గౌరీ మిమాయ సలిలాని - తక్ష త్యేక పదీ ద్విపదీసా చతుష్పదీ నవ పదీ బభూ వుషీ సహస్రా కర్షా పరమే వ్యోమన్ -
ఆఖరి మంత్ర వర్ణమిది. మన ప్రయాణం కూడా దీనితో ఆఖరవుతుంది. అధోముఖంగా చేసిన మన ప్రయాణం ఊర్థ్వముఖంగా సాగాలిప్పుడు. మొదటిది సంసార బంధం తెచ్చి నెత్తిన పడేస్తే రెండవది సాయుజ్య సుఖాన్ని అందిస్తుంది. నిగ్రహాను గ్రహాలకు రెంటికీ సమర్ధ మయిందా శక్తి. ఒకటి అవిద్యా రూపిణి. ఇంకొకటి విద్యారూపిణి. అవిద్యా రూపంగా ఆ గౌరి మిమాయ సృష్టించింది. ఏమిటి. సలిలాని. పృధివ్యాది భూత పంచకాన్ని. తక్షతి. సృష్టించిందంటే మరలా అది ఆరంభం కాదు. పరిణామం కాదు వివర్తం. ఒక వడ్రంగి చెక్కను తలుపు రూపంలో మలచినట్టు మలచింది. అదే తక్షణమంటే. చెక్కటమనే అర్థం. అలా మలచే సరికది ఏకపదీ ద్విపదీ సాచతుష్పదీ అష్టాపదీ నవపదీ. ఏకరూపంగా ఉన్న ఆ శక్తే రెండూ నాలుగూ ఎనిమిది తొమ్మిది ఇలా అనేక రూపాలలో భాసిస్తున్నది. బభూవుషీ సహస్రాక్షరా- వేలకొలది ఆకారాలలో ఇలా కనిపిస్తున్నా అది అక్షరమే ఆ మహాశక్తి. క్షరమై పోలేదు వాస్తవంలో.
Page 55