యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాః - తాని ధర్మాణి ప్రధమాని ఆసన్ - తేహనాకం మహిమాన స్సచంతే - యత్ర పూర్వేసాధ్యా స్సంతి దేవాః
ఇది ఒక సంప్రదాయం. ఒక పరంపర Tradition. గురు శిష్య వంశం. వంశమనే పేరు పెట్టింది దీనికి ఛాందోగ్యం. ఇది ఎలాంటి వంశమో సంప్రదాయమో వర్ణిస్తున్నాడు మహర్షి. ఏమని. యజ్ఞేన యజ్ఞ మయ జంత. పూర్వం మన వంశీయులైన బ్రహ్మవేత్తలంతా చేస్తూ వచ్చిన యజ్ఞ మొకటి ఉందట. యజ్ఞంతోనే చేసిన యజ్ఞమట అది. యజ్ఞంతో యజ్ఞమేమిటి. యజ్ఞమంటే ఇది భౌతికంగాదు బాహ్యమైనది గాదు. జ్ఞానమే యజ్ఞం. అందులో ఒక జ్ఞానం మరొక జ్ఞాన సాధనకు చేస్తున్నది. మొదటి జ్ఞానం పరిచ్ఛిన్నమైన జైవ జ్ఞానం. అది సంపాదించాలను కొన్నది పరిపూర్ణమైన ఈశ్వర జ్ఞానం. పరిమితం పరిపూర్ణ స్థితి నందుకొనే ప్రయత్నమే జ్ఞాన యజ్ఞమంటే. ఎవరా చేస్తున్నదింతకూ. దేవాః దేవతలని బాహ్యార్థం. కాని ఇక్కడ లక్ష్యార్ధంలో నడుస్తున్నది. దీవ్యంతి ప్రకాశంతే ఇతిదేవాః చక్షురాదీంద్రియాలూ లేదా అంతరింద్రియమైన మనోభావాలూ.
Page 98