ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
10. బృహదారణ్యకోపనిషత్
దశోపనిషత్తులలో ఆఖరిది బృహదారణ్యకం. ఇది పరిమాణంలోనూ గుణంలోనూ పెద్దది. ఛాందోగ్యం పరోక్షమైన Indirect ఙ్ఞానమిస్తే ఇది అపరోక్షమైన Direct అనుభూతినే ప్రసాదిస్తుంది మానవుడికి. దాన్ని ఒక మాటలో గుప్తం చేసి చెబితే అదే అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మం - బ్రహ్మమే నేనని భావం. బ్రహ్మమనేది ఎక్కడో దూరంగా ఉందనే భ్రాంతి పోవాలి మనకు. అది ఎంత దూరమో అంత దగ్గర. యదేహ తదముత్ర. నిరాకారమూ వ్యాపకమూ అయిన ఆకాశానికి దూరం దగ్గర ఏముంది. సర్వత్ర ఉందని చూడటం లేదా మనం. అలాగే అంతకన్నా పెద్దదైన ఙ్ఞానస్వరూపమైన ఆకాశ మాత్మ అనేది. ఇది జడాకాశమైతే అది చిదాకాశం Conscious Space. నన్ను నేను ఎలా ఉన్నా నని చూచుకొంటున్నానో నా చుట్టూ ఉన్న జగత్తును కూడా ఉందనే చూస్తుంటాను. ఈ ఉండటమనే స్ఫురణ ఇప్పుడెక్కడ ఉందంటావు. నా లోపలా వెలపలా అంతటా పరుచుకొనే ఉందా లేదా. ఇలా ఏది పరచుకొని సర్వ పదార్ధాలలోనూ కనిపిస్తుంటుందో అది సామాన్యం Universal. ఆభరణాలలో బంగారంలాగా. పోతే అది వేటి లోపలా వెలపలా వ్యాపించి ఉందో అవి విశేషాలు. సామాన్య మన్నిటినీ వ్యాపించినట్టు విశేషాలు వ్యాపించలేవు. కాని రెండూ ఎప్పుడూ ఎక్కడబడితే అక్కడ కలిసే ఉంటాయి. కలిసి ఉన్నా మనం ఆయా విశేషాలతోనే సంబంధం పెట్టుకొంటాము గాని అక్కడే ఉన్న సామాన్యంతో పెట్టుకోము. కారణమేమంటే దృశ్య ప్రపంచంలాగా మన దృష్టి కూడా విశేషమే అయి కూచుంది. అందుకే మనమీ శరీర మనః ప్రాణాలనే విశేషాలను నేనని అభిమానించాము. ఆ దృష్టి వదలకుండానే భార్యా పుత్రులనూ వస్తు వాహనాలనూ విశేషాలుగానే చూస్తుంటాము. ఈ విశేష దృష్టి వదలుకోనంత వరకూ మానవుడికి మోక్షం లేదు. ఒక యాఙ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి చేశాడన్నా ఇదే బోధ. ఆ యాఙ్ఞవల్క్యుడే జనక మహారాజు సభలో గార్గి మొదలైన వారికి చేశాడన్నా ఇదే బోధ. ఇవన్నీ కధలు. కేవలం సంకేతాలు. సంకేత మెప్పుడూ సత్యాన్ని బయటపెట్టాటానికే ఉంటుంది. ఇక్కడ ఈ సంకేతాలన్నీ మనకు చాటి చెప్పే సత్యం సర్వమూ పరమాత్మ స్వరూపమే. జీవుడనని భావించే నీ స్వరూపం కూడా అదే. ఇదే ఏకైక సత్యం. ఇదం సర్వం యదయ మాత్మా - అహం బ్రహ్మాస్మి అని రెండు మాటలలో దీన్ని చాటి చెబుతున్నది ఉపనిషత్తు. అయితే ఇది ఒక్కసారిగా అందుకోగలిగితే వాడుత్తమాధికారి Competent. అలా కాకుంటే శ్రవణ మనన నిది ధ్యాసలనే మూడు భూమికలలో అంచెలవారిగా సాధన చేసి అనుభవానికి తెచ్చుకోమని సాధన మార్గాన్ని కూడా ఉపదేశించిందీ ఉపనిషత్తు. ఇది జీవితంలోనే ప్రయత్నించాలి మానవుడు. నిర్లక్ష్యం చేశాడో ఎంత అనర్ధానికైనా దారి తీస్తుంది. అదే జనన మరణ పరంపర అని కూడా హెచ్చరించింది. ఇదీ బృహదారణ్యక సారం.