ప్రపంచమెక్కడ ఉంది. ఉన్నట్టు కనిపిస్తున్నది గదా అంటే అది ఆత్మ తాలూకు విభూతే విస్తారమే. దాని విభూతి అది గాక అన్యమెలా కాగలదు. అందుకే మొదటినుంచీ సగుణ నిర్గుణాత్మకంగా భగవత్తత్త్వాన్ని వర్ణిస్తూ వచ్చాడు మహర్షి. నిర్గుణం గుణభోక్తృచ అని చేసినదంతా ఇలాటి వర్ణనే గదా. ఇక ఆత్మానాత్మలనే విభాగమేముంది. ఆ విభాగ రేఖ చెరిగిపోయి ఏకాత్మ లేదా సర్వాత్మ భావమే బలపడుతున్నది.
అయితే ఎటు వచ్చీ ఈ రహస్యం గుర్తించాలి. స్వానుభవానికి తెచ్చుకోవాలి సాధకుడు. అంతవరకూ అది వస్తు సిద్ధమే గాని ఆ సత్యం బుద్ధి సిద్ధం కాజాలదు. అదే ప్రస్తావిస్తున్నా డిప్పుడు మహర్షి య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై స్సహ. ఏ మానవుడైతే ఈ జీవుడా ఈశ్వరుడేనని ప్రకృతితో దాని గుణాలతో సహా ఏకం చేసి పట్టుకొంటాడో అప్పుడు వాడి దృష్టికిక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగమే లేకుండా పోతుంది. అవిద్యా లక్షణాం స్వవికారై స్సహ అభావ మాపాదితా మని భాష్యకారులు మరొక విధంగా వ్యాఖ్యానించి ఈ ఏకాత్మ భావాన్నే బలపరుస్తున్నారు. మొత్తం మీద ఆత్మకు భిన్నంగా మరేదీ కనపడగూడదు. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ కనిపించినా అది తన విభూతిగానే చూస్తూ దానితో వ్యవహరిస్తూ పోవాలి జ్ఞాని.
అలా వ్యవహరించగలిగితే సర్వధా వర్తమానోపి. వాడెలాగైనా నడచుకోనివ్వండి జీవితంలో. అది కర్మ కిందికి రాదు. తన జ్ఞానమే