అంటే స్వరూపంగా విభూతిగా కూడా ఉన్నదొకే ఒక పురుష తత్త్వం. సోపాధిక మదే. నిరుపాధికమదే.
అయితే ఈ దశాంగుళ మేమిటి. దశాంగుళ మంటే పది అంగుళాలని అర్థం. పది అంగుళాల ఎత్తున ఉన్నదా అది ఈ భూమికి. కాదు. పది అంటే ఇక్కడ పది దిశలు. అంగుళ మంటే కోణమని అర్థం. పది దిక్కులూ పది కోణాలు కేంద్రానికి. దశావరా విరాట్ - విరాడన్న మని - శ్రుతి చెబుతున్నది. దశ దిశలూ విస్తరించి ఉన్నదీ విరాట్టు. వివిధ రూపాలుగా రాజిల్లేది విరాట్టు. భువన కోశం Universe. అదే అన్నం Matter. పాంచ భౌతికమైన ప్రపంచం. జ్ఞానానికి విషయం. జ్ఞాన మన్నాద అయితే ఇది దాని కన్నం. ఈ అన్న రూపమైన ప్రపంచమే దశాంగుళం. దశాంగుళ మంటే మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. మన హృదయం నాభి నుంచి పది అంగుళాల పైన మెడ నుంచి పది అంగుళాలు క్రిందా ఉంది. అది ప్రాజ్ఞ రూపుడైన జీవుడికి నిలయం. ఈశ్వరుడే జీవరూపంగా వచ్చి హృదయంలో చేరాడు గనుక దశాంగుళాల మేర అతిక్రమించి పురుషుడున్నాడనే మాట సరిపోతుంది. దీన్ని దాటి కూడా ఉన్నదా పురుష. దీన్ని వ్యాపించీ ఉంది. విభూతిగా వ్యాపించింది. స్వరూపంగా అతిక్రమించింది.
పురుష ఏవేదగ్ం సర్వం - యద్భూతం యచ్చభవ్యం - ఉతామృత త్వస్యేశానో - యదన్నే నా తిరోహతి
Page 62