జీవితంలోనే అనుకోలేని వాళ్ళం రేపు మరణంలో మాత్రమెలా భావించగలమని ప్రశ్న వస్తుంది.
విచారణ లేనంత వరకే ఇలాంటి ప్రశ్న. మొదటనే చెప్పాము విచారణా శీలుడికి భ్రాంతి లేదని, కాని ఆ విచారణ అనేది నూటికి కోటికి ఒక్కడికి గాని ఉండదు. అందులోనూ బాగా పరిణతి చెందినవాడే ఒక్కడో గాని దొరకడు. మిగతా తొంభై తొమ్మిది మంది నిక్షేపరాయళ్ళే. అలాంటి పామర జనుల అనుభవ మేదో దాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్నావు నీవు. అది సార్వ జనీనమే అయినా యథార్థమైనది కాదా అనుభవం. ఎందుచేత. నీవు శీతోష్ఠాలనీ - సుఖ దుఃఖాలనీ- ఏ ద్వంద్వాల అనుభవం చెబుతున్నావో అది ఆయా ఇంద్రియాల తాలూకు అనుభవమే కాని ఆత్మది కాదు. నిప్పులో చేయి పెడితే మన చర్మానికే సోకుతున్నదా వేడి. కాలినా - మాడినా - మసి అయినా చర్మమే. చర్మం వరకే ఆ మార్పు. దాని ననుభవానికి తెచ్చుకొనే చైతన్యంలో లేదా మార్పు. అది అనుభవ రూపంగానే నిలిచిపోతున్నది.
అంతేకాదు. ఈ ద్వంద్వాలు కూడా నిత్యం కావు. అనిత్యాలవి. అనిత్యాలని ఎలా చెప్పగలవు. ఆగమా పాయులు కావటం వల్ల. ఆగమ మంటే రావటం. అపాయమంటే పోవటం. రాకపోకలు చేస్తుంటాయే గాని నిలకడగా ఎప్పుడూ ఉండవని చూడండి. నీరు మరిగి పోతుంటుంది. చేయి పెట్టటానికి భయపడ తాము మనం. అయితే అది వట్టి భయమే. నీటి కది స్వభావం కాదు. స్వభావ మయితే కొంతసేపటికి మళ్ళీ అది చల్లబడదు. అందుచేత దానిలో ఉండే ఉష్ణ గుణ మనిత్యం. దాన్ని అనుభవించే మన చైతన్యమే నిత్యం. అనిత్యాన్ని చూచి నిత్యం భయపడవలసిన అగత్య మేమిటి. అదే మాయ. ఈ మాయ వల్లనే శరీరేంద్రి యాదులను నేనని భ్రమించాము. ఆ భ్రాంతితో ఇంద్రియ సంసర్గం వల్ల ఏర్పడే కష్టసుఖాలు నావే నని అనుభవిస్తున్నాము. అయితే ఎంత అనుభ వించినా భ్రాంతి మూలకమే కాబట్టి ఇది వాస్తవం కాదు.
పోతే వాస్తవికమైన అనుభవ మేమిటి. అదే విచారణా దక్షుడైన వాడి కుందని చెప్పే అనుభవం. వాడు తన స్వరూపాన్ని నిత్యమూ వేరు చేసుకొనే చూస్తుంటాడు. దాని బలంతో ఇంద్రియాలకు కలిగే స్పర్శలు తనవిగా ఎప్పుడూ అభిమానించడు. అభిమానించకపోతే ఇక వాటివల్ల మనకు బాధ లేదు. లోకంలో కూడా చూడండి.
Page 15