ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
1. ఈశావాశ్యోపనిషత్
ఉపనిషత్తులు ప్రధానమైనవి పది అని పేర్కొన్నాము. ఈ పదింటిలో మొదటిది ఈశావాస్యం. ఈశావాస్యమిదగ్ం సర్వం. ఈ ప్రపంచమంతా ఈశ్వర చైతన్యంతో నిండి పోయిందని చాటుతున్నదీ ఉపనిషత్తు. అందుకే ఆపేరు వచ్చింది దీనికి. వాస్తవంగా ఇది పరమాత్మ స్వరూపమే అయినా అలా కనపడటం లేదీ ప్రపంచం. నామరూపాత్మకంగా కనిపిస్తున్నది. అలా కనిపిస్తున్నంత వరకూ దీనివల్ల బాధలు తప్పవు. అంచేత ప్రతి ఒక్కటీ కేవల మున్నదనే స్ఫురణే తప్ప మరే విశేషమూ లేదనే దృష్టి అలవరచు కోవాలి మనం. ఎక్కడ ఉందా స్ఫురణ. తదంతరస్య. ఎక్కడా అనే ప్రశ్నే లేదు. ప్రతి దాని లోపలా వెలుపలా సొమ్ములలో బంగారంలాగా వ్యాపించి ఉంది. బంగారమనే దృష్టి వదలకుండా ఆభరణాలు చూచినట్టే ఈశ్వర చైతన్య దృష్టితో చూడాలి ప్రతి ఒక్కటీ. అయితే అలాటి ఙ్ఞానం పెట్టుకొని కూచుంటే దినచర్య ఎలా చేయాలి మనం. పరవాలేదు. ఏవంత్వయి. మనో వాక్కాయాలతో ఏ పనిచేస్తున్నా ఆ దృష్టి పెట్టుకొనే చేయవచ్చు. అప్పుడీ కర్మ ఆ ఈశ్వర స్పృహ కడ్డు రాదు. అది మానసిక స్ఫురణ. ఇది భౌతికమైన చర్య. శత్రుత్వం లేదు రెంటికీ. ఙ్ఞానమే ఈ కర్మలనే ప్రణాళిక ద్వారా బయటపడి ప్రసరిస్తున్నట్లు చూడవచ్చు. ఙ్ఞానం కనపడదు. అది చేసీ కర్మ కనపడుతుంది. కనపడే ఈ కర్మ ఏదో కాదు. దీని వెనకాల ఆ ఙ్ఞానమే ఉందనే అవగాహన ఉంటే చాలు. ఇది ఎలాంటిదంటే ఒక బల్బు వెలుగుతుంటుంది. ఒక ఫాను తిరుగుతుంటుంది. ఇవి కనపడుతుంటాయి మనకు. కాని వీటికి ప్రేరణ నిచ్చే విద్యుచ్ఛక్తి కనపడదు. పైకి కనపడక పోయినా దాని క్షేత్రంలోనే ఇవి పనిచేస్తున్నట్టు - అదే వీటి ద్వారా బయట పడుతున్నట్టు దర్శించటం లేదా మనం. అలాగే ఇదీ. అలా దర్శించాలంటే ఈ ఆకారాలకూ వ్యాపారాలకూ Forms and Functions వెనకాల ఉన్న ఆ నిరాకారమైన ఆత్మ చైతన్యాన్ని ఒక విద్యుచ్ఛక్తిలాగా అవగాహన చేసుకొనే శక్తి ఉండాలి మానవుడికి. అది కలిగే వరకూ కొంతకాలం ఆ నిర్గుణమైన తత్వాన్ని సగుణంగా ధ్యానం చేస్తూ పోవాలి. దీనికే ఉపాసన అని Meditation పేరు. అలా చేస్తూ పోతే మనసు బాగా నిర్మలమూ ఏకాగ్రమూ అవుతుంది. చివర కవసానంలో ఆ భావమే మనసులో నిలచి సాధకుడు తన ప్రాణశక్తిని సూర్యశక్తిలో ప్రవేశపెట్టి దాన్ని కూడా భేదించుకొని సత్యలోకం దాకా ప్రయాణం చేస్తాడు. అక్కడ నిర్గుణ ధ్యానం చేసే చతుర్ముఖ బ్రహ్మ, ఆయన చుట్టూ ఉన్న వసిష్ఠాది మహర్షులతో పాటు తానూ ఆ శిక్షణ పొంది చివరకు నిరాకారమైన ఆ తత్వాన్ని తన స్వరూపంగా భావన చేసి తరించగలడు. ఇదీ ఈశావాస్యం మనకు చేసే బోధ. ఇందులో రెండు భాగాలున్నాయి. ఉత్తమాధికారి అయితే ఇహంలోనే అంతా నిర్గుణమైన తత్వమేనని స్వానుభవానికి తెచ్చుకొని ఇక్కడే ముక్తుడవుతాడు. మధ్యమాధికారి Mediocre అయితే జీవితాంతమూ సగుణంగా ధ్యానించి మరణానంతరం ధ్యానబలంతో పరలోకానికి వెళ్ళి అక్కడ ఙ్ఞాన మలవరచుకొని తరిస్తాడు. మొదటిది సద్యోముక్తి. రెండవది క్రమముక్తి.