#


Index

  అతడే మొదటి పురుషుడు. ఆది కర్తా స భూతానాం. సమస్త భూత సృష్టికీ అతడే మొదట కర్తృత్వం వహించినవాడు. శరీరమంటే ఇక్కడ విశ్వ శరీరం. సమష్టి ప్రపంచం. అదే ఆయన శరీరం. అందులోనే ప్రవేశించి వ్యాపించాడు కాబట్టి పురుషుడు. సమష్టి జీవుడు. తస్మా దృజ్ఞాత్సర్వహుతః అతడే ఇప్పుడు యజ్ఞం. యజనం చేయవలసిన స్వరూపం. యజ్ఞ మాయన సంకల్పమే. సృష్టి చేయాలనే భావం. సర్వహుత మది. సర్వమూ బీజరూపంగా హుతమయి ఉన్నాయందులో. గుప్తంగా తనలోనే ఉన్న ప్రపంచాన్నే తాను బయటపెట్టాడు. పెట్టాడు గాదు. తానే ఈ రూపంగా బయటపడ్డాడు. సంభృతం పృషదాజ్యం. పృషదాజ్యమంటే దధి ఘృతాది భోజ్య పదార్ధ జాతం. భోగ్య ప్రపంచాని కంతా ఉపలక్షణ మీ మాట. అంటే జీవుల నుభవించ వలసిన సామగ్రి అంతా. ముందు భోగ్యమైన అన్నం తయారయితే గాని భోక్త అయిన జీవుడు రంగంలోకి రాడు.

  ఇప్పుడా భోక్త ఎవరంటే వర్ణిస్తున్నారు. పశూంస్తాం శ్చక్రే. పశువులట అవి. పశ్యతీతి పశుః - ఏది దీన్ని వర్ణిస్తూ దీనితో సంబంధం పెట్టుకొంటుందో అది పశువు. అలా పెట్టుకొంటూనే దానిలో బందీ అయిపోతే కూడా అది పశువే. పాశ్యతే ఇతి పశుః - అప్పుడది దీనితో కట్టి పడేసి నట్టయి పోతుంది. ఏదటా అది. మనబోటి ప్రాణి కోటే ఎలా ఉంటాయీ ప్రాణులు.

Page 81