#


Back

38
యోయో యాంయాం తనుం భక్తః
శ్రద్ధ యార్చితు మిచ్చతి
తస్య తస్యా చలాం శ్రద్దాం
తా మేవ విదధా మ్యహమ్    7-21

అఖండ మైన తత్త్వాన్ని ఖండంగా భావించే వాని దృష్టి సమగ్రం కానేరదు. పైగా అది సకామం. అయినా వాడు భావించిన ఆ మూర్తినే భక్తి శ్రద్దలతో ఆరాధిస్తాడు. శ్రద్ధ అనేది చాల శ్లాఘ నీయమైన గుణమని గదా ముందు చెప్పాము. కాబట్టి ఆ శ్రద్ధ సడలకుండా వాడి కంత కంత కచంచలంగా పరిణ మించేలా చేస్తాడా పరమాత్మ.

ఎంచేత నంటే తన అఖండ స్వరూపాన్ని వాడు గుర్తించ లేదనే గాని ఏదో ఒక రూపంలో తన్ను సేవిస్తూనే ఉన్నాడు. అకామంగా తన్ను భావించలేదనే గాని ఏదో ఒక కామంతోనైనా తన్ను ఆశ్రయిస్తున్నాడు. అదే చాలు భగవానుడు వాడి ననుగ్రహించడానికి.

39
స తయా శ్రధ్ధయా యుక్త - స్తస్యా రాధన మీహతే
లభతేచ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్    7-22

పరమేశ్వరు డనుగ్రహించిన ఆ శ్రద్ధా పాటవంతో వాడు తన ఆరాధన సాగిస్తాడు. ఆ ఆరాధన మూలంగా వాడు కోరిన కోరికలు కూడ ఫలిస్తాయి. అందుకు కారణం తానారాధిస్తూ వచ్చిన ఆ దేవతా మూర్తేనని వాడు భావించ వచ్చు. అది కేవలం పొరబాటు. కారణమేమంటే దేవతలందరూ పరమేశ్వరుని బంట్లు. ఈశ్వర ప్రేరణ లేకుండా ఏ దేవత గానీ స్వతంత్రంగా అనుగ్రహం చూపలేదు. పరిపూర్ణ శక్తి సంపన్ను డీశ్వరుడు. తద్విభూతి శకలాలే ఈ దేవతలు. ఈశ్వరుని కాదని సాధకుడిని అనుగ్రహించే శక్తి వాటి కెక్కడిది.

కాబట్టి ఒక సాధకుడి మనోరథ మేదైనా నెరవేరు తున్నదంటే అది ఆయా దేవతల వల్లనని కాదు. మరిదేని వల్ల. ఆ దేవతల ద్వారా పరమేశ్వరుడే మన కదినెరవేరుస్తాడని అర్ధం. ఇంతకూ సర్వసమర్థుడైన పరమేశ్వరుడు ఫలదాత అయితే దానికొక ప్రణాళిక Channel మాత్రమే ఆ దేవత.

Page 52