అయితే ఇది అందరికీ తెలిసిందే గదా-క్రొత్తగా మనకు బోధించటం దేనికని అడగవచ్చు. అక్కడే ఉన్న దంతరార్థం. అది మనకు తెలిసినట్టు కనిపించినా నిజంగా చూస్తే తెలియదు. నిజంలో మనమంతా ఉన్నదే లేదను కొంటున్నాము. లేనిదే ఉన్నదని భావిస్తున్నాము. ఆత్మ చైతన్యమనేది సర్వత్రా ఉన్నది. సర్వదా ఉన్నది. దాన్నే మనం లేదనుకొంటున్నాము. అలాగే ఉందను కొని నిత్మమూ చూచే ఈ చరాచర జగత్తెపుడూ లేదు. అయినా అనుక్షణమూ దీని నున్నట్టే చూస్తున్నాము. ఇదే మనం చేస్తున్న పొరపాటు. కనుకనే దీనిని సవరించి మనకుజ్ఞానోదయం కలిగించాలని భగవానుడి ఈ ఉపదేశం.
కావచ్చు. కానీ మనకీ ప్రపంచం నిత్యమూ అనుభవానికి వస్తూనే ఉంది గదా. ఇది అసత్తెలా అయింది. అలాగే మీరుందని చెప్పే ఆ చైతన్యమెక్కడా మనకు గోచరం కావటం లేదు గదా- అది ఒక్కటే సత్తని ఎలా చెప్పగలరు అని ఆశంక.
ఇలాంటి ఆశంక కలగటం సహజమే, వస్తు నిరూపణ చేయనంత వరకే ఆశంక. చక్కగా నిరూపించి చూచామంటే నదసద్విభాగం మనకు బాగా అర్ధమవుతుంది. నామరూపాత్మకమైన ఏ పదార్థమైనా తీసుకొని చూడు. ఒక ఘటం గాని పటంగాని ఏదైనా సరే. అది దాని కారణ ద్రవ్యం కన్నా భిన్నంగా ఉండబోదు. ఇంతెందుకు. ఘటమనే పదార్థమే ఉంది. అది దాని కారణమైన మృత్తు కంటే వ్యతిరిక్తంగా ఎక్కడ ఉంది. మృత్తికే ఘటరూపంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఘటమనేది వేరే ఎక్కడా లేదు. అది అసత్తే.
అలాగే ఆ మృత్పిండం దాని అణవుల సంయోగమే. వేరు కాదు. అవి పృథివీ పరమాణువులు. ఆ పృధివి జలవికారం. జలం తేజో వికారం. తేజస్సు వాయు కార్యం. ఆ వాయు వాకాశ జన్యం. కాబట్టి ఆకాశం కన్నా వేరుగా ఏ భౌతిక పదార్థమూ లేదు. పోతే ఈ ఆకాశం కూడా ఆచేతనమే కాబట్టి దానిపాటి కది సిద్ధించదు. సిద్ధించాలంటే దానికి విలక్షణమైనది మరేదో వుండాలి. అది మరలా పరాధీనం Dependent కాగూడదు. స్వతస్సిద్ధమైనది కావాలి ఆలాంటి దొక్క చైతన్యమే Pure Consciousness.
కాబట్టి చైతన్యమే అన్ని భావాలకూ ఆఖరి భావం. దానికిక కారణం లేదు గనుక అది దేనికీ కార్యం కాదు. కార్యం కాకపోతే మిగతా ఘటపటాది కార్యాల మాదిరి దానికి వ్యభిచారం Mutation లేదు. అవ్యభిచారి Immutable. కనుకనే అది సత్తు. పోతే మిగతా నామరూపాది ప్రపంచ మంతా ఆకాశం దాకా ఎక్కడి కక్కడే వ్యభిచరించే కార్యరూపాలే కాబట్టి మూలకారణమైన ఈ శుద్ధ చైతన్యం కన్నా భిన్నంగా లేవవి. కనుక ఈ చరాచర జగత్తంతా అసత్తేనని తీర్మానం.
Page 4