#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

5. కర్మ సన్న్యాస యోగం

ఇక్కడ ఒక సందేహం. కర్మలు సన్న్యసించటమా లేక ఆచరించటమా - దేనివల్ల లభిస్తుంది శాంతి అని చాలామంది మల్లగుల్లాలు పడుతుంటారు. దానికి జవాబేమంటే జ్ఞానం లేకుండా తొందరపడి సన్న్యసించినా ప్రయోజనం లేదు. జ్ఞానముంటే సన్యసించ నక్కరా లేదు. అసలు జ్ఞానముదయించాలంటే కర్మ కావాలి మనకు. అయితే అది గుడ్డిగా అనుష్ఠించటం కాదు. ఈశ్వరార్పణ బుధ్ధితో ఆచరించటం. దాన్నే గీత కర్మయోగమని పేర్కొంటున్నది. కర్మయోగ బలం లేకుండా సన్న్యాసం సాధ్యం కాదు. సన్న్యాస మంటే మరలా ఏదో గాదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మ స్వరూపమే ఈ మనోవాక్కాయాలతో చేసే పనులన్నీ, కనుక దాని మీదనే కర్మలన్నింటినీ ఆరోపించాలి. తన మీద గాదు. వ్యష్టి బుద్ధి సమష్టి బుద్ధిగా మారాలి. ఇదే సన్న్యాసమనే మాట కర్ధం.

నైవకింత్కరోమీతి. అప్పుడే పని చేస్తున్నా - అది శాస్త్రీయమే గాదు లౌకకమే గాదు. నేనుగా ఏమీ చేయటం లేదు. ప్రకృతి గుణాలే దాని గుణాలతో సాంగత్యం పెట్టుకుంటున్నదని సాక్షిగా చూడటం అలవడుతుంది. మనస్సుతోనే వదులకోవా లేదైనా. శరీరంతో కాదు. అసలు ఏ జీవికీ కర్మలని కర్తృత్వమని సృష్టించ లేదీశ్వరుడు. స్వభావస్తు ప్రవర్తతే. త్రిగుణాత్మకమైన మాయాశక్తే వాటిని తెచ్చి పెట్టింది. సహజం కాదిది. ఆగంతుకం. కనుక సహజమైన మన ఆత్మ స్వరూపం మనమర్ధం చేసుకొంటే చాలు. ఏ గొడవా లేదు. రాగద్వేషాలు సుఖదుఃఖాలూ - ద్వంద్వాలన్నీ ఎగిరిపోతాయి. బ్రతికుండగానే సృష్టి రహస్యం భేదింగలడు మానవుడు. అదేదో గాదు. ఎప్పుడూ సామ్యావస్ధలో Equi poise మనస్సు నిలిచి ఉండటమే ఏకైకమైన సాధనం. ఒక సద్బ్రాహ్మణుడి దగ్గరి నుంచీ కసాయివాడి వరకూ అందరిలో ఉన్నదొకే ఒక బ్రహ్మతత్త్వం గదా అనేది సమదృష్టికి పరాకాష్ఠ.