అన్నప్పుడసలు జీవుడనే వాడెక్కడున్నాడు. సకల క్షేత్రాలలో ఉన్నదొక్క ఈశ్వరుడే. అయినా తాను కర్తనూ భోక్తనూ అనుకొనే చైతన్యమొకటి ఉందంటే ఆశ్చర్యమే. ఆశ్చర్యమైనా మనకిప్పు డనుభవంలో ఉన్నదీ జీవభావం. అనుభవానికి వస్తున్న దాని నెప్పుడూ కాదనలేము. నహి దృష్టే అనుప పన్నం నామ అన్నారాచార్యుల వారు. ఒక పక్క కనిపిస్తుంటే ఎలా చెల్లుతుందనే ప్రశ్న రాగూడదు. చెల్ల కుంటే ఎలా కనిపిస్తుందని ప్రశ్న మీద ప్రశ్న వస్తుంది. అది అనవస్థా దోషానికి దారి తీస్తుంది. కాబట్టి జీవుడున్నాడని ఒప్పుకోవాలి తాత్కాలికంగానైనా. కాని అది ఎలా ఏర్పడిందని గదా అడుగుతున్నావు. ఎలా ఏర్పడిందో చెబుతున్నాడు వినండి. పురుషః ప్రకృతిస్థః - ప్రకృతిస్థుడయి నందు వల్లనే వీడు జీవుడయి బయటపడ్డాడు. ప్రకృతి అంటే అవిద్యా లక్షణా కార్యకరణ రూపేణ పరిణతా అని అర్థం వ్రాస్తున్నా రాచార్యుల వారు. కార్యకరణ రూపంగా పరిణమించిన ఏ అవిద్య లేదా అజ్ఞానమనేది ఉందో దానికి ప్రకృతి అని పేరిక్కడ.
అలాంటి ప్రకృతిలో స్థ. కూచున్నాడీ జీవుడు. కూచోటమంటే అదే నేనని దానితో తాదాత్మ్యం చెందటం. దేనితో. ప్రకృతి వికారామైన దేహేంద్రియ సంఘాతంతో. ప్రకృతి మాత్మత్వేన గతః అని భాష్యకార వచనం. ఎప్పుడైతే అదే తానయిపోయాడో. భుంక్తే ప్రకృతి జన్ గుణాన్. ప్రకృతి గుణాల ననుభవించక తప్పదు. ప్రకృతి గుణాలంటే ముందే చెప్పాము