నిర్వర్తిస్తుంటే అలాటి పనులేవీ పెట్టుకోకుండా వాటికి తాను విలక్షణంగా ఉండి వాటి దగ్గరే కూచొని వాటి పనులు చూస్తుంటుంది ఆత్మ. లేదా ఇలా చెప్పినా చెప్పవచ్చు ఆ మాట కర్థం. దేహచక్షుర్మునో బుద్ధులు కూడా ఒక విధంగా ద్రష్టలే. అందులో బాహ్యమైన దేహం మెదలుకొని లోలోపలికి మనం ప్రయాణం చేస్తే చివరకిక దేనికన్నా ద్రష్ట లేదో అది ఉపద్రష్ట. యజ్ఞోప ద్రష్టలాగా అన్నింటినీ తనకు విషయంగా దర్శిస్తాడు కాబట్టి.
అనుమంతాచ. ఏది జరుగుతున్నా అనుమోదించేవాడని అర్థం. కార్యకరణాలు పని చేస్తుంటే తాను చేయకపోయినా వాటి కనుకూలుడుగా కనిపిస్తాడు కాబట్టి అనుమంత అన్నారు. అదే గాక అవి ఆయా కార్యాలు చేస్తుంటే వద్దని వాటిని నివారించక చూస్తుంటాడు కాబట్టి కూడా అనుమంత అనవచ్చు. అలాగే భర్తా. భరించేవాడని అర్థం. దేహేంద్రియ మనో బుద్ధులు స్వయంగా చైతన్యాత్మకం కాకపోయినా వాటికి చైతన్యాన్ని ప్రసాదించటమే వాటిని భరించటం. ప్రసాదించటమంటే కర్తృత్వముందని గాదు మరలా. దాని వెలుగులో అవి పనిచేస్తున్నాయని భావం. భోక్తా. సాక్షాత్తుగా కాకున్నా ఆయా సుఖదుఃఖాది ప్రత్యయాదులు బుద్ధి కేర్పడి అనుభవానికి రావాలంటే బుద్ధికి ఆత్మ నుంచి చైతన్యం సంక్రమించాలి. అది చైతన్యంతో కూడి పని చేయటానికి నిమిత్త భూతం