#


Index

  ఆకాశం అన్నిటి కన్నా పెద్దది. మన జ్ఞానానికి గోచరిస్తున్నది. కనుక అది మహాజ్ఞేయమే. కాని దానికి ఆత్మ లేదు. అంటే తానున్నాననే జ్ఞానం లేదు దానికి. నేననే జ్ఞానం నాకూ నీకూ ఉన్నది. కాని మహత్తు కాదది. అప్పటికి మహత్తైన ఆకాశానికి జ్ఞానం లేదు. జ్ఞానమున్న నాకు మహత్త్వం లేదు. నేనే నా జ్ఞానాన్ని సర్వత్రా వ్యాపింప జేసుకొన్నా ననుకో. అప్పుడది శరీరంలోనే ఉండటానికి లేదు. శరీరంలో ఎంత ఉందో దాని వెలపలా కూడా ఎక్కడ బడితే అక్కడ ఉండగలదు. అప్పుడది విశ్వాత్మ. విశ్వమంతా వ్యాపించిన ఆత్మ. దానికిక శరీర సంబంధమైన జననమరణా ద్యనర్ధాలుండవు. పరాయణ మవుతుంది. అయన మంటే దాటిపోవటం. పరాయణ మంటే అన్ని హద్దులూ దాటిపోతుంది. దేశకాల వస్తువులనే హద్దులు దాటిందంటే నరుడు గాదది నారాయణ. జీవ జగత్తులు రెండింటికీ ఆశ్రయం. అలాంటి తత్త్వమే మనకు మహాజ్ఞేయం. అంటే అర్ధం చేసుకొని అందుకోవలసిన గొప్ప జ్ఞేయ పదార్ధం. జ్ఞానం గదా. అది జ్ఞేయమెలా అవుతుందని అడగవచ్చు. జ్ఞేయం గాని జ్ఞానం. జ్ఞానమే ఇప్పట్లో మన అల్ప జ్ఞానాని కంతు పట్టటం లేదు కాబట్టి మనకు జ్ఞేయంగా భాసిస్తున్నది. మనది అల్పం గనుక అది మహత్తుగా అనిపిస్తున్నది. మన జ్ఞానమే అంతకంతకు శరీరం దాటి విస్తరించే కొద్దీ అఖండమైన ఆ జ్ఞానమే మన జ్ఞానమని అవగాహన వస్తుంది. కాబట్టి అంతవరకూ తాత్కాలికంగా మనకు జ్ఞేయమే.

Page 135