#


Index

  వీరందరికీ ఉన్న శిరో నేత్ర పాణి పాదాద్యవ యవాలన్నీ కలిస్తే ఎన్నో కోట్ల అవయవా లవుతాయి గదా. కాగా ఇప్పుడీ మనబోటి జీవుల అవయవాలే దాని అవయవాలు. నిరాకారమైన ఆ పురుష స్వరూపం సాకారమైతేనే గదా ఇవన్నీ ఇలా భాసిస్తున్నాయి. దాని చైతన్య ఖండాలే ఈ జీవులైతే దాని శక్తి ఖండాలే ఈ జీవకోటి శిరః పాణ్యాది అవయవాలన్నీ. అప్పటికి మనదంటూ ఏదీ లేదు. మనమే దానికి వేరుగా లేనప్పుడు మన శరీరేంద్రియాలు మాత్రం దానికి వేరెలా అవుతాయి. అయినా ఇలా కనిపిస్తున్నా యంటే ఇవి - అదే ఇలా ఈ ఈ రూపాల్లో భాసిస్తున్నదని అర్ధం చేసుకోవాలి మనం.

  సభూమిం విశ్వతో వృత్వా- అది ఈ రూపాలుగా భాసింటమే కాదు. ఈ భూమండలాన్ని అన్ని వైపులా వ్యాపించి కూడా ఉంది. భవతీతి భూమిః ఏది జన్మించిందో అది భూమి. ఆ పురుష తత్త్వం నుంచి జన్మించిందేమిటి. అండ పిండ బ్రహ్మాండాలన్నీ. అప్పటికి భూమిని వ్యాపించిందంటే సృష్టినంతా వ్యాపించిందని అర్ధం. వ్యాపించి ఎలా ఉందది. అత్యతిష్ఠ దశాంగుళం. ఒక పది అంగుళాలు దీనిని మించి పయిన ఉన్నదట. తత్త్వాధికా తత్త్వమయీ అని అమ్మవారి నామాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ బ్రహ్మాండ రూపంగా ఎంత కనిపిస్తున్నదో అది – దీని కదనంగా అంత ఉన్నది.

Page 61