని ధరించిన జీవ చైతన్యం మరొక విభూతి. అన్నీ కలిసి తొమ్మిదీ ఇవి. ఇవే శాక్తేయుల నవావరణలు. ఆత్మ చైతన్యాన్ని ఆవరిస్తాయివి. ఇదంతా తన శక్తేనను కొంటే ఈశ్వరుడు. దాని కధీనమై పోతే జీవుడు. ఇంతకూ ఈశ్వరుడూ ఆయన ప్రకృతి రెండూ ఒకే ఒక తత్త్వం. దాని పరిణమమే ఈ చరాచర సృష్టి అంతా. కనుక రసోహమప్సు - సర్వత్రా ఉన్నదా ఈశ్వరుడే. మనలో కలిగే సాత్త్విక రాజస తామస భావాలు కూడా అదే. కాని ప్రకృతి గుణాల వలలో చిక్కి ఆ మేరకే ఆగిపోయిన ఈ జీవుడికా స్వరూప మంతు పట్టడం లేదు. ఆర్తుల దగ్గరనుంచీ అందరూ సాధకులే. కాని ఎవడో ఒకడుంటాడు జ్ఞాని. వాడా ఈశ్వరుణ్ణి తన స్వరూపంగానే దర్శించగలడు. ఎన్నో జన్మలు గడిస్తే గాని ఆ జ్ఞానం కలగదు. అప్పుడే తాను, తాను చూచేది అంతా పరమాత్మే అనే అనుభవ మేర్పడుతుంది. కాని ఆయా కోరికలు బలంగా ఉండి ఆయా దేవతలను సేవిస్తుంటారు మానవులు. దానికి కారణం ద్వంద్వ మోహం. అది పుట్టుకతోనే ఏర్పడింది మనకు. ప్రకృతి గుణాలను దాటి పోనివ్వదది. గుణాధీనుడైన ఈ జీవుడికిక గుణాతీతమైన తత్త్వమెలా బోధ పడుతుంది. పడితే గాని సగుణాన్ని నిర్గుణం తాలూకు విభూతిగా దర్శించ లేడు. అలా దర్శిస్తే జ్ఞానమే గాక విజ్ఞానం కూడా అవుతుంది.
8. అక్షర పరబ్రహ్మ యోగం
అక్షరమటే నశించనిది. అది మాయాశక్తి అయితే దాని కన్నా పరమైన అక్షరం పరమాత్మ. ఈ అక్షరం ఆ అక్షరాన్ని చూపటనికే ఉంది. ఇది ఓంకార రూపంగా భావించారు పెద్దలు. ఓంకారమంటే అ-ఉ-మ అనే మూడు అక్షరాల సంపుటి. మూడూ మూడు ప్రపంచాలకు, మూడూ శరీరాలకు, ముగ్గురు జీవులకు సంకేతం. ఓంకారనికే ప్రణవమని కూడ పేరు. దాన్ని ఉచ్చరించేటప్పుడు దానికి వాచ్యమైన ఈ అర్ధాన్ని మనసుకు తెచ్చుకోవాలి. వాచకమైన శబ్దమెక్కడ ఆగిపోతుందో అక్కడ ఈ జీవ జగద్భావాలు కూడా లయమయిపోతాయి. వాచకంతో పాటు వాచ్యం కూడా లయమవుతున్నప్పుడవి రెండూ ఎందులో లయమవుతున్నాయో గమనించాలి సాధకుడు. అది ఏదో గాదు. సర్వ భూతాలకు అదే స్వరూపం. అక్ష్రారాత్పరతః పరః - అక్షరానికి పరమైన అక్షరమది. దాన్ని తదాకారమైన అలోచనతో పట్టుకోగలిగితే అది జ్ఞానం. అలా గాక దీని ద్వారా దాన్ని ఏకాగ్రతతో భావన చేస్తూ అవసానంలో ప్రాణశక్తిని భ్రూమధ్యంలో చేర్చి అక్కడ నుంచి కపాలం దాకా తీసుకుపోయి సుషుమ్న ద్వారా బయటికి వచ్చి దాన్ని సూర్యనాడిలో ప్రవేశ పెట్టి పాణోత్ర్కమణ చెందితే సత్యలోకం దాకా వెళ్ళి అక్కడ ఈ జీవుడు నిర్గుణ జ్ఞానంతో తరిస్తాడు. ఇది ధ్యాన మార్గం.
9. రాజవిద్యా రాజగుహ్య యోగం
ధ్యానమూ జ్ఞానమూ ఈ రెండింటిలో ధ్యానం క్రమముక్తికీ, జ్ఞానం సద్యోముక్తికీ తోడు పడతాయి. ఇందులో ధ్యానమయింది. ఇక జ్ఞాన మెలాంటిదో వివరిస్తున్నదీ అధ్యాయం. రెండూ ఒకటే అనిపిస్తుంది. కాని తేడా ఉంది. ధ్యానం ఏవొక్క మూర్తినో పట్టుకొని చేసేది. పైగా మిగతా మానసిక భావాలను లయం చేసుకొనే విధానం లేదందులో. మహా అయితే మనసుకు రాకుండా త్రోసివేస్తాము. జ్ఞానమలా కాదు. సర్వమూ బ్రహ్మమని చూచే చూపు. అందులో అన్యమైన భావాలన్నీ కలుపుకొంటూ పోవాలి మనం. అప్పుడే ఆత్మ అనాత్మ అనే తేడా పోయి అంతా ఏకమనే ఆత్మభావం సిద్ధిస్తుంది. ఇదే విద్య. ఇదే గుహ్యం. విద్య అంటే జ్ఞానం. గుహ్యమంటే రహస్యం. అంతా తానే అయితే ఎవరున్నారిక చెప్పటానికి. అందుకే రహస్యమయింది. అనుభవమెప్పుడూ రహస్యమే. అందులో ఇది రాజరహస్యం. ఎక్కడో లేదా బ్రహ్మం. ప్రత్యక్షావగమం. ఎక్కడ చూస్తే అక్కడే. ఉండటమనే స్ఫురణే గదా అది. ఎక్కడ లేదు. ప్రతి పదార్ధమూ ఉందనే గదా స్ఫురిస్తుంటుంది. ఆ స్ఫురణే ఆత్మ. నీవు స్ఫురించే పదార్ధాన్ని చూస్తున్నావు. అది సవికల్ప దృష్టి. అలా కాక వాటి స్ఫురణ చూడు. అది నిర్వికల్పం. సుసుఖం కర్తుం. అలా చూడటం కూడా కష్టం కాదు చాలా సులభమంటున్నది గీత. సొమ్ములు చూచినట్టు వాటిలో బంగారం మాత్రం చూడలేవా. అది కష్టమా. అలాగే ఇదీ. అసలు రహస్యమేమంటే ఆ స్ఫురణే అంతటా వ్యాపించి ఉంది. అందులోనే ఈ సమస్త భూతాలు చేరిపోతాయి. కాని వీటిలో అది ఉందన గూడదు. అదే వీటిలో. ఆ మాటకు వస్తే వీటిలో కూడా అది లేదు. అంటే ఉన్నదదే మరేదీ కాదని భావం. అయినా ఇవి కనిపిస్తున్నాయంటే అదే ఇన్ని రూపాలలోదర్శనమిస్తున్నది. అందులో నుంచే జన్మించి అందులోనే లయమవుతుంటాయి. దాని శక్తి అలాంటిది. ఆ శక్తి ప్రభావంతో నేనొక రూపం ధరించి అవతరిస్తుంటే నేనా అవతారమేనని అక్కడికే చూచి నన్నవమానిస్తారు మూఢులంటాడు పరమాత్మ. ఎవరో ఉంటారు మహాత్ములు. వారు జ్ఞానయజ్ఞంతో నన్ను యజనం చేస్తుంటారు. అనన్యభావంతో పట్టుకొంటారు నన్ను. వారికే రూపం చూచినా, ఏ క్రియ చూచినా అందులో అవి కనపడవు. ఆత్మే స్ఫురిస్తుంటుంది. ఆత్మ సర్వత్ర సమంగా వ్యాపించి ఉంది. అలాంటి భావనతో బ్రతికితే చాలు. చివరకు సర్వాత్మ భావాన్నే అందుకొని తరిస్తారు.
10. విభూతియోగం
ఇంకా ఒక మాట చెబుతున్నాను వినమంటాడు భగవానుడు. నా స్వరూపం దేవతలకు ఋషులకే అంతుపట్టటం లేదు. కారణం. అందరీకీ ముందే ఉన్నాను నేను. నాకు జన్మ లేదు, మరణం లేదు. ఇలా ఎవరైతే ఆత్మ స్వరూపాన్ని గుర్తిస్తారో వారూ అదే అయిపోగలరు. యద్భావ స్తద్భవతి. మన భావనను బట్టే ఫలితం. అది సగుణంగా కొంత కాలం నన్ను భజిస్తే వారికి నిర్గుణ జ్ఞానం నేనే కలుగజేస్తా నంటాడు పరమాత్మ. మరి ఆ సగుణమైన విభూతి ఎలాంటిదో ఏయే భావాలలో దర్శించాలని అడిగితే సమాధానమిస్తున్నాడు. అందులో మొదట నిర్గుణమైన స్వరూపాన్ని సంగ్రహంగా చెప్పి తరువాత తన విభూతినంతా వర్ణిస్తూపోతాడు. అహమాత్మా గుడాకేశ - ఆత్మ స్వరూపమే అది. ప్రతిచోటా ఉన్నదనే స్ఫురణ ఏదుందో అదే ఆత్మ. అదే ప్రతి పదార్ధానికి ఆది మధ్యం అంతం. అది తప్పించి ఏ నామమూ లేదు. రూపమూ లేదు. పోతే ఇక ఈ నామరూపాలేమిటంటారా. ఇవన్నీ దాని విభూతి విస్తారం. ఇదే చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాడు. ఆదిత్యులలో విష్ణువునని, రుద్రులలో శంకరుడునని, వృక్షాలలో అశ్వత్ధమని, అశ్వాలలో ఉచ్చైఃశ్రవమని ఇలాగా. అయితే ఒక్కొక్క జాతిలో ఒక్కటేనా విభూతి అంటే. మిగతాది కాదా. ఎందుకు కాదు. అంతా అదే. కాని ఏషఉద్దేశతః ప్రోక్తః కేవల ముదాహరణ కోసం చెప్పానిలాగా. మరి వాస్తవమేమిటో తెలుసా. నత దస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరా చరం. నేను కాని పదార్ధమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. నీవు నన్ను ఏయే భావాలలో ధ్యానించాలని అడిగావు కాబట్టి ప్రత్యేకించి అలా చెప్పవలసి వచ్చిందని మరలా సంజాయషీ ఇస్తాడాయన అర్జునుడికి.
11. విశ్వరూపాధ్యాయం
అయితే ఇదంతా భగవద్విభూతి అని ఎంత చెప్పినా గ్రహించలేడు మానవుడు. దానికి కారణాలు రెండే. ఒకటి - ఇదంతా ప్రపంచమని మామూలు దృష్టితో చూస్తున్నామే గాని అంత కన్నా విశేషంగా చూడలేక పోతున్నాము. రెండు - ఈ భూమండలంలో ఎక్కడో ఒక చోట, ఒక కాలంలో, ఏ కొన్నింటితోనో సంబంధం పెట్టుకొని చాలా పరిమితమైన దృష్టితోనే జీవిస్తున్నాము గాని, దేశకాల వస్తువులన్నీ కలుపుకొని అఖండమైన దృష్టితో చూడటం లేదు మనం. అందువల్ల అఖండమైన విశ్వమెక్కడో ఉంది కాని మనకు కనపడటం లేదు. ఎక్కడైనా ఒక మహానుభావుడొక గారడీ చూపినట్టు దాన్ని మనకు చూపితే బాగుండననే గొప్ప కుతూహలం ప్రతివాడికీ. కాని వాస్తవంలో మనం చూస్తున్నదంతా విశ్వరూపమే, విభూతే. విభువు తాలూకుదే విభూతి. విశ్వేశ్వరుడిదే ఈ విశ్వరూపమనే అవగాహన లేదు మానవుడికి. విశ్వమనేది విశ్వేశ్వరుడి రూపం. విభూతి అనేది విభువు యొక్క విస్తారం. ఆ విభువనండి. విశ్వేశ్వరుడనండి. అది మూలపదార్ధం Substance Base దాని విశేషమే దాని ప్రదర్శనమే ఈ విశ్వం. దీని కధిష్ఠానమనండి - ఆధారమనండి, ఆ విశ్వేశ్వరుడే. అంటే పరమాత్మ స్వరూపమే చరాచర ప్రపంచాని కాధారం. దాని రూపమే ఇది - అదే ఇన్ని రూపాలలో భాసిస్తున్నది. దానికే విశ్వరూపమని పేరు పెట్టారు. అయితే ఎలాగూ మనం నిత్యమూ చూస్తున్నాము గదా ఇక క్రొత్తగా ఎవడో చూపితే చూడాలని దేని కుబలాటం. చెప్పాము గదా. అండ పిండబ్రహ్మాండాలన్నీ ఒక్కసారిగా ఆకళించుకోవాలనే ఆశ వదలక నని. అయితే అది సాధ్యమా. సాధ్యమే. ఎప్పుడూ? దానివరకే గాక దాని కధిష్ఠానమైన Base విశ్వేశ్వర స్వరూపాన్ని గుర్తించగలిగితే. అలా గుర్తించాలంటే దేశకాల వస్తువుల పరిధి ఎంత ఉందో అంతా మనసుకు రావాలి. అదే దివ్య దృష్టి. అదే అర్జునుడికి కృష్ణుడు ప్రసాదించాడనే మాట. ఇచ్చాడు గదా అర్జునుడెందుకు భయపడ్డాడు? దృష్టి స్వప్రయత్నంతో వచ్చింది కాదు. తాత్కాలికంగా పరమాత్మ తనకిచ్చింది. అలాగైతే ప్రతి ఒక్కరికీ ఇవ్వగలడాయన. కాని ఎలా వస్తుందో అలాగే పోతుంది. చూపొకరిచ్చినా చూచే స్తోమత ఒకటుండాలి గదా మానవుడికి. అది స్వయంగా తాను ప్రపంచానికి మూలమైన పరమాత్మ తత్త్వాన్ని చూచినపుడు గాని ఏర్పడదు. వేషధారిని చూడకుండా అతని వేషాలను చూస్తే భయపడి చస్తాడు. అలా చూచాడు అర్జునుడు. భూన భోంతరాలు వ్యాపించిన, భూత భవిష్యత్తులు వ్యాపించిన - దేవదానవ మానవ పిపీలికాది బ్రహ్మ పదార్ధలన్నీ వ్యాపించిన రూపాన్ని ఒక్కసారి చూడగానే అలవాటు లేక హడలి పోతాడు. దానికి కారణం దేశకాల వస్తు రూపాలనే చూచాడు గాని - అవన్నీ దేనికి చెందినవో ఆ మూలతత్త్వాన్ని చూడలేదు. అర్జునుడనేది ఒక నెపం. మనమే అర్జునులం. మనమూ అఖండమైన తత్త్వాన్ని చూడకుండా, అది ప్రదర్శించే ఈ విశ్వరూపాన్ని ఏ కొంచమో చూచి హడలిపోతున్నాము. ఇక అంతా చూస్తే ఎంత భయంకరమో ఎంత బెంబేలు పడతామో.
12. భక్తి యోగం
అయితే మరి ఎలా చూడాలి. ఎలా అలవరుచుకోవాలి ఆ దివ్య దృష్టి. అనన్యమైన భక్తి యోగం తోనే అలవడుతుందా దృష్టి. అన్యమైన దాత్మ కన్నా వేరొకటి లేదనే భావనే అసలైన భక్తి. మనోవాక్కాయ వ్యాపారలన్నీ ఆ ఒకే ఒక భావనలో చేరి పోతే, అదే నిత్యమూ నిలిచి ఉంటే రాగద్వేషాది వికల్పాలన్నీ వాటి పాటికవి లయమయి - ఒకే ఒక నిర్వికల్పమైన ఆత్మ స్ఫురణగా మారి అనుభవానికి వస్తాయి. అప్పుడిక దేని వైపూ మొగ్గు చూపదు వాడి మనస్సు. అంతా తానే - తానూ తానే, తనదీ తానే. ఇదే అనన్యమన్నా, భక్తి అన్నా. విభక్తి కానిది భక్తి. విభక్తి అంటే వేరయి పోవటం. అది కాదన్నప్పుడు ఏకంగా కలిసిపోవటమన్న మాట. భక్తి అనే మాట కదే శబ్దార్ధమసలు. అప్పుడిక దేశ కాల వస్తువు లెన్ని వందలు వేలు కనిపించినా భయపడడు మానవుడు. అవన్నీ ఆత్మ స్వరూపం తాలూకు విలాసమే గదా అని బరవసా పడి చూడగలడు. ఇదే దివ్య దృష్టి. స్వార్జితమిది. ఒకరి నడిగి తెచ్చుకొన్న ఎరవు సొమ్ము గాదు. తొలగి పోతుందనే భయం లేదు.
13. క్షేత్ర క్షేత్రజ్ఞాధ్యాయయోగం
అయితే ఇలాటి దివ్య దృష్టి మనకు ద్వైతదృష్టి ఉన్నంత వరకూ అలవడట మసాధ్యం. ద్వైతదృష్టి అంటే భేద దృష్టి. ఇది క్షేత్రం. అది క్షేత్రజ్ఞుడనే భావం. క్షేత్రజ్ఞుడంటే అన్నింటినీ దర్శించే జ్ఞానం. క్షేత్ర మంటే దానికి గోచరించే జ్ఞేయ ప్రపంచం Objective Field. రెండూ కలసి ఒకటే వాస్తవానికి. ఆ ఒకటీ క్షేత్రం కాదు - క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రమో. అది ఏదో గాదు - ఈ క్షేత్రజ్ఞుడి విభూతి. దాని వ్యక్తమైన రూపమే. క్షేత్రజ్ఞుడంటే ఆత్మ చైతన్యం. అది దానిపాటికది నిరాకారం. అవ్యక్తం. అదే సాకారంగా వ్యక్తమయి కనిపిస్తే దాన్నే మనం క్షేత్రమంటున్నాము. ఆకాశం మొదలు మానవుడి మనస్సు దాకా అంతా క్షేత్రమే. ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడి ప్రభావమే గనుక అన్యం గాదు. అదే ఇది. ఇదే అది. సచయో యత్ప్రభావశ్చ అని ఒక్క మాటలో బయటపెట్టాడీ రహస్యం వ్యాస భగవానుడు. అందులో యః అంటే ఆత్మ. ప్రభావః అంటే దాని విభూతి అయిన ఈ అనాత్మ ప్రపంచం. విభువును విడిచి విభూతిని, విభూతిని వదలి విభువును పట్టుకోరాదు. అది ద్వైతం. రెండూ కలిపి క్షేత్రజ్ఞుడి స్వరూపంగా దర్శిస్తే అది అద్వైతం. క్షేత్రంలో అంతర్బహిశ్చ క్షేత్రజ్ఞుడే వ్యాపించి ఉన్నప్పుడిక క్షేత్ర మెక్కడిది. క్షేత్రంగా కూడా కనిపిస్తూన్న దదే నని ఏకస్ధం చేసి చూడాలి. అదే బ్రహ్మానుభవం అని చాటుతున్నది గీత. Objective Field.
14. గుణత్రయాధ్యాయయోగం
అయితే వస్తు సిద్ధంగా అంతా జ్ఞాన స్వరూపమైన ఆత్మే అయినా అదే జ్ఞేయమైన అనాత్మగా కనపడే సరికి దాన్ని గ్రహించక ఇదే సత్యమని దీన్ని పట్టుకొని సతమత మవుతున్నారు. దీనివల్ల కలిగే సుఖదుఃఖాదులను అనుభవించలేక దీనితోనే చివరకు కన్నుమూస్తున్నారు లోకులు. ఇదే సంసార బంధం. దీనికి కారణం గుణ సంగ మంటున్నది గీత. సత్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలు బంధిస్తున్నాయి మానవుణ్ణి. మనలో ఉన్నవి ఈ త్రిగుణాలే. మనస్సు సత్త్వం. ప్రాణం రజస్సు. శరీరం తమస్సు. ఇక గుణాత్మకం కాని దేది మానవుడిలో. పోతే ఈ గుణాలతో తాదాత్మ్యం Identity చెందిన నేరానికి ప్రపంచమంతా త్రిగుణాత్మకంగానే కనిపిస్తుంటుంది. ప్రపంచమంటే దేశ కాల వస్తు సముదాయమే గదా. దేశం సత్త్వమైతే, కాలం రజస్సైతే, వస్తుజాలమంతా తమస్సు. కాబట్టి బాహ్య జగత్తు కూడా గుణమయమే. దృక్ దృశ్యాలు రెండూ గుణమయమే అయ్యేసరికి బంధం తప్పదు. ఇది ఇలా ఉన్నంత వరకూ క్షేత్ర క్షేత్రజ్ఞుల ఏకత్వం సిద్ధించదు. సిద్ధించకుంటే మోక్షంలేదు మానవుడికి. అయితే ఈ బంధం నుంచి బయటపడే దెలా మానవుడు. గుడ్డిలో మెల్ల అన్నట్టు సత్త్వగుణం కొంతమేలు ఈ త్రిగుణాలలో. అది ప్రకాశకం అనామయం. వివేక జ్ఞానానికి తోడు పడుతుంది. దాని ఆసరాతో ఒక పని చేయాలి సాధకుడు. నాన్యం గుణేభ్యః కర్తారం - త్రికరణాలతో మనమే పనిచేసినా అది గుణాలే చేస్తున్నాయి. నేను గాదు. మరి నేనవరంటే గుణేభ్యశ్చపరం - గుణాలకు సాక్షిగా ఉన్న చైతన్యమే - ఇలా ప్రతిలోమంగా అనులోమంగా తన స్వరూపాన్ని పట్టుకోగలగాలి. అప్పుడే మద్భావం సోధిగచ్ఛతి. తమ పూర్ణ స్వరూపం గుర్తిస్తే జన్మమృత్యుజరా దుఖైర్విముక్తః -జనన మరణ సమస్య నుంచి బయటపడతారని హామీ ఇస్తున్నది గీత.
15. పురుషోత్తమాధ్యాయయోగం
ఈ సాధన మార్గమే పురుషోత్తమాధ్యాయం కూడా ఇంకా చమత్కారంగా ఒక అశ్వత్థ వృక్షం మీద నెపం పెట్టి వర్ణిస్తున్నది. అశ్వత్థ మంటే రావి చెట్టు. చలదళ మని పేరు దానికి - ఎప్పుడూ చలించే స్వభావమా చెట్టుకు. అలాగే ఈ సంసార వృక్షం కూడా చలనాత్మకమే. ఏదీ నిలకడగా ఉండదిక్కడ. క్షరమిది. నశించేదని అర్ధం. ఇది గాక అక్షర మొకటున్నది. అది దీనికి మూలమైన మాయా శక్తి. అది పరమాత్మ నాశ్రయించిన ఆయన శక్తి కాబట్టి క్షరం కాదు అక్షరం. పోతే ఈ క్షరాక్షరాలు రెంటికీ విలక్షణమైన దొక్కటే ఉంది తత్త్వం. అది ఆ పరమాత్మ చైతన్యమే. ఇవి రెండూ పురుషులైతే అది పురుషోత్తమ. పురుషుడైనా ఇవి ఆయనలాగా పూర్ణ స్వరూపం కావు. అపూర్ణమే. పూర్ణం లాగా భాసిస్తున్నాయి. సాపేక్షమివి Relative నిరపేక్షం Absolute కావు. నిరపేక్షమనేది ఒక్కటే. కనుక వీటి రెండింటినీ క్రమంగా దాటి పోయి దాన్ని వాటేసుకోవాలి మానవుడెప్పటికైనా. అదే పురుషోత్తమ ప్రాప్తి. దానికి సమ్మోహ Illusion మడ్డు పడుతుంటుంది. జ్ఞాన చక్షుస్సుతో ఆ చీకటిని చీల్చుకొని ముందుకు సాగిపోవాలి. అలా పోవాలంటే ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవిక సృష్టి అనే మూడింటిలో ఒకే ఒక ఆత్మజ్యోతిని దర్శిస్తూ ఉండాలి. మమైవాంశో జీవలోకే ఆ పరమాత్మ అంశే వాస్తవానికీ జీవాత్మ కనుక ఈ శరీరాద్యుపాధుల మేరకే ఉన్నా ననుకోక సర్వత్ర సచ్చిద్రూపంగా నేనే వ్యాపించి ఉన్నానని తన వ్యాప్తిని తాను గుర్తు చేసుకోవాలి. అలాటి దివ్య దృష్టి అలవడితే, సృష్టి అంతా తానే అయినట్టు తన స్వరూపంగానే గుర్తించి తరించగలడు.
16. దైవాసుర సంపద్విభాగయోగం
అలా దర్శించటాని కధికార సంపత్తి ఉండాలి మానవుడికి. లోకంలో మానవులందరూ రెండు జాతులు. కొందరు దైవ గుణాలు గలవారు. మరికొంద రసుర గుణాలున్నవారు. దైవ సంపన్నులు చాలా వరకు సాత్విక స్వభావులయి ఉంటారు. అసుర గుణసంపన్నులు రాజస తామస స్వభావులు. ఇందులో దైవ సంపద అనేది మానవుణ్ణి బంధం నుంచి తప్పిస్తుంది. అసుర సంపద అంతకంతకు సంసార బంధంలో పడదోస్తుంది. అసుర సంపద అంటే రజస్తమో గుణాల విజృంభణమే. అలాటి వారికి అహంకార బల దర్పాది అవలక్షణాలెన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. దానితో కన్నుగానక బ్రతుకుతుంటారు వారు. చివరకు వారికి ప్రాప్తించేది నరకమే. త్రివిధం నరకస్యేదం ద్వారం - కామం క్రోధం లోభమనేవి మూడూ మూడు ప్రకృతి గుణాలకు ప్రతీకలు. వాటి వలలో బడితే చాలు. అవి సరాసరి నరకానికే చేరుస్తాయి. ఆ తరువాత అసుర యోనులలో జన్మిస్తారలాటి వారు. ఏ జన్మకూ భగవత్ప్రాప్తి లేదు వారికి. పునరపి జనన మన్నట్లు జనన మరణ పరంపర అనుభవిస్తూనే పోతారు. మరి దైవ గుణ సంపన్నులయితే శాస్త్రోక్తమైన మార్గంలో జీవితం సాగిస్తూ చివరకు భగవత్స్వరూప చింతనతో జన్మ రాహిత్యం చేసుకొని క్రమంగా ముక్తులయి పోగలరు. శాస్త్రాన్ని వదిలేసి తమ ఇష్టానుసారం బ్రతికితే ఇహంలో సుఖం లేదు. పరంలో శాంతి లేదు. అలా కాక శాస్త్రీయమైన మార్గంలో పయినించేవారు ఏది కర్తవ్యమో గుర్తించి అదే ఆచరించి దానికి తగిన సిధ్ధి పొంది తీరుతారు.
17. శ్రద్ధాత్రయయోగం
దేనికైనా శ్రద్ధ అనేది ఉండాలి మానవుడికి. శ్రద్ధామయోయం పురుషః యోయచ్ఛ్రర్ధః సః - శ్రద్ధే మానవుడంటే. ఎముకలు కండలు రక్తం మాసం కాదు. లక్ష్యం మీద దృష్టికి శ్రద్ధ అని పేరు. అది ఉంటే దానికి తగిన ఆలోచనా - ప్రవర్తనా తప్పకుండా ఏర్పడతాయి. అది ఎప్పటికైనా జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. సందేహం లేదు. మూడు విధాలీ శ్రద్ధ అనేది. సత్త్వాది గుణాలను బట్టే ఏర్పడుతాయవి. సత్త్వం వల్ల సాత్త్విక శ్రద్ధ. రజస్సు వల్ల రాజస శ్రద్ధ. పోతే తమస్సు వల్ల తామస శ్రద్ధ. అవి మరలా వారు తీసుకొనే ఆహారాన్ని బట్టి ఏర్పడుతాయి. అన్నింటిలోనూ సాత్త్వికమైన శ్రద్ధ ఉన్నవాడు సాత్త్వికమైన ఆహారమే సేవిస్తాడు. ఆయుస్సూ, బలమూ, ఆరోగ్యమూ పంచే రసవంతమైన హృద్యమైన ఆహారమే వాడికిష్టం కట్వామ్ల లవణాదులు కావు. అవి రాజసుల కిష్టం - పోతే పాసిపోయిన చెడిపోయిన అన్నపానాలు తామసులకు ప్రీతికరం. ఇక యజ్ఞమూ, తపస్సూ, దానమూ మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి వారి వారి శ్రద్ధను బట్టి ప్రవర్తించేవి. ఫల నిరపేక్షంగా కేవలం తనకు కర్తవ్యమని చేసేదే సాత్వికమైన యజ్ఞం. వేద, గురు, పూజా, శౌచమూ, బ్రహ్మచర్యమూ, శారీరకమైన తపస్సు, సత్యమూ, ప్రియమూ, హితమైన వాక్కు, వాజ్ఞయ తపస్సు, మనశుద్ధి, మౌనం, సౌమ్యత్వం, ఇంద్రియ నిగ్రహం, మానసమైన తపస్సు, ఇదంతా సాత్వికమే. దేశ కాల పాత్రల యోగ్యతను గమనించి చేసేది సాత్వికమైన దానం. ఇలా సత్వగుణానుగుణంగా సాగినప్పుడే అది జీవితానికి అన్ని రంగాలలో జయాన్ని చేకూరుస్తుంది. తుదకు ఓం తత్సత్ అని ఏది చేసినా ఆ బ్రహ్మ చింతనే మానవుడి శ్రద్ధా భక్తుల కనుగుణమైన మోక్ష ఫలాన్ని ప్రసాదిస్తుందని గీత ఇచ్చే హామీ.
18. మోక్షసన్యాస యోగం
ఇంతకూ మోక్షమనే ఫలాన్ని రుచి చూడాలంటే దానికి సన్న్యాసమనేది ఆవశ్యకం. సన్న్యాసమంటే వదలుకోవటం. కాషాయ కమండలు ధారణ కాదు. మనస్సన్న్యాసమే చెబుతుంది గీత బాహ్యసన్న్యాసం కాదు. అంచేత వదలుకోవలసింది కర్మ కాదు. ప్రతి కర్మ నేను చేస్తున్నాననే కర్తృత్వమూ - ఇది నాకు తప్పకుండా ఫలితమివ్వాలనే భోక్తృత్వమూ వీటిని వదలు కోవలసింది. వీటికి అహం మమలని పేరు. ఇవే సంసారమంటే. కాని అదైనా వదలుకోవటం సాధ్యమా. సాధ్యమే. సర్వభూతేషు యేనైకం భావం. మనం లావాదేవీ పెట్టుకొన్న ప్రతి విషయంలోనూ అవిభక్తంగా వ్యాపించి ఒకటుంది. అదేదో గాదు. ప్రతిదీ ఉంది ఉందనే స్ఫురణ . ఇలాంటి జ్ఞానం మనసులో ఎప్పుడూ ఏమరకుండా ఉంటే చాలు. మనసా వాచా కాయేన - నీవే పని చేసినా పరవాలేదు. అసలు నీ స్వధర్మం నీవు మానుకోనక్కరలేదు. ఏది చేసినా ఒకనొక సమష్టి చైతన్యం వెలుగులోనే ఇది నడుస్తూ ఉంది. నేను కేవలం దానికొక ప్రణాళిక Medium మాత్రమే నని భావిస్తూ పోతే చాలు. అది నీ బుద్ధిని శుధ్ధి చేస్తుంది. ఏకాగ్రత కల్పిస్తుంది. ఇదే జ్ఞాన మార్గం. ఇది కాక మంత్ర తంత్ర యోగాభ్యాసాదులేవి పెట్టుకొన్నా అవి కేవలం ప్రయాసే. ఫలితమివ్వవు. దీనికే అనన్యభక్తి - అనన్య ధ్యానమని కూడా పేరు. ఒక దివ్య శక్తే నాలోనూ, నేను చూచే సమస్త భూతాలలోనూ చేరి అన్నింటినీ నడిపిస్తున్నదనే జ్ఞానం కన్నా గొప్ప భావన ఏముంది. - అదే జీవితంలో శాంతి - జీవితానంతరం మోక్షాన్నీ ప్రసాదిస్తుంది.
ఇంతకూ ఒక్క మాట చివరిసారిగా తెగేసి చెబుతున్నది గీత.సర్వధర్మాన్ పరిత్యజ్య - మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో - మోక్షయిష్యామి మాశుచః
సచ్చిద్రూపమైన ఆత్మే సర్వ వ్యాపకం. సర్వ స్వరూపం. దాని విశేషాలే నామ రూపాలు. అవి ఏవో గావు దానిధర్మాలే అంటే లక్షణాలే. వాటిని గాదు మనం చూడవలసింది. అవి దేని లక్షణాలో ఆ మూలతత్త్వాన్ని పట్టుకోవాలి. పట్టుకొని అదే గదా ఇవి అని వీటిని దానిలో ఎప్పటికప్పుడు లయం చేసుకోవాలి. అంటే వీటిని ఆ రూపంగా చూస్తూ పోవాలి. బంగారమంటే ఏమిటో గుర్తించి అదే గదా ఈ కంటెలు, కాసుల దండలనే సొమ్ములన్నీ అని ఆ రూపంగానే వీటిని చూచినట్టు చూడాలి. అప్పుడా నేననే జ్ఞానం అఖండగా దర్శనమిస్తుంది. అది కేవల జ్ఞాన స్వరూపం కాబట్టి అవిద్యా కామ కర్మలనే త్రివిధ పాపాలనుంచీ మానవుడికి ముక్తి లభిస్తుంది. సంసారంలో పడగొట్టేదేదో అది పాపం. పాతకం. పరిపూర్ణ జ్ఞానం లభిస్తే ఇక అజ్ఞానమే లేదు కాబట్టి దానితోపాటు కామకర్మలనే పాపాలు కూడా ఎగిరిపోక తప్పదు. పోతే ఇక సంసార బంధమనే సమస్య ఏముంది.
చివరి మాట
ఇలాగా జీవిత సమస్యను అవలీలగా పరిష్కరిస్తుంది గీత. అయితే అది కేవలం వస్తుసిద్ధమనే మాట మరచిపోరాదు మానవుడు. వస్తువెప్పుడూ పరోక్షం మనకు. అది మనకు బుద్ధి సిద్ధమైతేనే అనుభవం. విమృశ్యైత దశేషేణ దాన్ని బాగా నీ మనస్సులో విమర్శించి పరోక్షంగా శ్రవణం చేసిన సత్యాన్ని అపరోక్షంగా Direct అనుభవానికి తెచ్చుకో. అప్పుడే నీ సమస్యకు పరిష్కార మంటున్నది గీత. సమస్య బాహ్య ప్రపంచం వల్ల ఏర్పడినా అది నీ మనస్సుకు వచ్చినప్పుడే గదా నాకు సమస్య అనే అనుభవం నీకు కలుగుతున్నది. అలాగే పరిష్కారం కూడా బాహ్యంగా కేవలం వింటే కాదు. అది కూడా మనసుకు తెచ్చుకొని పదే పదే భావన చేయాలి. ఆ భావనే మన కనుభవమిస్తుంది. ఇప్పుడీ లోకానుభవం కూడా శారీరకం కాదు. మానసికమే బాగా ఆలోచిస్తే. లోకానుభవమే మానసికమయినప్పుడు, మోక్షానుభవం భౌతికమెలా అవుతుంది. అనుభవమన్నప్పుడది బంధమైనా మానసికమే. మోక్షమైనా మానసికమే. అయితే బంధం సవికల్పమైన మనస్సు అనుభవిస్తే, మోక్షం నిర్వికల్పమైన మనస్సనుభ విస్తుంది. నిర్వికల్పమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించి నప్పుడు మనస్సు నిర్వికల్పమే కావలసి ఉంది. అలాగే అయిందో ఇక అది మనస్సే గాదు - ఆత్మ స్వరూపమే. అంతా ఆత్మేననే దృష్టి ఏర్పడినప్పుడిక అనాత్మ ప్రపంచమే లేదు. అలాటి సర్వాత్మ భావాన్నే మన కుపదేశిస్తున్నది భగవద్గీత. అలాగే జీవించమని కూడా బోధిస్తున్నది. ఇంతకన్నా గొప్ప బోధ ఏమున్నది. గీతా సారమిదే. ఉపనిషత్తుల దగ్గరి నుంచీ, బ్రహ్మసూత్రాల దగ్గరి నుంచీ, భగవదద్గీత వరకు శ్రవణ మనన నిదిధ్యాసనా రూపంగా ప్రస్థానత్రయం మనకు చేస్తూ వచ్చిన జీవిత సందేశ సారమిదే.
ఓం శాంతిః శాంతిః శాంతిః
***