వ్యాపించిన ఆఈశ్వర స్వరూపుడనే అని గుర్తించే ఉపాయమే ఆజ్ఞానమనేది. ఈశ్వరా కార వృత్తి మాత్రమే అది. ఏతావతా తేలిన సారాంశమేమిటి. ఈశ్వర చైతన్యమొక్కటే సత్యం. అచేతనమైన ఈ జగత్తు దాని విభూతే. అది విభువైతే ఇది విభూతి. కాగా ఇదంతా దాని విభూతేనని అర్థం చేసుకొని దీని ద్వారా ఆ ఈశ్వరుణ్ణి కేవలం నా స్వరూపంగా దర్శించే జ్ఞాన మభ్యసించటమే మన కర్తవ్యమని మహర్షి తాత్పర్యం. అందుకే మూడింటినీ విడిగా చెప్పినా చివర కవి మూడూ వేరుగావు. సచ్చిద్రూపంగా మూడూ ఒకటే సుమా అని సమాసతః అని సూచన చేస్తున్నాడాయన. ఇదంతా మనసులో పెట్టుకొనే భగవత్పాదులు ఏతావాన్ సర్వోహి వేదార్థః గీతార్ధశ్చ ఉపసంహృత ఉక్తః - వేదాలన్నీ గీత మొత్తం మనకు బోధిస్తున్న విషయమిది ఒక్కటేనని తెగేసి చెప్పారు.
సరే మంచిదే. కాని ఇప్పుడు క్షేత్రం కూడా క్షేత్రజ్ఞ స్వరూపమే కేవల మాయన విభూతే ఇదంతా ఆయన విస్తారమేనని తేల్చారే అది గ్రహించటమే జ్ఞానమని కూడా అన్నారే ఇప్పుడా జ్ఞానమేమిటి దాని ద్వారా ఏకైకమైన తత్త్వాన్ని ఎలా పట్టుకోవాలి. పట్టుకొంటే మనకు కలిగే ఫలితమేమిటనే ప్రశ్న వస్తే దాన్ని వివరిస్తున్నాడు మహర్షి., మద్భక్త ఏత ద్విజ్ఞాయ మద్భావా యోపపద్యతే. నాభక్తుడెవడైతే ఉంటాడో వాడే దీన్ని బాగా అర్థం చేసుకొని నా స్వరూపాన్నే అందుకోగల డంటున్నాడు. ఇక్కడ మూడు మాటలున్నాయి