మరలా జ్ఞాన దృష్టితో ఎప్పుడు దర్శించామో అప్పుడు సర్పమే రజ్జువుగా కనిపించినట్టు ప్రపంచ మంతా తన సహజమైన బ్రహ్మ స్వరూపంతోనే మనకు సాక్షాత్కరిస్తుంది. సహజంగా బ్రహ్మంతో కలిసే ఉన్నది గనుక ఇది క్రొత్తగా ఏర్పడే కలయిక కాదు.
అలాగే నామరూపాలనే విశేషాలన్నీ ఒకే ఒక చిదాకారంగా అనుభవానికి వస్తాయి కాబట్టి ఇందులో వైషమ్యమనే వాసనకూడా లేదు. ఒక్క మాటలో సమత్వ రూపమైన యోగమంటే ఇదే.
ఇలాంటి యోగంతో నిరంతరమూ కాలం గడిపే బ్రహ్మవేత్త వ్యవహారమే వేరు. మామూలు లోకుల దైనందిన జీవితాలకీ అలాంటి వ్యక్తి జీవితానికీ హస్తిమశ కాంతర ముంటుంది. మామూలు వాడేది రాత్రి అనుకొని చూస్తాడో జ్ఞాని కది కేవలం పగలు. మరి వాడేది పగలుగా భావిస్తాడో ఈ జ్ఞానికది రాత్రి అట.
ఏమిటీ మాటలకర్థం. అందరూ లోకంలోనే బ్రతుకుతున్నప్పు డొకడికి రాత్రి అయి మరొకడికి పగలెలా అవుతుంది. అలాగే ఒకడికి పగలయి ఇంకొకడికి అదే రాత్రి ఎలా అవుతుంది. అనుభవానికే విరుద్ధం గదా ఇది. అయితే ఎందుకు చెప్పినట్టీమాట. పగలు - రాత్రి అనే శబ్దాల కిక్కడ అహో రాత్రాలని వాచ్యార్దం కాకుండా జ్ఞానమూ - అజ్ఞానమూనని లాక్షణికమైన Meta phonical అర్థం చెప్పుకొంటే సరిపోతుందంటారు కొందరు. అలా చెప్పుకొన్నా చెల్లదు. ఎందు కంటే ఒకరికి పగలైనది ఒకరికి రాత్రి అన్నప్పుడు రాత్రి పగలనే రెండు భావాలూ ఇద్దరికీ చెబుతున్నాడు భగవానుడు. అప్పటికి ఇద్దరికీ జ్ఞానాజ్ఞానాలు వర్తించవలసి ఉంటుంది. ఇక లౌకికుడి కంటే జ్ఞానికి విశేషమేమి చెప్పినట్టు.
కాబట్టి అహో రాత్రాలనే మాటలకిక్కడ చెప్పవలసిన అర్ధం జ్ఞానమూ అజ్ఞానమూ -నని గాదు. రాత్రి అంటే పరమాత్మ తత్త్వమన్నారు భగవత్పాదులు. రాత్రిలాగా అంతా మన కగమ్య గోచరం కాబట్టి పరమాత్మ రాత్రి లాంటిది. ఇలా లోకులందరికీ రాత్రి మాదిరి ఏ మాత్రమూ గోచరం కాకపోయినా మహా యోగి కది పట్ట పగలు లాగా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తుంటుంది. ఇది ఎలాంటిదంటే ఒక గ్రుడ్లగూబే ఉంది. దానికి పగటివేళ కండ్లు కనిపించవు. మనకంతా ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కటీ కనిపిస్తున్నప్పుడే అది ఏ ఒక్కటీ చూడలేని దుర్దశలో చిక్కుపడి ఉంటుంది. మనకు పగలైతే దాని కదే రాత్రి.
Page 24