ప్రతిక్షణమూ అలా ప్రసరిస్తున్నట్టు చూస్తుంటాడు మానస వాచిక కాయిక కర్మలన్నింటినీ. కర్మణ్య కర్మ అని ఇంతకు ముందే ఈ విషయం నలగ గొట్టింది గీత. కనుక జ్ఞానికి కర్మ లేదు. కర్మగా చూడడు దాన్ని. జ్ఞానంగా చూస్తాడు. కాబట్టి నస భూయోభి జాయతే. వాడు చేసేది ఏదీ కర్మ కాదు కాబట్టి దాని వల్ల మరలా జన్మ ఎత్తట మనేది ఉండబోదు జ్ఞానికి.
అదేమిటి. జ్ఞానోదయమైన తరువాత నంటే సరేగాని అంతకుముందు చేసిన కర్మ లేమయి పోతాయి. అవి జన్మనివ్వవా అని ప్రశ్న వస్తుందిక్కడ. ఎందుకంటే తరువాత చేస్తున్నదైతే జ్ఞానాగ్నిలో దగ్ధమైతే కావచ్చు గాని అంతకు ముందు చేసిన కర్మలలా దగ్ధం కావు గదా. అవి కూడా దగ్ధం కావలసిందే. ఎలాగంటే జ్ఞానమెప్పుడు దయించిందో అప్పుడా జ్ఞానదృష్టికి పూర్వముత్తర మనే తేడా లేకుండా అన్ని కర్మలూ జ్ఞానాత్మకంగానే భాసిస్తాయి. అప్పుడది జ్ఞానానికి పూర్వమైనా ఉత్తరమైనా అంతా జ్ఞానమే. పూర్వోత్తరాలనే తేడా లేదు. తేడా కనిపిస్తే అదేమి జ్ఞానం. కాబట్టి జ్ఞానికి కర్మలేదు. కర్మ లేకుంటే జన్మ లేదు. కాని ఒక్క మాట. సంచితాగామి కర్మలు లేకపోయినా ప్రారబ్ధమనేది ఉంటుంది. అది జ్ఞానానికి ముందే వచ్చి కూచున్నది. దాని ఫలితాలే ఈ ఉపాధి ఈ కష్టసుఖానుభవం. అయితే అది ఈ ఉపాధి ఉన్నంతవరకే దాని ప్రభావం చూపుతుంది. శరీర పాతమైన మరుక్షణం మాసిపోతుంది. కనుక మరలా జన్మనిచ్చే ప్రసక్తి దానికీ లేదు.