అందుకు కారణం నిరంతరమూ ఆబ్రహ్మభావాన్ని నిలుపుకోవటమే. దీనికే స్మరణమని మరొక నామధేయం. తత్త్వస్మరణం వల్ల వాటి స్వరూపమే తదా విష్టమై తన్మయంగా పరిణమిస్తుంది. అసలు తత్త్వమే గదా అది. అలాంటప్పు డది శరీరం లాగా అంతరించే ప్రసక్తి ఎక్కడిది. అంతరిస్తే అది తత్త్వమెలా అవుతుంది. అంతరించేది శరీరమే.
అయితే శరీరాన్ని వదలి అతడెక్కడికో వెళుతాడని పేర్కొన్నారే. అదేమిటని ప్రశ్న. మాట సామెతగా చెప్పిందేగాని ఎక్కడికో వెళ్ళటం కాదది. అయితే ప్రయాతి అనేమాట కర్దమేమిటి? లోకుల దృష్టిని బట్టి చెప్పినమాట అది. చచ్చిన వాడి శరీరం కనిపిస్తున్నది. వాడు కనిపించటం లేదు. దానిని బట్టి వాడుదీన్ని విడిచి ఎక్కడికో వెళ్ళాడని భావించటం సహజమే. కాని వాడెక్కడికో వెళ్ళలేదు. వాడి దృష్టితో చూస్తే అక్కడే ఉన్నాడు వాడు. "స మద్భావమ్ యాతి” అంటు న్నాడు భగవానుడు, అంటే బ్రహ్మభావంతోనే ఉన్నాడు. బ్రహ్మమెక్కడ ఉంది. అంతటా ఉంది. అన్నిటిలోనూ ఉంది. కాబట్టి ముక్తుడైన వాడంతటా అన్ని రూపాలుగా అక్కడే ఉన్నాడని భావం.
49
యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం!
తంత మేవైతీ కౌంతేయ.సదా తద్భావ భావితః 8-6
ఇందుకు సందేహంలేదు. ఎందుకంటే అసలు ఒక్క పరమాత్మ భావమే గాదు. ఏయే భావాన్ని సాధకుడు ధ్యానిస్తూ కూచున్నా ఆ భావాన్నే అవసానంలో పొంద గలుగుతాడు. స్థూలమైన కళేబరమిక్కడే పడిపోవచ్చు కాని సూక్ష్మమైన అతని జీవచైతన్య మాధ్యేయ స్వరూపాన్నే అందుకొని అలాగే ఉండిపోతుంది. ఇందులో ఉన్న ఉపపత్తి ఏమిటని అడగవచ్చు. అన్యచింతమాని ఒకే ఒక భావాన్ని అంటిపట్టుకో గలిగితే చాలు. మనస్సు తదాకారంగా మారటానికి అవకాశం ఉంది. తద్భావ భావన మనేది ఇదే. భావన అనేమాట చాలా గంభీర మైంది. ఒక వస్తుగుణాన్ని మరొక వస్తువుకు పట్టించటానికి భావన మని పేరు. వైద్య శాస్త్రంలో కూడా ఈ శబ్దం తరుచుగా వినబడుతుంది భావన అల్లం భావన జీలకర్ర అనేవి ఇలాంటివే. మామూలు అల్లం-జీలకర్ర- ఔషధాలు కాకపోయినా పుటం పెడితే అవే ఔషధాలుగా పని చేస్తాయి.
Page 61