#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అవి ఈశితవ్యం. ఈశితవ్యమైన To be commanded ప్రకృతి ద్వయం లేకుంటే ఆయన ఎవరికీశ్వరుడు. కాబట్టి ప్రకృతి పురుషులిద్దరూ ఆయనతో పాటు అవినాభావంగా ఉండవలసిందే తప్పదు.

  అయితే ఈ అపర ప్రకృతి ఉన్నదే అది ఊరక ఉండే బాపతు కాదు. త్రిగుణాత్మిక అది. వికారాలనూ గుణాలనూ అనేక విధాలుగా సృష్టిస్తూ పోతుంది. ఆప్రకారంగా పరిణమిస్తూ Evolution పోతుందని అర్థం. మానవుడి బుద్ధి దగ్గర నుంచి దేహేంద్రియాల వరకూ ఇవి వికారాలు. వీటి ద్వారా అనుభవానికి వచ్చే సుఖదుఃఖ మోహాత్మకమైన భావాలన్నీ గుణాలు. వికారాంశ్చ గుణాం శ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ వికార గుణాత్మకంగా పరిణమించటమే దాని స్వభావం. స్వభావమే ప్రకృతి అంటే. అయితే ఇది సాంఖ్యులు పేర్కొనే ప్రధానం కాదు. వేదాంతులు చెప్పే మాయా శక్తి. ఈశ్వరాధీనమిది. ఈశ్వరస్య వికార కారణా శక్తిః అని అర్థం చెప్పారు భాష్యకారులు. ఇంతకూ ఇదంతా అపరా ప్రకృతి. వికారాలూ గుణాలూ అన్నీ దీనివల్లనే ఏర్పడుతున్నాయి. సంసార మంతా దీని పుణ్యమే. పోతే దీని ఫలితమిది అనుభవించదు. అచేతనం గదా ఇది. ఎలా అనుభవిస్తుంది. చేయటం వరకే ఇది. అనుభవించేది ఇది గాదు. పురుషుడు. అంటే జీవుడు. ఇది కర్త అయితే భోక్త వాడు. ఇద్దరూ రెండు డ్యూటీలూ పంచుకొన్నారా అనిపిస్తుంది. రెండూ కలిసి ఈ సంసారయాత్ర ఎడతెగకుండా సాగిస్తున్నాయి. ఆ విషయమే వర్ణిస్తున్నాడిప్పుడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు