గనుక ఆత్మ భోక్త అవుతున్నది. పోతే మహేశ్వరః సర్వాత్మకమూ స్వతంత్రమూ గనుక ఆత్మ మహేశ్వరం. అంతే కాదు. చివరకు పరమాత్మ కూడా. ఎలాగంటే దేహం మొదలు బుద్ధి వరకూ ఎక్కడికక్కడ అజ్ఞాన వశాత్తూ మన మాత్మ అని భావిస్తుంటే వాటన్నిటినీ దాటిపోయిన అసలైన ఆత్మ కాబట్టి ప్రత్యగాత్మనే పరమాత్మ అని పేర్కొన్నారు. ఎవరన్నారు. ఎక్కడ అన్నారు. ఉదాహృతః - అభిజ్ఞులైన పెద్దలందరూ అంటున్నారు. ఎక్కడని. దేహేస్మిన్. ఈ మానవుడి శరీరంలోనే. అప్పటికి మన ప్రత్యగాత్మే పరమాత్మ అని చెప్పినట్టయింది. సర్వత్రా ఉందని చూస్తే చైతన్యం పరమాత్మ. అదే మన శరీరంలో కూడా ఉందని చూస్తే ప్రత్యగాత్మ. దీన్నిబట్టి క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అనే మాట అక్షరాలా సత్యమని మరలా ఈ శ్లోకం ద్వారా చాటుతున్నాడు మహర్షి. అప్పటికి వ్యష్టిరూపంగా సమష్టి రూపంగా రెండు విధాలా ఉన్నది పరమాత్మే మరేదీ గాదు. దీనితో జీవేశ్వరైక్యం చెప్పకుండానే ఆరూఢమయింది మనకు.
య ఏవం వేత్తి పురుషం - ప్రకృతించ గుణై స్సహ
సర్వధా వర్తమానోపి నస భూయోభి జాయతే - 23
ఒక జీవేశ్వరైక్యమే కాదు. జగదీశ్వరైక్యం కూడా. ఎందుకంటే జీవుడు చిద్రూపుడైతే జగత్తు సద్రూపం. చిద్రూపమే గాక సద్రూపం కూడా పరమాత్మే గదా. సచ్చిదాత్మకమైనదే ఆత్మ తత్త్వమన్నప్పుడిక అనాత్మ