#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అనటం వల్ల కేవలమాత్మా కార వృత్తి తప్ప పూజా సామగ్రి మంత్ర తంత్రాదులు - యోగాభ్యాసాదులూ ఈ కలాపమంతా అక్కర లేదని తేలిపోయింది. అలాగే ఆత్మని అన్నందువల్ల దేశకాలాదులూ ఆసనాది నియమ నిష్ఠలూ - అన్నింటికీ తిలాంజలి ఇచ్చినట్టయింది. అప్పటికిందులో బాహ్యమైన సామగ్రి ఏదీ లేదు. మనస్సులో కూడా మరొక ఆలోచన లేదు. కేవలం సచ్చిద్రూపంగా వ్యాపించిన నాస్వరూపాన్నే తదాకారంగా మారిన నా అంతః కరణంలోనే సచ్చిదాకారమైన వృత్తితోనే నిరంతరమూ దర్శిస్తూ పోవటమే ఉత్తమమైన సాధన. లోకంతో వ్యవహరిస్తున్నా ఆ దృష్టి ఏమరకుంటే చాలు మాకు. వ్యవహారం దాని కడ్డురాదు.

  పోతే రెండవది అన్యేసాంఖ్యేన యోగేన. సాంఖ్యమన్నా ఇక్కడ కపిలుడు చెప్పిన సాంఖ్యం కాదు. అద్వైతులు చెప్పే జ్ఞానమూ గాదు. వివేచనా బుద్ధి. ఇవన్నీ నేను చూచే విషయాలు. నా జ్ఞానానికివి కేవలం గోచరించే భావాలే. కాగా వీటిని దర్శిస్తుండటం మాత్రమే నా స్వరూపం. నేను నిర్వ్యాపారుణ్ణి. ఇదంతా వ్యాపారం. ఏ పనీ లేని నేను నా జ్ఞానంతో ఈనామ రూపక్రియ లన్నింటినీ కేవలం సాక్షిగా దర్శిస్తున్నాను. అంతమాత్రమే. అవి గుణాత్మకమైతే నేను గుణరహితుడనని తన స్వరూపాన్ని వాటికి విలక్షణంగా భావించటం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు