#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

భగవద్గీత

10. విభూతియోగం

ఇంకా ఒక మాట చెబుతున్నాను వినమంటాడు భగవానుడు. నా స్వరూపం దేవతలకు ఋషులకే అంతుపట్టటం లేదు. కారణం. అందరీకీ ముందే ఉన్నాను నేను. నాకు జన్మ లేదు, మరణం లేదు. ఇలా ఎవరైతే ఆత్మ స్వరూపాన్ని గుర్తిస్తారో వారూ అదే అయిపోగలరు. యద్భావ స్తద్భవతి. మన భావనను బట్టే ఫలితం. అది సగుణంగా కొంత కాలం నన్ను భజిస్తే వారికి నిర్గుణ జ్ఞానం నేనే కలుగజేస్తా నంటాడు పరమాత్మ. మరి ఆ సగుణమైన విభూతి ఎలాంటిదో ఏయే భావాలలో దర్శించాలని అడిగితే సమాధానమిస్తున్నాడు. అందులో మొదట నిర్గుణమైన స్వరూపాన్ని సంగ్రహంగా చెప్పి తరువాత తన విభూతినంతా వర్ణిస్తూపోతాడు.

అహమాత్మా గుడాకేశ - ఆత్మ స్వరూపమే అది. ప్రతిచోటా ఉన్నదనే స్ఫురణ ఏదుందో అదే ఆత్మ. అదే ప్రతి పదార్ధానికి ఆది మధ్యం అంతం. అది తప్పించి ఏ నామమూ లేదు. రూపమూ లేదు. పోతే ఇక ఈ నామరూపాలేమిటంటారా. ఇవన్నీ దాని విభూతి విస్తారం. ఇదే చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాడు. ఆదిత్యులలో విష్ణువునని, రుద్రులలో శంకరుడునని, వృక్షాలలో అశ్వత్ధమని, అశ్వాలలో ఉచ్చైఃశ్రవమని ఇలాగా.

అయితే ఒక్కొక్క జాతిలో ఒక్కటేనా విభూతి అంటే. మిగతాది కాదా. ఎందుకు కాదు. అంతా అదే. కాని ఏషఉద్దేశతః ప్రోక్తః కేవల ముదాహరణ కోసం చెప్పానిలాగా. మరి వాస్తవమేమిటో తెలుసా. నత దస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరా చరం. నేను కాని పదార్ధమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. నీవు నన్ను ఏయే భావాలలో ధ్యానించాలని అడిగావు కాబట్టి ప్రత్యేకించి అలా చెప్పవలసి వచ్చిందని మరలా సంజాయషీ ఇస్తాడాయన అర్జునుడికి.