ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
7. తైత్తిరీయోపనిషత్తు
పోతే ఇంతకు ముందుగానే చెప్పామొక మాట. జగత్తుది సృష్టి అని జీవుడిది సృష్టి గాదు ప్రవేశమని. పరమాత్మే జీవరూపంగా వచ్చి శరీరంలో ప్రవేశించాడట. ప్రవేశించి ఈ ఉపాధులతో చేయి కలిపి తన స్వరూపమే తాను మరచిపోయాడు. మరచిపోతేనే వాడు జీవుడు. ఇదే సంసార బంధం. విషాదం. మరలా తన పొరబాటు తాను గుర్తించి తన నిజస్వరూపం వెతుకుతూ పోయి ఈ బంధం వదిలించుకోవటమే సాయుజ్యమీ జీవుడికి. అది ఎలాగో వర్ణించటానికి వచ్చాయి రెండు ఉపనిషత్తులు. మొదటిది తైత్తిరీయం. రెండవది ఐతరేయం. అందులో తైత్తరీయం జీవుడి రాకపోకలెలా వర్ణిస్తున్నదో చూతాము. తస్మా దేతస్మా దాత్మన ఆకాశః అని ప్రారంభం. ఆత్మ నుంచి ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువు నుంచి తేజస్సు. ఇలా వరసగా వచ్చి మానవ శరీరంలో బుధ్ధి అనే గుహలో చేరిపోయిందట అది. బాహ్యంగా ఆకాశాది పంచభూతాలైతే - ఆంతర్యంగా పంచకోశాలు. కోశమంటే ఒక వర Sheath or Cover. అవి మన శరీరంలోనే ఉన్నాయి. పై నుంచి చూస్తే ఆనందమయ కోశం ఆకాశానికి సరిపోతుంది. విఙ్ఞానమయ కోశం వాయువు లాంటిది. మనోమయం తేజస్సుకు. ప్రాణమయం జలానికి. చివరకి అన్నమయం పృథివికి సరిపడతాయి. అవి బ్రహ్మాండం ఇవి పిండాండం. Macro & Micro. ఇప్పుడీ అన్నమయాది కోశాలలో ఆత్మ చైతన్యమనేది, మూసలో పోసిన పంచదార పాకానికి ఆ మూస రూపం వచ్చినట్టు, ఆ కోశ రూప మేర్పడి అలాగే కనిపిస్తున్నది. వీటిలో నుంచి బయట పడాలంటే ఈ కోశాలు నా ఉపాధులే Media గాని నా స్వరూపం గాదని గుర్తించాలి ఈ జీవుడు. గుర్తించాలంటే శుద్ధ చైతన్యమే తానని దాన్నే మనసుకు తెచ్చుకోవాలి. అదే ఆత్మ భావన. ఈ భావన బలపడే కొద్దీ అన్నమయాది కోశాలను క్రమంగా దాటిపోయి చివరకు ఆనందామయాన్ని కూడా దాటుతూ పోతాడు. దాటుతూ పోతే అవి తన స్వరూపంలో లయమైనట్టు చూడగలడు. అప్పుడు వీటితో పాటు పృథివి మొదలు ఆకాశందాకా ఉన్న పంచభూతాలు కూడా లయం కాక తప్పదు. అప్పుడంతా ఆత్మ స్వరూపమే కాబట్టి జీవేశ్వరులనే తేడా కూడా వెంటనే తొలగిపోతుంది. అదే మోక్షం. ఇదీ తైత్తరీయ సారం.