ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
9. ఛాందోగ్యోపనిషత్తు
పోతే ఇక రెండుపనిషత్తు లున్నాయి. ఛాందోగ్య మొకటి. బృహదారణ్య మొకటి. ఛాందోగ్యం తత్త్వమసి - నీవు పరమాత్మవేనని మనకు ఉపదేశిస్తుంది. బృహదారణ్యకం అహం బ్రహ్మాస్మి - నేనా పరమాత్మనే అని జీవుడికా ఉపదేశ మనుభవానికి తెస్తుంది. కాని జీవుడికి జగత్తనేది ఇలా కనిపిస్తున్నంత వరకూ నీవు పరమాత్మవేనని చెప్పినా ప్రయోజనం లేదు. కనుక ఐతదాత్మ్య మిదగ్ం సర్వం ఇదంతా కూడా ఆత్మ స్వరూపమేనని దీన్ని ఆత్మ చైతన్యంలో లయం చేసి చూపుతుంది ఛాందోగ్యం. జగత్తులయమైతే చాలు. జీవుడు అప్రయత్నంగా ఈశ్వర స్వరూపుడే అవుతాడు. కాని జగత్తు ఎలా లయమవుతుంది. జగత్తనేది ఒక కార్యం. అంటే ఒక దాని నుంచి తయారయింది. దేని నుంచి తయారయిందో అది దీనికి కారణం. కారణం కంటే దాని కార్యం వేరుగాదని సిద్ధాంతం. మట్టి కన్నా కుండ వేరు గాదు గదా. బంగారం కన్నా ఆభరణం వేరు గాదు గదా. అలాగే అస్తి-భాతి. ఉన్నదనే స్ఫురణ కంటే లోకంలో ఏ పదార్ధం కాని అన్యంగా లేదు. ఏదైనా ఉన్నట్టు స్ఫురించేదే. ఉందనే స్ఫురణ తీసేస్తే ఆ పదార్ధమే లేదు. మన మనోభావాల దగ్గరి నుంచి బాహ్యమైన ఆకాశం వరకూ ప్రతిదీ ఉంది స్ఫురిస్తున్నదనేగా చూస్తున్నావు. ఆ ఉండటం స్ఫురించటమే పరమాత్మ. అదే ఆశ్రయ Basis మీ నామరూపాలకు. ఇవేవో స్వతహాగా ఉన్నాయని గాదు. అలా స్వతంత్రంగా ఉన్నది ఆ సచ్చిద్రూపమైన ఆత్మే. అదే ఈ నామరూపాలుగా కూడా భాసిస్తున్నది. ఇవి దాని విభూతి Manifestation. అది వీటి స్వరూపం Substance. ఇలా అర్ధం చేసుకోగలిగితే జనన మరణాలు కూడా మన స్వరూపమే అయి అమృతత్వమే సిద్ధిస్తుంది మానవుడికి. ఈ రహస్యం శ్వేత కేతువనే కుర్రవాడి కుద్దాలకుడూ - నారదుడనే దేవర్షికి సనత్కుమారుడూ - చివరకు దేవేంద్రుడికి బ్రహ్మ దేవుడూ - బోధ చేశారని చెబుతున్నది ఛాందోగ్యం. దీనికే ’భూమ విద్య’ అని పేరు పెట్టింది. ఎక్కడ ఉందా భూమ The summum Bonum అని అడిగితే సఏవోపరిష్టాత్స ఏవాధస్తాత్ - ఇక్కడా అక్కడా అని తేడా లేదు. సర్వత్ర సర్వదా సర్వరూపాలలో పరుచుకొని ఉన్నదదే. అదే జీవుడి స్వరూపమదే ఈ ప్రపంచ స్వరూపమని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక రహస్యం మనకుపదేశిస్తుంది ఛాందోగ్యం.