అనుభవిస్తావు. అదే అమృతత్వం. అదే మోక్షం. జీవిత సమస్య కదే పరిష్కారం.
సమం పశ్యన్ హి సర్వత్ర - సమవస్థిత మీశ్వరం
నహిన స్వాత్మనా త్మానం - తతోయాతి పరాంగతిమ్ - 28
పోతే మోక్షమనేది రెండు విధాలు - బ్రతికుండగా అనుభవించే దొకటి. దానికే జీవన్ముక్తి అని పేరు. మరొకటి రేపు దేహ పాతమైన తరువాత కలిగేది. దానికే విదేహముక్తి అని పేరు. విదేహమంటే దేహం పడిపోయిన తరువాత అని గాదు. అది మరణించే ప్రతివాడికీ జరిగే విషయమే. మరేమిటంటారు. పడిపోయిన పిమ్మట మరలా దేహమనేది లేకుండా పోవాలి. అంటే పునర్జన్మ రాగూడదు. అదీ విదేహ మంటే. అలాగైతేనే అది మరణం గాదు ముక్తి అనిపించుకొంటుంది. ఇప్పుడీ రెండూ అనుభవానికి వస్తాయి జ్ఞానానికి. న హినస్త్యాత్మనాత్మాన మనే వాక్యం జీవన్ముక్తిని చెబితే తతో యాతి పరాంగతి మనేది విదేహ ముక్తిని సూచిస్తుంది.
అయితే రెండు ఫలితాలూ చవి చూడాలంటే మాత్రం రెండింటికీ ఉండవలసిన షరతొక్కటే. అది సమ్యగ్దర్శనం. అంటే ఆత్మనే దర్శిస్తూ ఉండాలి. మరేదీ చూడగూడదు. అదే చెబుతున్నాడు మహర్షి. సమంపశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం. ఈశ్వరుణ్ణి పశ్యన్ చూస్తుండాలట.