#


Back

సవిశేషంగా చూస్తే బ్రహ్మమే ప్రపంచంగా భాసిస్తుంది. అప్పుడది సదోషం. నిర్వి శేషంగా చూస్తే మరలా ఈ ప్రపంచమే బ్రహ్మంగా అనుభవానికి వస్తుంది. అప్పుడది నిర్దోషం.

కాబట్టి సాధకులుగా మనం చేయవలసిన పని ఏమిటి. సవిశేష దృష్టిని వదులుకోవాలి. నిర్విశేషమైన సామాన్య దృష్టినే అంతకంతకు అభ్యసిస్తూ పోవాలి. అలా అభ్యసిస్తూ పోతే క్రమంగా ఈ సంసారానికి దూరమవుతూ ఆ బ్రహ్మ తత్త్వానికి దగ్గర పడతాము. అది సమగ్రమయ్యే నాటికి సమగ్రమైన బ్రహ్మానుభవాన్నే అందుకో గలుగుతాము. ఆ బ్రహ్మమే నేననే భావంతో ఉండి పోతాము. అలా ఉండటమే మోక్షం. అదే అమృతత్వం.

ఎటువచ్చి ఆ సమదర్శనాన్ని సాధించటంలోనే ఉన్నది ఉన్నదంతా. అది అన్నింటికీ ఆది. అన్నిటికీ అంతం. కొంత నేర్పున్న వాడికది సాధించటం కూడా ఏమంత దుష్కరం కాదు. మామూలుగా లోకంలో మనమే వస్తువును గాని వ్యక్తిని గాని దృష్టించి చూడము. చూచీ చూడనట్లు వెళ్ళిపోతుంటాము. అలాకాక కొంచెం సేవలాగే దృష్టి పెట్టి చూడడం నేర్చుకోవాలి. చూస్తే అందులో రూప గుణాదులేవీ మన దృష్టికి అంతగా రావు. అంతకంత కాపదార్థం అస్పష్టంగా సూక్ష్మంగా మారిపోతుంది. సూక్ష్మమయ్యేకొద్దీ ఆకాశంలాగా విశాలమై ఒక ఖాళీ మాదిరయిపోతుంది. ఎంతెంత ఖాళీ అవుతుందో అంతంత మన చైతన్య మా ఖాళీని భర్తీ చేస్తుంది. అప్పుడంతా మన స్వరూపమేననే ప్రత్యయ Notion మొకటి తప్పకుండా ఏర్పడుతుంది.

ఈ విధమైన నిర్వికల్ప దృష్టితో చూచేవాడికి సృష్టిలో ఎన్ని వికల్పాలున్నా అడ్డురావు. చరాచర పదార్ధాలేవి ఎప్పుడు తారసిల్లినా అవన్నీ సామాన్య రూప మైన Universal తన స్వరూపంగానే అనుభవానికి వస్తాయి. అప్పుడీ సృష్టిలో వైవిధ్యం గాదు - ఏకత్వమే దర్శనమిస్తుంది. ఆ ఏకత్వం కూడా నాకు భిన్నంగా కాదు. నేనుగానే నాకు సాక్షాత్కరిస్తుంది. ఇది సాధనలో కొంత ప్రవేశమున్న వాళ్ళకు గాని అవగాహనకు రాదు.

Page 18