అయితే అసత్తయిన ఇదే మనకు కనిపిస్తున్నది గాని సత్తని చెప్పినా అది కనిపించటం లేదే అనవచ్చు. కనిపిస్తున్నా ఈ కనిపించేది అదే గాని ఇదిగాదు.
ప్రతి ఒక్క పదార్థాన్నీ పట్టి చూడు. సన్ ఘటః:- సన్ పటః, ఘటమున్నది- పటమున్నది అంటూ ప్రతి ఒక్కటీ ఉన్నది ఉన్నదనే చూస్తున్నాము. ఉండటమనే భావమూ-ఘట పటాది భావాలూ-రెండు సమానాధి కరణాలుగా In equa- tion కనిపిస్తాయి. వాటిలో ఘటపటాది భావాలు మారుతూ పోతాయి గాని ఉండటమనే భావ మెప్పటికీ మార్పు చెందదు. ఘటంలో కాకపోతే అది పటంలో కనిపిస్తుంది. పటంలో కాకపోతే అది కుడ్యంలో కనిపిస్తుంది. ఘటం మాత్ర మలాకాదు. పటం దగ్గరికి వచ్చేసరికి ఘటమనే బుద్ధి లేదక్కడ. అలాగే కుడ్యం దగ్గరికి వెళ్ళేసరికి పటమనే బుద్ధిలేదు. సద్బుద్ధి అలా కాక సర్వత్రా ఉంటుంది. నష్టమైన ఘటంలో సద్బుద్ది కూడా లేదు గదా అని ఆక్షేపించ రాదు. ఘటమనే విశేష రూపమే నశించింది గాని అక్కడ సత్తనే సామాన్యానికి క్షతి లేదు. ఎందుకంటే ఘట ముందని ఎలా చూచావో ఘటాభావాన్ని The Absence of pot కూడా ఉందనే చూస్తున్నావు. ఉభయత్రా సద్బుద్ధి ఉండనే వుంది. ఘట బుద్ధే ఒకచోట వుంది. మరొక చోట లేదు. ఈ విధంగా లోకంలో అణువు మొదలు ఆకాశం దాకా ప్రతి ఒక్క భావమూ మార్పు చెందుతూ పోవటం వల్ల అంతా చివర కసత్తే. అంటే వాటి వాటి విశేష రూపాలలో అవి లేవు. కేవలం సద్రూపంగానే ఉన్నాయి అన్నీ.
అయినా కనిపిస్తున్నా యంటే సత్తనే భావమే ఆయా విశేష రూపాలుగా భాసిస్తున్నదని చూడాలి మనం ఎండమావులలో నీళ్ళు ప్రవహిస్తున్నట్టు కనిపించినా అవి నీళ్ళు కావు. సూర్య కిరణాలే ఆ రూపంలో భాసిస్తున్నాయని అర్థం చేసుకోటం లేదా మనం. అలాగే ఇక్కడా ఇందులో ఉన్న మర్మమేమంటే సత్తనే దానికి రూపం లేదు. కాబట్టి దాని నున్నదున్నట్టు దర్శించలేకపో తున్నాము. అసత్తయినా ఘట పటాదుల కొక రూపముంది. కాబట్టి లేకున్నా వాటి నున్నట్టు చూస్తున్నాము. మరి దీనికి పరిష్కారమేమిటని అడగవచ్చు. సత్తనే దాని వివిధ రూపాలే ఈ ఘట పటాదులన్నీ-సద్రూపం గానే ఇవి సత్యం కాని తత్త ద్రూపంగా కావని -సమన్వయించుకోటమే.
ఇదిగో ఈ సద్రూపమైన చైతన్యమే ఆత్మ. అది అన్నింటిలోనూ పరచుకొని ఉన్నదే. కాబట్టి దాని నలాగే దర్శించి పట్టుకోటమే తత్త్వ దర్శనం.
Page 5