అంచేత రెండందాలా పదునైన దీకర్మ అనే కరవాలం. దుష్కృత మొక అంచయితే దానికి సుకృత మొక అంచు. ఒకదానితో అది గుణత్రయమనే విషవలయంలో పడద్రోసి అధః పాతాళాని కణగ ద్రొక్కగలదు. వేరొక దానితో ఆ వ్యూహాన్ని భేదించి పరమపద శిఖరాని కెక్కించనూగలదు. దీనినిబట్టి మన కర్ధమయిందేమిటి. ఏ కర్మ బంధకమని భయ పడుతున్నామో మనం-అదే మనపాలిటికి మోచకంకూడా. లోకంలో కూడా ఒక ఆభాణకముంది. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. ముల్లు ముల్లుతోనే తీయాలి. అలాగే కర్మను నిర్మూలించ టానికి కర్మే సాధనం. అందులో నిర్మూలించేది సుకృతమైతే నిర్మూలించబడేది దుష్కృతం.
కాబట్టి మనబుద్ది మనం చేసుకొన్న దుష్కృతాన్ని బట్టి మాయకులోబడి నడుస్తూన్నా - మనం చేసిన సుకృతాన్ని బట్టి మరలా దానిని భేదించి బయట పడవచ్చు. దీనికే పురుషకార మనిపేరు. పురుషుడు చేసే యత్నమే పురుష కారం. దైవమేగాని పురుష ప్రయత్నం లేదని వాదించరాదు అలాగయితే మానవుల మనస్తత్వాలలో చేష్టలలో ఇన్నిభేదాలు మనకు గోచరించరాదు. పరమామూఢుల దగ్గరనుంచీ మహాయోగులదాకా మానవ బుద్దులలో ఇంత వైవిధ్య మెక్కడినుండి వచ్చి చేరింది. అందరినీ కర్మ ఒకే విధంగా బాధిస్తే అందరూ పశుప్రాయులుగానే బ్రతుకుతుండాలి గదా. ఏదీ అలా జరగటం లేదే. కాబట్టి దైవాని కెంత బలముందో పురుష ప్రయత్నానికీ అంతే ఉంది. అది సుకృతకర్మ వల్లనే ప్రాప్తిస్తుంది మనకు.
ఈ సుకృతమనేది ఏదోకొంత ఉంటేగాని అసలు పారమార్థికమైన చింతే కలగదు మానవుడికి. మనకీ పారమార్థిక చింత ఉన్న మానవులు నాలుగు భూమి కలలో కనిపిస్తారు. మొదటివారు ఆర్తులు. వీరిది చాలా ప్రాధమికమైన దశ. ఏదో ఆపదవచ్చి నెత్తిన పడితే గాని వీరు కన్ను తెరచి చూడరు. అది గడచిందంటే మళ్ళీ యథాప్రకారమే. రెండవవారు అర్ధార్ధులు. ఏవో కోరికలు పెట్టుకొని అవి నెరవేరటాని కాశ్రయిస్తారు దేవుణ్ణి. దైవికంగా అవి నెరవేరా మంటే వారూ యథాప్రకారమే.
పోతే మూడవ వారున్నారు. వీరికి జిజ్ఞాసువులని పేరు. వీరి కార్తిలేదు. కోరికలు లేవు. వీరి కున్న ఆర్తీ కోరికా ఒక్కటే. భగవత్తత్త్వ మేమిటో అర్థం చేసుకోవాలని. ఇది కొంత మేలుజాతి. కాగా ఇంతకన్నా మేలురకం నాల్గవది
Page 45