

తామెంచుకొన్న జ్ఞానమార్గంలో ఉండకపోతేనే నష్టం. అప్పుడటు కర్మకూ ఇటు జ్ఞానానికీ రెంటికీ చెడ్డ రేవళ్లవుతారు. ఇలా ఇద్దరికీ ఆస్తి పంచి పెట్టింది వేదం.
కాగా ఇప్పుడీ సంధ్యా వందనాది కర్మలన్నీ నిత్యకర్మల క్రిందికి వస్తాయి. అహరహ స్సంధ్యా ముపాసీత. ప్రతి దినమూ మూడు పూటలా సంధ్యా వందన మాచరించాలి అని విధించింది శాస్త్రం. ఎవరా ఆచరించవలసిన వారంటే త్రైవర్ణికులన్నారు. బ్రహ్మక్షత్త వైశ్యులే త్రైవర్ణికులంటే. వారు సంధ్యోపాసన చేసి తీరాలి. ఉప నీతులైన పెద్దలూ పిన్నలూ మనలో చాలామంది అలా పాటిస్తున్నారు కూడా. కాని కేవలం యాంత్రికంగా చేస్తున్నారా కర్మ. ఏదో మన పెద్దలందరూ ఇలా చేస్తూ వచ్చారు మనమూ ఇలాగే నడుచుకోవాలది మనకూ మన కుటుంబానికీ మంచిదని చేస్తున్నారే తప్ప తాము చదివే మంత్రాలేమిటో చేసే అనుష్ఠానమేమిటో దాని అర్థం తెలిసి కాదు. నూటికి తొంభయి మంది కర్త జ్ఞానమే లేదు. అర్థం దేవుడెరుగు. అసలు శబ్దాచ్చారణమే సరిగా చేయటం లేదు. తత్సవితుః అనే మాటలు విడగొట్టి తత్స వితుః అని ఒకడచ్చరిస్తే వితుః అని కూడా కాక తత్స పితుః అని మరొక డచ్చరిస్తున్నాడు. మనచేత వ్రతాలూ అవీ చేయించే పురోహితులనూ దేవాలయాల్లో మంత్రాలు చదివే అర్చక సార్వభౌములనూ గమనిస్తే మీకే తెలుస్తుంది. చాలా వరికిదే వ్యవహారం.
Page 5
