#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

7. జ్ఞాన విజ్ఞాన యోగం

పరమాత్మ, ఈశ్వరుడు, బ్రహ్మమని వర్ణించటమే గాని వాటి స్వరూపమేమిటో పూర్తిగా చెప్ప లేదింత వరకూ. ఇప్పుడా స్వరూపాన్ని బయట పెడుతున్నదీ అధ్యాయం. స్వరూపం విభూతీ రెండున్నాయి పరమాత్మకు. అందులో స్వరూపం నిర్గుణం. విభూతి సగుణం. గుణాలంటే సత్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలు. ఈ ప్రకృతి ఆయన శక్తే - సగుణంగా బయటపెడితే ఆయన ఈశ్వరుడు. అప్పుడీ చరాచర ప్రపంచమంతా ఆయన విభూతి లేదా విస్తారం. అలా గాక నిర్గుణంగానే నిలిచిపోతే అది కేవలం చైతన్యస్వరూపం. అదే బ్రహ్మం. పరమాత్మ. ఇప్పుడీ రెండూ కలిపి పట్టుకొంటేనే పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం.

ఇందులో పృధివి మొదలు ఆకాశం వరకూ కనిపించే జగత్తొక విభూతి అయితే, మనో బుద్ధ్యహంకారాలుగా కనిపించే జీవుడి ఉపాధి ఒక విభాతి అయితే - దీన్ని ధరించిన జీవ చైతన్యం మరొక విభూతి. అన్నీ కలిసి తొమ్మిదీ ఇవి. ఇవే శాక్తేయుల నవావరణలు. ఆత్మ చైతన్యాన్ని ఆవరిస్తాయివి. ఇదంతా తన శక్తేనను కొంటే ఈశ్వరుడు. దాని కధీనమై పోతే జీవుడు.

ఇంతకూ ఈశ్వరుడూ ఆయన ప్రకృతి రెండూ ఒకే ఒక తత్త్వం. దాని పరిణమమే ఈ చరాచర సృష్టి అంతా. కనుక రసోహమప్సు - సర్వత్రా ఉన్నదా ఈశ్వరుడే. మనలో కలిగే సాత్త్విక రాజస తామస భావాలు కూడా అదే. కాని ప్రకృతి గుణాల వలలో చిక్కి ఆ మేరకే ఆగిపోయిన ఈ జీవుడికా స్వరూప మంతు పట్టడం లేదు. ఆర్తుల దగ్గరనుంచీ అందరూ సాధకులే. కాని ఎవడో ఒకడుంటాడు జ్ఞాని. వాడా ఈశ్వరుణ్ణి తన స్వరూపంగానే దర్శించగలడు. ఎన్నో జన్మలు గడిస్తే గాని ఆ జ్ఞానం కలగదు. అప్పుడే తాను, తాను చూచేది అంతా పరమాత్మే అనే అనుభవ మేర్పడుతుంది.

కాని ఆయా కోరికలు బలంగా ఉండి ఆయా దేవతలను సేవిస్తుంటారు మానవులు. దానికి కారణం ద్వంద్వ మోహం. అది పుట్టుకతోనే ఏర్పడింది మనకు. ప్రకృతి గుణాలను దాటి పోనివ్వదది. గుణాధీనుడైన ఈ జీవుడికిక గుణాతీతమైన తత్త్వమెలా బోధ పడుతుంది. పడితే గాని సగుణాన్ని నిర్గుణం తాలూకు విభూతిగా దర్శించ లేడు. అలా దర్శిస్తే జ్ఞానమే గాక విజ్ఞానం కూడా అవుతుంది.