#


Back

భక్తిలో సేవ్య సేవక భావముంటుంది. ఉపాస్య ఉపాసక భావముంటుంది. ఇందులో అలాంటి విభాగముండదు. అనన్యమిది. ఇది జ్ఞానాని కనంతర భూమిక. సామాన్యమైన భక్తిజ్ఞానానికి పూర్వభూమిక. జ్ఞానమంటే పరమార్థాన్ని గూర్చి చేసే విచారణ. అది భక్తిశ్రద్ధలుంటేగాని ఏర్పడదు. ఏర్పడిన తరువాత ఆజ్ఞాన మపరోక్షమైన అనుభూతినివ్వాలి. ఇది ఆ కలిగిన జ్ఞానంలో నిష్ట ఏర్ప డితే గాని రాదు. ఇదుగో ఈ జ్ఞానినిష్టనే అనన్యభక్తి అని -పరాభక్తి అని-వ్యవ హరిస్తారు. ఇది కేవల జ్ఞానంకన్నా శ్రేష్టమైనది. ఆత్మ చైతన్యం తప్ప మరిదేనికీ ప్రవేశం లేదీభూమికలో. అంతా ఆత్మే. చూచేదీ చూడబడేదీ-చూపూ అంతా అదే. అంతా నేనే. “పర్యుపాసతే" అన్నమాటకిదే అర్థం. పరితః- ఉప-అసనా- అంటే అంతటా తన స్వరూపాన్నే చూస్తూ దాన్నే పట్టుగొని కూచోటం.

అయితే అలా కూచోమన్నారు బాగానే ఉంది. కూచోగలమా అనే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే దీనికి రెండు ప్రతి బంధకాలు కనిపిస్తున్నాయి. మనం చేయ వలసిన సాధన ఎప్పుడూ మనసుతోనే గాని మరిదేనితోనూ గాదు. ఈ మనసుకు ఒక రోగమున్నది. అది ఏదో ఒక ఆకారాన్నే చూడాలి. ఆ ఆకారం కూడా ఎప్పటికప్పుడు మారుతుండాలి. అలాంటప్పుడోకే ఒక నిరాకారమైన తత్త్వాన్ని ఏకధారగా చూడటమంటే అది ఎలా సంభవం. అలాగే ఒకవేళ చచ్చి సున్నమై అదేలోకంగా కూచున్నామే అనుకోండి. లోకంలో మన దైనందిన వ్యవహారం జరిగేది ఎలాగా. దానికి మనమిక స్వస్తి చెప్పక తప్పదు గదా. చెబితే మనకొక శరీరమంటూ ఉందిగదా. ఆకలిదప్పులున్నాయి గదా. వాటి సంగతేమిటి- ఎవరు చూస్తారు. కనుక అది అసంభవమే.

వీటిరెండింటికీ సమాధానమే ఉత్తరార్థం. అలా ప్రతిక్షణం ఆత్మ చింతనతో కాలంగడిపే సాధకుడికి పనులు ఎలా జరుగుతాయని గదా ప్రశ్న. అవి జరప టానికి ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వర ప్రకృతేగదా ఇదంతా. ఇందులోనేగదా మనకేదైనా ఒకకార్యం జరగవలసింది. దాని కధ్యక్షుడైన ఈశ్వరుడే ప్రేరణ కలిగిస్తాడు. అది మన ప్రారబ్దాన్ని బట్టి ఎక్కడో లోకంలో ఎవరికో బుద్ధి పుట్టించి ఏదో ఒక ఉపకారం మనకు చేయిస్తుంది. ప్రారబ్ధాన్ని బట్టే ఏదైనా మనకు జరుగుతుంది ఇక మనకు భయమేముంది. ఊరకున్నా జరుగుతుంది. లేక పోయినా జరుగుతుంది. మన దగ్గరికి దానిపాటికది దొర్లుకొంలూ వస్తుంది. ఇదే యోగం. పోతే ఆ వచ్చింది మన ప్రారబ్దాన్ని బట్టి ఎక్కడికి పోదు. ఎంత కాల ముండాలో అంత కాలమూ ఉండి తీరుతుంది. ఇదే క్షేమం.

Page 119