ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
1. ఈశావాశ్యోపనిషత్తు
3. కఠోపనిషత్తు
మనసు బ్రహ్మాకార వృత్తితో నిండిపోతే చాలు. అవసానంలో ఆ మనససే బ్రహ్మాకారంగా మారి అమృతత్వమనే మోక్ష ఫలం లభిస్తుందని హామీ ఇచ్చింది కేనోపనిషత్తు. అమృతత్వమంటే మరణం లేక పోవటమే గదా. నిజంగానే మరణ మనేది లేకుండా పోతుందా అని మానవుడికి మరలా అనుమానం. ఈ అనుమానంతోనే నచికేతుడనే ఒక ముని కుమారుడు యమలోకం దాకా పోయి సాక్షాత్తూ యమధర్మరాజునే నిలదీసి అడిగాడు. యత్వం పశ్యసి తద్వద - నీవు నిజంగా చూచే చెబుతున్నావా అని అడుగుతాడు. దానికి యముడు సమాధానమిస్తూ ఆత్మను దర్శించ గలిగితే అది సాధ్యమే నంటాడు. ఆత్మ అంటే ఏమిటి. అది ఎక్కడ ఉంది. సర్వేషు భూతేషు గూఢః - ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కాని గుప్తంగా ఉంది. మరి ఎలా పట్టుకోటం. బుద్ధి బాగా పదునెక్కితే అదే పట్టుకోగలదా తత్వాన్ని. అప్పుడు తమలపాకు నుంచి దాని ఈనె బయటకి లాగినట్టు, ఈ నామరూప ప్రపంచం నుంచి వేరు చేసి చూడగలదు ఆత్మ చైతన్యాన్ని. చూస్తే ఆ చైతన్యానికి మరణం లేదు కాబట్టి దాన్ని పట్టుకొన్న ఈ జీవుడికి కూడా లేదు మరణం. ముక్తుడయి పోతాడు. కాని చెప్పినంత సులభం కాదిది. దానికొక సాధన క్రమముంది. బాహ్యమైన పదార్ధాల నుంచి ఇంద్రియాల దగ్గరికి - ఇంద్రియ వృత్తుల నుంచి మనసు దగ్గరకి - మనస్సు నుంచి అంతకన్నా విశాలమైన మహత్తు దగ్గరికి - దాన్ని కూడా దాటి అవ్యక్తమైన శక్తికీ - ఆశక్తిని కూడా దాటి పూర్ణమైన ఆత్మ చైతన్యానికీ ఎదుగుతూ పోవాలి మానవుడి ఙ్ఞానం. అప్పుడది ఎక్కడి కక్కడ విశేషరూపంగా పరిమితమై పోక సామాన్యరూపంగా వ్యాపిస్తుంది. అందులో ఈ నామరూపాలన్నీ సముద్ర జలంలో తరంగ బుద్బుదాలలాగా చేరిపోతాయి. అన్నీ చేరిపోయినట్టే జనన మరణాలనే భావాలు కూడా ఒక విశేషమే కాబట్టి అవీ ఆ దృష్టిలో లయమయి పోగలవు. శరీరం ఒక రథం. జీవుడొక రథికుడు. బుద్ధి వీడికి సారథి. ఇంద్రియాలు దీన్ని లాగే గుఱ్ఱాలు. అయితే ఇవి ప్రాపంచిక విషయాలనే మార్గంలో కాక వీటినన్నింటినీ వ్యాపించిన చైతన్య మనే గమ్యాని కభిముఖంగా పయనించాలి. అప్పుడే జీవిత గమ్యమైన మోక్షాన్ని అందుకోటం సులభమవుతుంది. ఇదీ కఠోపనిషత్తు మనకిచ్చే సలహా.