#


Back

అయితే వచ్చిన ఇబ్బంది ఏమంటే మరణంలో ఈ శరీరం కదలకుండా పడిపోతుంది. వెంటనే దాన్ని బంధువులు దహనంచేసి మరలా మనకు కనపడ కుండా చేస్తున్నారు. అందువల్ల మసకనుమానం-మరొక శరీరం ధరిస్తామా లేదా అని. ఈ అనుమానం ప్రక్కన నిలబడి చూచే వాళ్ళకే. వాడికి కాదు. వాడి అనుభవమేమిటో బ్రతికిన వాళ్ళెవరికి అంతుపట్టడు. అప్పట్లో వాడికి కలిగే అనుభవాలు రెండే. శరీరమే నేనని భ్రమపడ్డాడా దానితోపాటు తానూ పోవలసి వస్తుంది. అలాకాక వేరు చేసుకొని చూడగలిగాడా అది నశిస్తున్నా తాను నశించటం లేదనే ధైర్యంతో నిలిచి ఉంటాడు. మరి అలా నిలవాలంటే సామాన్యమైన విషయం కాదు. ధీరుడయి వుండాలి వాడు. ద్మీ అంటే బుద్ధి. వివేచనా శక్తి అని అర్ధం అది ఉన్నవాడే ధీరుడు. అలాంటి వాడు తప్పకుండా దేహం కంటే ఆత్మను వేరుగా చూడ గలుగుతాడు. చూడ గలిగితే ఇక మోహ వాగురలో వచే ప్రసక్తిలేదు. శరీరాదులే నేనని అభిమానించటమే Identification మోహం. ఈ మోహమే ఆవిద్య Ignorance of the fact. ఇదే మన మరణానికి కారణమవుతున్నది. అది లేకుంటే మరణమే లేదు మనకు. అమృత స్వరూపులమే.

8
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ - శీతోష్ణ సుఖ దుఃఖదాః
ఆగమాపాయినో నిత్యా-స్తాంస్తితి క్షస్వ భారత  2-14

శరీరానికీ మన చైతన్యానికీ సాజాత్యమే లేదని ప్రతిపాదించాము. కాని అది వట్టి సిద్దాంతమే నేమో. ఎందుకంటే అసుభవాన్ని బట్టిచూస్తే దానికి విరుద్దంగా కనిపిస్తున్నది. చలీ వేడీ- సుఖమూ - దుఃఖమూ ఇలాంటి ద్వంద్వాలకు మన శరీర మెప్పుడూ గురి అవుతూ ఉంటుంది. అలా గురి అవుతూ ఉందంటే ఆ అనుభవం మనది కాకపోదు. అసలు అనుభవ మంటేనే మనది. మనదంటే మన చైతన్యానిది. అచేతనమైన శరీరానిదెలా అవుతుంది. అనుభవం. చైతన్యంతో సంబంధం లేకుండా జడమైన దేహ మెప్పుడూ ఏది గాని అనుభవించలేదు. అలాగయితే నిప్పులో చేయి పెట్టి చేయి మాత్రమే కాలుతూంది గాని నేను కాదని అనుకోగలగాలి. ఏదీ అలా అనుకో గలుగుతున్నాడా ఎవడైనా.

Page 14