ఇది ఎంత రాజమార్గమయినా అందరికీ సాధ్యమయేది కాదని ముందే చెప్పాము. అయితే సాధ్యంకాదని ఊరక కూచోరాదు. కూచోరుకూడా మాన వులు. ఎవరి అంతస్తుకు తగినట్టు వారు సాధన చేస్తూనే ఉంటారు. అయితే దానిలో ఉత్తమ మధ్యమ-మంద- అతి మంద అనే అధికార భేదం మాత్ర ముంటుంది. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గమే మన మిప్పుడు పేర్కొన్న జ్ఞానమార్థం.
పోతే రెండవదయిన మధ్యమ మార్గమొకటి ఉంది. దానినే సాంఖ్యమని వ్యవహరిస్తారు. సాంఖ్యమంటే వివేచన. ప్రపంచమంతా త్రిగుణాత్మకం. నా స్వరూపం త్రిగుణాల కతీతమయిన కేవల పురుషతత్త్వం. అలాంటి తత్త్వాన్ని దీని బారినుంచి తప్పించి నేను దీన్ని దూరం చేసుకోవాలి. చేసుకొంటే అప్పుడు నా సహజ రూపంతో నేను ఉండిపోతాను. త్రిగుణాలు నాకు దూరమవుతాయి. కాబట్టి వాటి బాధ నాకు లేకుండా పోతుంది. అని ఇలా ప్రకృతి పురుష వివేచన చేసి చూడటం సాంఖ్యమంటే ఒక విధంగా ఇది ప్రసంఖ్యాన రూపమయిన ఉపాసన లేదా భక్తిమార్గం క్రిందకి వస్తుంది.
పోతే మూడవది కర్మ మార్గం. కర్మమంటే పనిచేయటం. మామూలుగా చేస్తే అది కేవల కర్మేగాని యోగం గాదు. యోగమే కావాలంటే చేసే ప్రతి పనీ తనదిగా భావించక సాధకు డీశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అంటే కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ తనకు లేకుండా చేసుకోవాలని భావం. అలా చేసుకొంటే అది స్వకర్తృకంగాక ఈశ్వర కర్తృకమవుతుంది. తానా ఈశ్వరుడికొక భృత్యుడి మాదిరయి ఆయన తరఫున తానది నెరవేరుస్తున్న భావమేర్పడుతుంది. దానివల్ల ఏ ఫలితం కల్గినా తనది కాదిక. ఈశ్వరునిదే. ఇదే కర్మయోగమనే మూడవ మార్గం మందాధి కారులది.
60
అన్యేత్వేవ మజానంతః - శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
తేపిచాతి తరం త్వేవ - నిత్యం శ్రుతి పరాయణాః 13-25
పోతే నలుగవదైన మార్గానికి కూడా చెందిన వారనేకులున్నారు. వారతి మందులు. స్వయంగా ఏదీ భావన చేయలేరు. గ్రహించలేరు. కాని పెద్దలు చెప్పిన దేదయినా విని దాని కనుగుణంగా నడుచుకొనే స్వభావమున్నది వారికి.
Page 72