#


Back

11
యోగస్థః కురు కర్మాణి - సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్య సిద్ధ్యాస్సమో భూత్వా - సమత్వం యోగ ఉచ్యతే   2-48

బ్రహ్మస్వరూపమైన మోక్ష సుఖాన్ని చూరగొనాలంటే నిరంతరమూ మన మనస్సు సామ్యావస్థలోనే ఉండాలని చెప్పాము. ఇదిగో ఈ సామ్యమే నిజమైన యోగం. యోగమంటే ఉపాయమని అర్థం. ఒక ఫలితాన్ని సాధించే దాని కుపాయ Means మని పేరు. ఉపేయ End మిక్కడ మోక్షం. అది సామ్య స్వరూపం. దాన్ని సాధించే ఉపాయం కూడా సామ్యమే. సమదర్శనంతోనే సమత్వం సాధించాలి. కనుకనే ఆదీ అంతమూ కూడా సమత్వమేనని చెప్పటం. ఉపాయ రూపంగా ఆది అయితే ఉపేయ రూపంగా అంతం. దీనిని బట్టి బ్రహ్మమనేది ఎప్పుడూ అధ్వీతీయమనే మాట తేటపడుతున్నది. సమత్వమే గదా బ్రహ్మమంటే.

సమత్వమే యోగమని కూడా చెప్పాము. అది ఒక్కటి సాధిస్తే చాలు. మిగతా యోగాలన్నీ అందులోనే కలిసివస్తాయి. అయితే దానికి సంగం మాత్రం పనికిరాదు. సంగమంటే నామరూపాది విశేష దృష్టి. ఆ దృష్టి ఉన్నంత వరకూ అది వైషమ్యానికి దారి తీస్తుంది. ఎందుకంటే వైషమ్య మనేది సామ్యానికి విరుద్ధం ఎలాగని ప్రశ్నించవచ్చు. ఒక ఇల్లు కట్టుకొని ఇది నాది అని కాంక్ష పెట్టుకొన్నాను. గ్రామంలో ఇంకా ఎన్నో ఇండ్లున్నాయి. కాని దానిని మాత్రమే నాదని అభిమానిస్తున్నాను. అంచేత అది విశేష దృష్టి అయింది. అందులో తగులుకొనే సరికి ఆ ఇంటిమీదనే లోకం నాకు. అలాంటి అభిమానం దాని ప్రక్కనే ఉన్న మరొక ఇంటిమీది ఉండబోదు. ఇక సమత్వమేముంది. అంతా వైషమ్యమే. అలాకాక అన్నీ ఇండ్లే గదా. ఇటుకా సున్నంతో కట్టినవే గదా అని చూస్తే ఏదీ లేదు. వైషమ్య మెగిరిపోతుంది.

అంతేకాదు. ఇది మన దృష్టిలోనే ఉందిగాని ఆ వస్తువులో లేదని చెప్పటాని కెంతో దూరం పోనక్కరలేదు. కట్టకముందు నాది కాదది. మట్టిలో కలిసిపోతే నాది కాదు. డబ్బుకు కసాలాపడి వేరొకడికి విక్రయిస్తే నాది కాదు. అంతెందుకు ఈ క్షణంలో హఠాత్తుగా నేను కన్ను మూస్తే నాకు సంబంధం లేదు. ఇలా భావన చేస్తూ పోతే చాలు. వెంటనే వైషమ్య దృష్టిపోయి సామ్య దృష్టి మనసులో చోటు చేసుకోవటం ఖాయం. ఇదే యోగమంటే. ఇలాంటి యోగం మానసికంగా ఎప్పుడు సాధించామో జీవితంలో కూడా అది తొంగి చూస్తుంది. జీవితమంటే ఒక మనస్సే కాదు. మనోవాక్కాయములు మూడూ కలిసి జీవితం. అందులో మిగతా రెండింటికీ మనసు మూలం. మనసు ఆలోచించిందే మాటలోకి వస్తుంది. కర్మ అంటే పని గదా.

Page 19