ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
6. మాండూక్యోపనిషత్తు
ఓంకారమంటే అది ఒక శబ్దం. శబ్దమెప్పుడూ అర్థాన్ని చెబుతుంది. సంకేతమే గదా సత్యాన్ని చెబుతుంది. శబ్దం సంకేతం. ఓంకారమనేది అలాటి సంకేతమే. అందులో ’అ’, ’ఉ’, ’మ’ అని మూడక్షరాలున్నాయి. మూడింటికీ మాత్రలని పేరు. మాత్ర అంటే కొలిచేది. ఇందులో ’అ’ జీవుడి జాగ్రదవస్థను - ’ఉ’ స్వప్నావస్థను - ’మ’ సుషుప్తినీ కొలుస్తాయి. అవి కొలుస్తుంటే ఆత్మ చైతన్యం వాటిచేత కొలవబడుతుంటుంది. వాటికి పాదాలని పేరు. స్వతహాగా కొలత లేని ఆత్మ ఈ కొలమానంతో జీవరూపంగా మారి మూడవస్థ లనుభవిస్తున్నది. ఇదే సంసార బంధం. మాత్రలు ఆలోచనలైతే పాదాలు వాటి తాలూకు బాహ్యరూపాలు. Ideas and Things. ఇలాంటి వాచ్యవాచక సంబంధమనే లావాదేవీ ఉన్నంత వరకూ సంసార క్లేశం తప్పదు మనకు. ఇప్పుడీ అవస్థాత్రయం దాటిపోతే గానీ తురీయమనే అవస్థ Fourth Dimension నందు కోలేము. అదే సమాధి అదే మోక్షం. అప్పుడీ మాత్రలూ పాదాలూ ఏమవుతాయి. అవి మనం తురీయ స్థితి నర్ధం చేసుకోవటానికి కల్పించుకొన్న సంకేతాలే. కాబట్టి ఆ స్థితి నందుకొన్న మరుక్షణం అందులో లయమయి పోతాయి. అప్పుడా దశ అమాత్రమనీ అపాదమనీ - మాత్రా పాదాలుగా కనపడేవి రెండూ కలిసి ఏకమయి పోతాయని - వర్ణిస్తుంది ఈ మాండూక్యమనే ఉపనిషత్తు. దానితో చతుర్ధం శివ మద్వైతం - తురీయమనే ఈ నాలుగవ దశ మానవుణ్ణి శవం గాకుండా శివంగా మారుస్తుంది. కారణమది అద్వైతం. అందులో జనన మరణాది భేదం లేదు. స విఙ్ఞేయః దాన్నే ఎప్పటికైనా అనుభవానికి తెచ్చుకోవాలి సాధకుడు. అది ఎలాగా అని అడిగితే ఏకాత్మప్రత్యయసారం - అన్ని దశలలోనూ ఉన్నదొకే ఒక ఆత్మ చైతన్యమనే అఖండాత్మ భావనే మనకు ప్రమాణం Instrument of Knowledge. దానితోనే పట్టుకోవాలాలి ఆ తురీయావస్థనని బోధిస్తున్నది మనకు మాండూక్యం.