#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

15. పురుషోత్తమాధ్యాయయోగం

ఈ సాధన మార్గమే పురుషోత్తమాధ్యాయం కూడా ఇంకా చమత్కారంగా ఒక అశ్వత్థ వృక్షం మీద నెపం పెట్టి వర్ణిస్తున్నది. అశ్వత్థ మంటే రావి చెట్టు. చలదళ మని పేరు దానికి - ఎప్పుడూ చలించే స్వభావమా చెట్టుకు. అలాగే ఈ సంసార వృక్షం కూడా చలనాత్మకమే. ఏదీ నిలకడగా ఉండదిక్కడ. క్షరమిది. నశించేదని అర్ధం. ఇది గాక అక్షర మొకటున్నది. అది దీనికి మూలమైన మాయా శక్తి. అది పరమాత్మ నాశ్రయించిన ఆయన శక్తి కాబట్టి క్షరం కాదు అక్షరం. పోతే ఈ క్షరాక్షరాలు రెంటికీ విలక్షణమైన దొక్కటే ఉంది తత్త్వం. అది ఆ పరమాత్మ చైతన్యమే. ఇవి రెండూ పురుషులైతే అది పురుషోత్తమ.

పురుషుడైనా ఇవి ఆయనలాగా పూర్ణ స్వరూపం కావు. అపూర్ణమే. పూర్ణం లాగా భాసిస్తున్నాయి. సాపేక్షమివి Relative నిరపేక్షం Absolute కావు. నిరపేక్షమనేది ఒక్కటే. కనుక వీటి రెండింటినీ క్రమంగా దాటి పోయి దాన్ని వాటేసుకోవాలి మానవుడెప్పటికైనా. అదే పురుషోత్తమ ప్రాప్తి. దానికి సమ్మోహ Illusion మడ్డు పడుతుంటుంది. జ్ఞాన చక్షుస్సుతో ఆ చీకటిని చీల్చుకొని ముందుకు సాగిపోవాలి.

అలా పోవాలంటే ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవిక సృష్టి అనే మూడింటిలో ఒకే ఒక ఆత్మజ్యోతిని దర్శిస్తూ ఉండాలి. మమైవాంశో జీవలోకే ఆ పరమాత్మ అంశే వాస్తవానికీ జీవాత్మ కనుక ఈ శరీరాద్యుపాధుల మేరకే ఉన్నా ననుకోక సర్వత్ర సచ్చిద్రూపంగా నేనే వ్యాపించి ఉన్నానని తన వ్యాప్తిని తాను గుర్తు చేసుకోవాలి. అలాటి దివ్య దృష్టి అలవడితే, సృష్టి అంతా తానే అయినట్టు తన స్వరూపంగానే గుర్తించి తరించగలడు.