#


Back

ప్రతిలోమ క్రియ. అది అనాత్మ జగత్తును లయం చేస్తుంది. పోతే అభ్యాసం అనులోమ క్రియ. అది ఆత్మమీదనే చూపునిలుపుతుంది. దానితో అంతా ఆత్మగానే అనుభవానికి వస్తుంది.

18
అసంయ తాత్మనా యోగో- దుష్ప్ర్పప ఇతి మే మతిః
వశ్యాత్మనా తు యతతా-శక్యోవాప్తుముపాయతః    6-36

అయితే ఈ అభ్యాస వైరాగ్యాలు మాత్రమను కొన్నంత సులభమా అని మరలా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే బంధుమిత్రాదులూ వస్తు వాహనాదులూ మనలను చాలా బలంగా పట్టుకొని బాధిస్తున్నాయి వీటన్నింటనీ నిరభి మానంగా చూడటమనేది అంత సుళువైన వ్యవహారం కాదు. అట్లాగే వాటిని కేవలం చైతన్యమనే దృష్టితో చూడటం కూడా చెప్పినంత సులభం కాదు.

చైతన్యమంటే జ్ఞానం. ప్రాపంచికమైన పదార్థాలన్నీ మనకు జ్ఞేయంగా Known కనిపిస్తాయేగాని జ్ఞానంగా Knowledge కాదు. జ్ఞానంగానయితే అసలు కనిపించనే కనిపించవు. మరి కండ్లు తెరచినా మూసినా వందలు వేలు మన చుట్టూ కనిపిస్తూనే ఉన్నాయి పదార్ధాలు. అనుక్షణమూ చూస్తూనే ఉన్నాము వాటి రూపాలు మనం. అలా చూడటానికి బాగా అలవాటు పడ్డాము కూడ. అవి లేకుంటే ఉండలేని పరిస్థితికి కూడా వచ్చింది మానవుడి మనస్సు. అలాంటప్పుడు ఎంత శాస్త్రీయంగా నిరూపణ చేసినా ఈ రూపాలనన్నింటినీ కేవలం చైతన్య రూపంగా దర్శించగలమా అని కూడా పెద్ద అనుమానం.

దీనికి సమాధానమే ఈ శ్లోకం. అసంయతాత్ముడి కైతేనే ముందు చెప్పిన క్లేశం. వశ్యాత్ముడికి కాదట, ఆత్మ అంటే ఇక్కడ మనస్సనే అర్థం. మానవుని మనస్సు కొక గొప్ప సామర్థ్యమున్నది. దానిపేరు సంయమం. సంయమమంటే ఒక పదార్థాన్ని సంశ్లేషాత్మకంగా Synthetic చూచే మనస్తత్వం. లోకంలో మనమే పదార్థాన్ని చూచినా రెండువిధాలుగా చూస్తుంటాము. సంశ్లేషంగా Synthetic నైనా చూస్తాము. విశ్లేషం Analytic నైనా చూస్తాము. మనం దారిలో నడుస్తూంటే దారి ప్రక్కన ఒక చెట్టు కనిపిస్తుంది. దాన్ని చెట్టుగానే చూచామంటే పచ్చగా ఎత్తుగా ఒక అఖండమయిన రూపాన్నే చూస్తుంది. మన కన్ను. అప్పుడది సంశ్లేష దృష్టి.

Page 29