- ఉత్తరార్ధము -
ఇక్కడికి మంత్ర పుష్పంలో పూర్వభాగం సమాప్తమయింది. ఇక ఉత్తర భాగం ప్రారంభమవుతుంది. ఇంతకు ముందే చెప్పామొక మాట పురుష సూక్త మవరోహణ మార్గంలో నడిస్తే మంత్ర పుష్ప మారోహణ క్రమంలో నడుస్తుందని. ఆరోహణ మంటే మన దగ్గరి నుంచి గమ్యం వైపు చేసే ప్రయాణం. గమ్యమేమిటి జీవితానికి. ఏకాత్మ భావం. జీవ జగదీశ్వరులనే తేడా లేకుండా ఉన్నదంతా ఆత్మ స్వరూపమేననే జ్ఞానం. అది ఇప్పుడు లేదు మనకు. వస్తుతంత్రంగా ఉన్నా బుద్ధి తంత్రం కావటం లేదు. బుద్ధి తంత్రం కానంత వరకూ మోక్షం లేదు. అంచేత ఆ ఏకాత్మ భావాన్ని గమ్యంగా పెట్టుకొని దాని కభిముఖంగా మన బుద్ధి ప్రయాణం చేయవలసి ఉంది.
కాని అలా చేయాలంటే ఊరక గుడ్డెద్దు చేలో పడ్డ సామెతగా చేస్తూ పోయామంటే సుఖం లేదు. ఎన్నటికీ చేరలేమా గమ్యం. గమ్య మగమ్య మవుతుంది. గమ్యమనే దేమిటో అది ఎలా ఉంటుందో ముందు మన అవగాహనకు రావాలి. అలా వచ్చినప్పుడే దాని ఆలోచన లేదా దాని వృత్తి మన మనసు కేర్పడుతుంది. ఏర్పడితే దాని నాలంబనం చేసుకొని మన బుద్ధి దాని ననుసరించి గమ్యం వైపు సాగిపోగలదు. ఏదైనా అంతే. ప్రమాణం ద్వారానే ప్రమేయాన్ని అందుకోవాలి. బుద్ధిశ్చనః ప్రమాణం సదసతో ర్యాథాత్మ్యాధిగమే అన్నారు భగవత్పాదులు.
Page 146