#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఆత్మను చంపేస్తాడని గాదు. చంపినా చావదాత్మ. ఎలా చంపుతాడు. మరి హింసించట మేమిటంటారు. ఆత్మ సర్వత్ర ఆకాశంలాగా కనిపిస్తున్నా దాన్ని అలాగే పట్టుకోలేక దేహేంద్రియాదుల మేరకే దించి అదే ఆత్మ మరేదీ గాదని భావించటమే హింసించటం. అంటే దాన్ని చూడకపోవటమే చంపటం. చచ్చిన వాడెలా మనమే కనపడడో అలాగే మనం చూడకుండా మరుగుపడిన ఆత్మ కూడా మనకు కనపడదు. కనపడ లేదంటే అది మన అపరాధమే కాబట్టి మనమే దాన్ని చంపుకొన్నట్టయిందని భంగ్యంతరంగా బోధిస్తున్నది గీత. ఇక్కడ ఆత్మనా అంటే తన విశేష దృష్టితో ఆత్మాన మంటే సామాన్యరూపమైన తన ప్రత్యగాత్మను అని భావం. పోతే జ్ఞాని అలాటి విశేష దృష్టికి పూర్తిగా స్వస్తి చెప్పి నిత్యమూ ప్రత్యగ్రూపంగానే సర్వాన్నీ దర్శిస్తుంటాడు కాబట్టి వాడి కాత్మ ఏమాత్రమూ మరుగు పడక ప్రకాశిస్తుంటుంది. ఆత్మ ప్రకాశిస్తుంటే అనాత్మ ఎక్కడిదిక. అది కూడా ఆత్మగానే దర్శనమిస్తుంది. కనుక జీవన్ముక్తుడు జ్ఞాని.

  ఇలా ప్రారబ్ధవశాత్తూ జీవిత శేషమాత్మ దృష్టితోనే గడిపి ప్రారబ్ధం తీరి రేపు దేహపాతమైతే అప్పుడేమిటి అనుభవమని అడిగితే చెబుతున్నాడు. తతోయాతి పరాంగతిం. సానిష్ఠా సా పరాగతిః అని ఉపనిషత్తు చెప్పినట్టు పరమమైన దశనే అందుకొంటాడు. నేహ భూయో భిజాయతే అనిగదా ఇంతకు పూర్వమే పేర్కొన్నాడు మహర్షి మరలా జన్మించే ప్రసక్తి లేదని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు