2
ఈ అనర్థం పోగొట్టుకొని పురుషార్థాన్ని చేపట్టాలంటే మరలా మన మీ అనాత్మ సంఘాతం నుంచి మన ఆత్మను వేరు చేసుకొని చూడాలి. చూస్తే అది మన స్వరూపమే కాబట్టి అదే నేననే అసలైన ఆత్మ జ్ఞానముదయిస్తుంది. ఉదయిస్తే అది అమృతమైన తత్త్వం కాబట్టి ఈ శరీరాదులు నశించినా నేను నశించకుండా చైతన్య రూపుడనై ఎప్పుడూ నిలిచి ఉంటాననే భావ మేర్పడు తుంది. అలాంటప్పుడిక భీష్ముడేమిటి - ద్రోణుడేమిటి-నీవేమిటి-నేనేమిటి. ఎవరున్నాపోయినా మనకు దిగులు లేదు. పోయేదక్కడ శరీరాదులే గాని ఆత్మ గాదు.
ఇదుగో ఇలాంటి ఆత్మా నాత్మా వివేచనకే సాంఖ్యమని పేరు. దీనివల్ల ఆత్మ జ్ఞాన మలవడితే అది పండ పండ గలవాడే పండితుడు. పండితుడైన వాడికి వీడు బ్రతికున్నాడు-వీడు మరణిస్తున్నాడనే భేద దృష్టిలేదు. ఆత్మ దృష్టితో చూస్తే ఎవ్వడూ నిజంగా మరణించటం లేదు. అందరూ అమృతులే. ఇక విషాదం దేనికి. అలాంటి పాండిత్యం లేని వాడికే విషాద మనేది. కాబట్టి సాంఖ్య బుద్ధి నలవరుచుకొని పండితుడవై మనవాళ్ళూ మనమూ ఎప్పటికైనా మరణిస్తా మేమోననే భయాన్ని వీడి నిర్భయంగా బ్రతకమని భగవానుడి ఉపదేశం.
1
నాసతో విద్యతే భావో- నాభావో విద్యతే సతః
ఉభయో రపి దృష్టాంత- స్వనయో స్తత్త్వ దర్శిభిః 2-16
ఆత్మా నాత్మా వివేక రూపమైన సాంఖ్య దృష్టి నలవరుచుకోటమే మరణాన్ని జయించటాని కుపాయమని చెప్పాము. అయితే అది ఆత్మ చైతన్య మొక్కటే నిత్యం-మిగతా అనాత్మ జగత్తంతా అనిత్యమేననే సూత్రం మీద ఆధారపడి ఉంది. మరి ప్రపంచ మనిత్యమని చెప్పటానికి గాని చైతన్యమే శాశ్వతమని చెప్పటానికి గాని ఏమిటి ప్రమాణమని ఇప్పుడు ప్రశ్న వస్తుంది.
దీనికి సమాధానమే ఈ శ్లోకం సత్తు అసత్తు అని లోకంలో పదార్థాలన్నీ రెండు వర్గాలు. సత్తంటే ఉన్నదనీ అసత్తంటే లేనిదనీ అర్థం. అందులో ఉన్నదేదో అది ఎప్పుడూ ఉంది. లేనిదెప్పుడూ లేదు. ఉన్నది లేకపోవటం గానీ లేని పదార్థ ముండుట గాని ఎన్నటికీ సంభవం కాదు.
Page 3