#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

11. విశ్వరూపాధ్యాయం

అయితే ఇదంతా భగవద్విభూతి అని ఎంత చెప్పినా గ్రహించలేడు మానవుడు. దానికి కారణాలు రెండే. ఒకటి - ఇదంతా ప్రపంచమని మామూలు దృష్టితో చూస్తున్నామే గాని అంత కన్నా విశేషంగా చూడలేక పోతున్నాము. రెండు - ఈ భూమండలంలో ఎక్కడో ఒక చోట, ఒక కాలంలో, ఏ కొన్నింటితోనో సంబంధం పెట్టుకొని చాలా పరిమితమైన దృష్టితోనే జీవిస్తున్నాము గాని, దేశకాల వస్తువులన్నీ కలుపుకొని అఖండమైన దృష్టితో చూడటం లేదు మనం. అందువల్ల అఖండమైన విశ్వమెక్కడో ఉంది కాని మనకు కనపడటం లేదు. ఎక్కడైనా ఒక మహానుభావుడొక గారడీ చూపినట్టు దాన్ని మనకు చూపితే బాగుండననే గొప్ప కుతూహలం ప్రతివాడికీ.

కాని వాస్తవంలో మనం చూస్తున్నదంతా విశ్వరూపమే, విభూతే. విభువు తాలూకుదే విభూతి. విశ్వేశ్వరుడిదే ఈ విశ్వరూపమనే అవగాహన లేదు మానవుడికి. విశ్వమనేది విశ్వేశ్వరుడి రూపం. విభూతి అనేది విభువు యొక్క విస్తారం. ఆ విభువనండి. విశ్వేశ్వరుడనండి. అది మూలపదార్ధం Substance Base దాని విశేషమే దాని ప్రదర్శనమే ఈ విశ్వం. దీని కధిష్ఠానమనండి - ఆధారమనండి, ఆ విశ్వేశ్వరుడే. అంటే పరమాత్మ స్వరూపమే చరాచర ప్రపంచాని కాధారం. దాని రూపమే ఇది - అదే ఇన్ని రూపాలలో భాసిస్తున్నది. దానికే విశ్వరూపమని పేరు పెట్టారు. అయితే ఎలాగూ మనం నిత్యమూ చూస్తున్నాము గదా ఇక క్రొత్తగా ఎవడో చూపితే చూడాలని దేని కుబలాటం. చెప్పాము గదా. అండ పిండబ్రహ్మాండాలన్నీ ఒక్కసారిగా ఆకళించుకోవాలనే ఆశ వదలక నని.

అయితే అది సాధ్యమా. సాధ్యమే. ఎప్పుడూ? దానివరకే గాక దాని కధిష్ఠానమైన Base విశ్వేశ్వర స్వరూపాన్ని గుర్తించగలిగితే. అలా గుర్తించాలంటే దేశకాల వస్తువుల పరిధి ఎంత ఉందో అంతా మనసుకు రావాలి. అదే దివ్య దృష్టి. అదే అర్జునుడికి కృష్ణుడు ప్రసాదించాడనే మాట. ఇచ్చాడు గదా అర్జునుడెందుకు భయపడ్డాడు? దృష్టి స్వప్రయత్నంతో వచ్చింది కాదు. తాత్కాలికంగా పరమాత్మ తనకిచ్చింది. అలాగైతే ప్రతి ఒక్కరికీ ఇవ్వగలడాయన. కాని ఎలా వస్తుందో అలాగే పోతుంది. చూపొకరిచ్చినా చూచే స్తోమత ఒకటుండాలి గదా మానవుడికి. అది స్వయంగా తాను ప్రపంచానికి మూలమైన పరమాత్మ తత్త్వాన్ని చూచినపుడు గాని ఏర్పడదు. వేషధారిని చూడకుండా అతని వేషాలను చూస్తే భయపడి చస్తాడు. అలా చూచాడు అర్జునుడు. భూన భోంతరాలు వ్యాపించిన, భూత భవిష్యత్తులు వ్యాపించిన - దేవదానవ మానవ పిపీలికాది బ్రహ్మ పదార్ధలన్నీ వ్యాపించిన రూపాన్ని ఒక్కసారి చూడగానే అలవాటు లేక హడలి పోతాడు. దానికి కారణం దేశకాల వస్తు రూపాలనే చూచాడు గాని - అవన్నీ దేనికి చెందినవో ఆ మూలతత్త్వాన్ని చూడలేదు. అర్జునుడనేది ఒక నెపం. మనమే అర్జునులం. మనమూ అఖండమైన తత్త్వాన్ని చూడకుండా, అది ప్రదర్శించే ఈ విశ్వరూపాన్ని ఏ కొంచమో చూచి హడలిపోతున్నాము. ఇక అంతా చూస్తే ఎంత భయంకరమో ఎంత బెంబేలు పడతామో.