జ్ఞానమే అనుభవం గనుక ఎప్పుడు జ్ఞానోదయమైతే అప్పుడే మోక్షం. అందుకే ఇహ అంటున్నాడు. మరణకాలం వరకూ కనిపెట్టుకొని ఉండనక్కర లేదు. జీవించి ఉండగానే. అలాగే దీనికన్నా వేరుగా పరమేదో ఉందని అందుకోసం పరుగెత్తటం కూడా కాదు. ఇహ ఇక్కడ. ఇక్కడే ఇప్పుడే అమృతో భవతి.
మంచిదే కాని కేవలం దాన్ని గుర్తించి దాని జ్ఞానం సంపాదించినంత మాత్రాన సరిపోతుందా. ఫలితమిస్తుందా అని సందేహించ వచ్చు నీవూ నేనూ. అందుకే వేదాంత శ్రవణంతో తృప్తి చెందక మరలా కర్మానుష్ఠాన యోగాభ్యాస మంత్రం తంత్రాది మార్గాలన్నీ త్రొక్కలేక సతమతమయి పోతున్నారు మానవులు. జ్ఞానం సిద్ధాంతం వరకే చూచుకొని అది అనుభవానికి రావాలంటే ఏదో ఒక ఆచరణ కూడా ఉండాలని భావించి కర్మాదులన్నీ నెత్తిన పెట్టుకొంటున్నారు. జిజ్ఞాసువులే గాక జ్ఞానులైన వారు కూడా. ఇలాగే చాలామంది ప్రవర్తిస్తున్నారు. సన్న్యాసులు స్వాముల వార్లు పీఠాధిపతులందరూ చేస్తున్న పిచ్చి పని ఇదే. ఇది కేవల మొక భ్రాంతి ఒక అపోహ అని చెప్పటానికే నాన్యః పంధా అయనాయ విద్యతే అని పనిగట్టుకొని మరలా దాన్ని నిషేధిస్తున్నది మంత్ర వర్ణం.
Page 97