కార్యకరణ కర్తృత్వే - హేతుః ప్రకృతి రుచ్యతే
పురుష స్సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే - 20
కార్యమంటే శరీరం. కరణమంటే అందులోనే ఉండే మనః ప్రాణ చక్షుః శ్రోత్రాదులైన ఇంద్రియాలు. ఇంతకు ముందు పేర్కొన్న ప్రకృతి వికారాలన్నీ కార్యం క్రిందికి వస్తాయి. గుణాలని పేర్కొన్నారే సుఖదుః ఖాదులు - అవన్నీ కరణ వర్గం క్రిందికి వస్తాయి. కార్యకరణ కర్తృత్వే -ఇప్పుడీ కార్యకరణాదు లన్నింటినీ సృష్టించటంలో కారణభూత మైనదా ప్రకృతే. ఏ ప్రకృతి. త్రిగుణాత్మకమైన అపరా ప్రకృతి. ఇదే నికృష్టమైనది. సంసార హేతువిదే నని గదా ఇంతకు పూర్వం చెప్పారు.
పోతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడనే వాడున్నాడే. వీడే జీవుడు. వీడు పరా ప్రకృతి. ఈశ్వర స్వరూపుడు వీడు. అంటే ఈశ్వరుడి లాగా చిన్మాత్రుడు. చిన్మాత్రుడు గనుకనే అసంగుడు కూడా. అయినా ప్రకృతి గుణాలు తనవే నని వాటితో తాదాత్మ్యం చెందాడు. చెందాడా నిజంగా. చెందలేదు. వీడు ద్రష్ట. అది దృశ్యం. రెండూ ఒకటెలా అవుతాయి. అసలు జ్ఞానం నిరాకారం. జ్ఞేయమైన గుణవికారాలు సాకారం. ఇది విషయి. అది విషయం. ఎలా ఏర్పడుతుంది సంబంధం. అయినా సుఖదుఃఖాదు లనుభవించవలసి వస్తున్నది వీడు. దానికి వీడు హేతువెలా కాగలిగాడు. సంబంధమే లేని రెండింటికీ సంబంధం కలుపుతున్న దెవరు.